Vazhakku: హీరోతో గొడవ.. సినిమాను నేరుగా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసిన డైరెక్టర్
Vazhakku Movie: వజక్కు సినిమాను నేరుగా ఓ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍లో రిలీజ్ చేసేశారు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్. హీరోతో గొడవ కారణంగా థియేటర్లలో రిలీజ్ వీలుకాకపోవటంతో ఇలా చేశారు. ఆ వివరాలివే..
Vazhakku Movie: మలయాళ యంగ్ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించిన వజక్కు సినిమా విషయంలో చాలా ట్విస్టులు, వివాదాలు నడిచాయి. 2021లోనే ఈ చిత్రం పూర్తవగా.. ఇప్పటి వరకు థియేటర్లలో రిలీజ్ కాలేదు. దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్, హీరో టొవినో థామస్ మధ్య ఈ సినిమా విషయంలో వివాదం నెలకొనడమే ఇందుకు కారణం. అయితే, ఇంతకాలం వేచిచూసిన దర్శకుడు శశిధరన్.. సడన్‍గా ఇప్పుడు ఈ సినిమాను ఓ వీడియో ప్లాట్‍ఫామ్‍లో అప్‍లోడ్ చేసేశారు.
ప్లాట్‍ఫామ్ ఇదే..
వజక్కు చిత్రాన్ని ‘వీమియో’ ప్లాట్‍ఫామ్‍లో డైరెక్టర్ సనల్ కుమార్ శశిధరన్ అప్‍లోడ్ చేశారు. ఈ ప్లాట్‍ఫామ్ కూడా దాదాపు యూట్యూబ్ లాంటిదే. వీమియో (Vimeo) ప్లాట్‍ఫామ్‍లో వజక్కు చిత్రాన్ని యూజర్లు ఉచితంగా చూసేలా అందుబాటులోకి తెచ్చారు శశిధరన్. రెండేళ్ల క్రితమే ఈ మూవీని ఆయన వీమియోలో అప్‍లోడ్ చేయగా.. ఇప్పుడు తాజాగా అందరికీ అందుబాటులో ఉండేలా చేశారు.
థియేటర్లలోకి ఎందుకు రాలేదంటే..
వజక్కు చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు హీరో టొవినో థామస్ అంగీకరించలేదని దర్శకుడు శశిధరన్ ఫేస్‍బుక్‍లో పోస్ట్ చేశారు. తన కెరీర్‌పై ప్రభావం చూపుతుందనే కారణంతో థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ మూవీని రిలీజ్ చేయకుండా థామస్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. 2020లోనే ఈ షూటింగ్ పూర్తయిందని, 2021లోనే పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ అయినా టోవినో వల్ల ఈ చిత్రం రిలీజ్ కాలేదని శశిధరన్ చెప్పారు.
గతేడాది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ (IFFK)లో వజక్కు మూవీ ప్రదర్శితమైంది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూడు విభాగాల్లో అవార్డులు కూడా వచ్చాయి. అయితే. హీరో, దర్శకుడు మధ్య విభేదాలతో థియేటర్లలోకి రాలేకపోయింది.
వివరణ ఇచ్చిన టొవినో
దర్శకుడు సనల్ శశిధరన్ చేసిన ఆరోపణలకు హీరో టొవినో థామస్ స్పందించారు. తన కజిన్, సహనిర్మాత గిరీశ్ చంద్రన్‍తో కలిసి ఇన్‍స్టాగ్రామ్ లైవ్‍లో మాట్లాడారు. ఈ సినిమా నిర్మాణం కోసం తాను రూ.27లక్షలను ఖర్చు చేశానని, తనకు ఎలాంటి రాబడి రాలేదని చెప్పారు. ఈ సినిమా విడుదల కాకపోవడానికి దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ కారణం అని చెప్పారు. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ (MAMI)లో ప్రదర్శించేందుకు కూడా ఆయన అంగీకరించలేదని టొవినో చెప్పారు. ఈ మూవీ క్రియేటివ్ హక్కులను అప్పగించేందుకు కూడా సనల్ సిద్ధంగా లేదరని, ఓటీటీలో రిలీజ్ చేయాలన్నా అది అవసరమని టొవినో థామస్ వివరించారు.
దీనికి సనల్ సుకుమార్ శశిధరన్ స్పందించారు. వీమియో ప్లాట్‍ఫామ్‍లో తాను అప్‍లోడ్ చేసిన సినిమాను ఇప్పుడు అందరూ ఉచితంగా చూసేలా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. ఆ లింక్‍ను ఫేస్‍బుక్‍లో పోస్ట్ చేశారు. "సినిమాను ప్రేక్షకులు చూడాలి. ఎవరైతే చూడాలని అనుకుంటున్నారో వారి కోసం వజక్కు చిత్రం ఇక్కడ ఉంది. ఈ చిత్రం ఎందుకు రిలీజ్ కాలేదో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది” అంటూ లింక్‍ను కూడా ఫేస్‍బుక్‍లో పెట్టారు సనల్.
వజక్కు చిత్రంలో టొవినో థామస్‍తో పాటు కునీ కుశృతి, సుదేవ్ నాయర్, అజీస్ నెడుమంగద్, బైజూ నీటో కీలకపాత్రలు పోషించారు. పారట్ మౌంట్ పిక్చర్స్, టొవినో థామస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందించారు.