Dulquer Loves Telugu: తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న మలయాళ హీరో.. టాలీవుడ్‌లో పనిచేయడానికి ఆసక్తి -dulquer salman says he loves telugu and likes working in tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dulquer Loves Telugu: తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న మలయాళ హీరో.. టాలీవుడ్‌లో పనిచేయడానికి ఆసక్తి

Dulquer Loves Telugu: తెలుగు భాషపై మక్కువ పెంచుకున్న మలయాళ హీరో.. టాలీవుడ్‌లో పనిచేయడానికి ఆసక్తి

Maragani Govardhan HT Telugu
Mar 21, 2023 02:31 PM IST

Dulquer Loves Telugu: మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు భాషపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు తెలుగు భాషంటే ఎంతో ఇష్టమని, భావ వ్యక్తీకరణ ఈ భాషలో బాగుంటుందని స్పష్టం చేశాడు.

దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్

Dulquer Loves Telugu: తెలుగు ప్రేక్షకులను ఏదైనా సొంతమని భావిస్తే.. వారిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తారనేది వాస్తవం. ముఖ్యంగా సినిమాల విషయంలో చాలాసార్లు ఇది నిరూపితమైంది. డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ సుపరిచితులైన ఎంతోమంది నటులను ఆదరించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ ముందు వరుసలో ఉంటారు. ఓకే బంగారం లాంటి డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దుల్కర్‌ను మహానటితో అతడి నటనను ఆదరించారు. ఇంక సీతా రామం సినిమాతో అయితే ఏకంగా మరో ఎత్తుకు తీసుకెళ్లారు. దీంతో తెలుగు ప్రేక్షకులు, చిత్రసీమ గురించి దుల్కర్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. తెలుగులో సినిమాలు చేయడమంటే తనకిష్టమని తెలిపాడు.

"నాకు హైదరాబాద్ రావడమంటే ఎంతో ఇష్టం. ఇక్కడ నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. సొంతింటికి దూరంగా మరో సొంతింటికి వచ్చినట్లుంటుంది. పాత వాటిని మర్చిపోకుండా.. కొత్త విషయాలను ఈ నగరం స్వీకరిస్తుంది. మహా నటి నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. బెంగళూరు డేస్, ఓకే బంగారంతో ఇక్కడ ప్రేక్షకులకు తెలిసినప్పటికీ.. మహా నటితో మంచి గుర్తింపు లభించింది. అందుకే ఇక్కడ సినిమాలు చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలని పాత్రలను ఆచితూచి ఎంచుకుంటున్నా. తెలుగు భాషంటే కూడా ఇష్టం ఏర్పడింది. ఈ భాషలో భావ వ్యక్తీకరణ బాగుంటుంది." అని దుల్కర్ సల్మాన్ తెలుగులో సినిమాలు చేయడంపై తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

బాహుబలి కారణంగా భాషా సరిహద్దులు చెరిగిపోయాయని, ఇది చాలా శుభపరిణామమని దుల్కర్ అన్నాడు. "నాకు ఎందుకో చాలా రోజుల నుంచే ఇతర భాషల్లో తెలుగు చిత్రాలను ఆదరించినట్లు అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్లినా ఇక్కడ పాటలు, సినిమాలు తరచూ ప్లే అవుతుంటాయి. కానీ ప్రభాస్, బాహుబలి చిత్రానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా వల్ల భాషా సరిహద్దులు తెరుచుకున్నాయి. సినీ నిర్మాతలు పెద్ద కలలు కంటున్నారు. థియేటర్లలో విడుదలను ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఓటీటీ కంటెంట్ వినియోగించే విధానాన్ని మార్చినప్పటికీ ప్రజలను థియేటర్లకు తీసుకొచ్చేలా కొనసాగించడమే ఏకైక మార్గం." అని దుల్కర్ అన్నాడు.

ఈ ఏడాది సీతా రామం సినిమాతో పాన్ఇండియా వ్యాప్తంగా సూపర్ సక్సెస్ అందుకున్న దుల్కర్.. భాషతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. తెలుగులో తన తదపరి చిత్రం గురించి మాట్లాడుతూ.. ఈ మధ్యే తనకు ఓ మంచి కథ నచ్చిందని తెలిపాడు. అయితే అది ప్రస్తుతం చర్చల దశలోనే ఉందని, త్వరలోనే వివరాలను తెలియజేస్తానని తెలిపారు. ప్రస్తుతం ఇంకా కథలను వింటున్నట్లు పేర్కొన్నాడు.

Whats_app_banner

సంబంధిత కథనం