Dunki Drop 3: షారుక్ ఖాన్ డంకీ నుంచి డ్రాప్ 3 వచ్చేసింది.. అదిరిపోయిన సాంగ్
Dunki Drop 3: షారుక్ ఖాన్ నటిస్తున్న డంకీ మూవీ నుంచి డ్రాప్ 3 వచ్చేసింది. కింగ్ ఖాన్ ఫేవరెట్ అయిన ఈ పాటను శుక్రవారం (డిసెంబర్ 1) మేకర్స్ రిలీజ్ చేశారు.
Dunki Drop 3: డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటైన షారుక్ ఖాన్ డంకీ నుంచి డ్రాప్ 3 శుక్రవారం (డిసెంబర్ 1) రిలీజైంది. డ్రాప్ 2 లుట్ పుట్ గయా సాంగ్ మానియా నుంచే ఇంకా పూర్తిగా కోలుకోక ముందే షారుక్ ఫేవరెట్ అయిన నిక్లే థే కభీ హమ్ ఘర్ సే అని సాగిపోయే ఈ పాట వచ్చింది. డంకీపై ఉన్న బజ్ ను మరింత పెంచేలా ఈ పాట ఉంది.
ప్రభాస్ సలార్ మూవీతో పోటీ పడుతున్న డంకీ మూవీ.. ఎక్కడా ఏమాత్రం వెనుకబడిపోకుండా జాగ్రత్త పడుతూ తమ సినిమాపై ఉన్న అంచనాలను రోజురోజుకూ పెంచుతూనే ఉంది. షారుక్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా కావడంతో సహజంగానే డంకీ.. బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందని భావిస్తున్నారు.
డంకీ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ సాంగ్ భావోద్వేగాలను తట్టి లేపేలా ఉంది. సోనూ నిగమ్ పాడిన ఈ పాటను ప్రీతమ్ కంపోజ్ చేశాడు. జావెద్ అక్తర్ ఈ పాటకు లిరిక్స్ అందించాడు. ఇంటి నుంచి దూరంగా ఉంటూ తమ ఇంటిని మిస్ అవుతున్నామని ఫీలయ్యే ప్రతి వ్యక్తి మనసునూ తాకేలా ఈ పాట ఉంది. డంకీ ట్రైలర్ పై ఈ పాట మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఈ లేటెస్ట్ డ్రాప్ గురించి చెబుతూ షారుక్ ఖాన్ ఓ ఎమోషనల్ క్యాప్షన్ ఉంచాడు. "ఇవాళ ఎందుకో నా మనసుకు తోచింది. దీంతో ఈ పాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. రాజు, సోనూ పేర్లు వింటే మన వాళ్లే అన్న భావన కలుగుతుంది. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఈ పాట కూడా మన వాళ్లదే. మన ఇంట్లోని వాళ్ల జ్ఞాపకాలది. మన మట్టిది.
మన దేశం ఒడిలో ఓ రకమైన హాయి దొరుకుతుంది. మనమందరం ఎప్పుడో ఒకసారి ఇంటి నుంచి, ఊరి నుంచి, పట్టణం నుంచి దూరంగా వెళ్తాం. మన జీవితం కోసం. కానీ మన మనసులు మాత్రం ఇంట్లోనే ఉండిపోతాయి. డంకీలో నా ఫేవరెట్ ఇది" అని షారుక్ అన్నాడు.
ఇంటి నుంచి దూరంగా ఉండే ప్రతి ఒక్కరి మనసును తాకే పాట ఇది అని షారుక్ స్పష్టం చేశాడు. డంకీ మూవీ డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రెండు మెగా మూవీస్ మధ్య బాక్సాఫీస్ వార్ నడవనుంది. ఈ సినిమాలో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్ లాంటి వాళ్లు కూడా నటించారు.