2018 Movie success Meet: మీ తెలుగువారి ప్రేమను ఎవరూ వద్దనుకోరు.. 2018 సక్సెస్ మీట్‌లో హీరో టోవినో థామస్ స్పష్టం
2018 Movie success Meet: 2018 మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో టోవినో థామస్ ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన మూవీస్ తెలుగులో కూడా డబ్ అవుతాయని అన్నారు.
2018 Movie success Meet: డబ్బింగ్ సినిమాగా విడుదలై తెలుగు నాట వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోన్న సినిమా 2018. కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీలో టోవినో థామస్ హీరోగా చేశారు. జ్యూడ్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. కేవలం సినీ విమర్శకుల ప్రశంసలనే కాకుండా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తెలుగులో ఈ మూవీకి వస్తోన్న రెస్పాన్స్ చూసిన చిత్రబృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో టోవినో థామస్ సహా దర్శకుడు జ్యూడ్ ఆంటోనీ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో టోవినో థామస్ మాట్లాడుతూ.. "కాలేజ్ ట్రిప్ కోసం 13 ఏళ్ల క్రితం తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చాను. కానీ ఇప్పుడు నేను చేసిన సినిమాలు ఆహాలో డబ్ అవడమే కాకుండా మంచి హిట్ టాక్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇప్పుడు 2018 మూవీకి మీరు చూపించి ఆదరణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను కచ్చితంగా నా తదుపరి సినిమాలు కూడా తెలుగులో విడుదలయ్యేటట్లు చూస్తాను. ఎందుకంటే మీరు చూపిస్తున్న ప్రేమను వదులోకోవాలని అనుకోరు." అని టోవినో థామస్ తెలిపారు.
దర్శకుడు జూడ్ ఆంటోనీ మాట్లాడుతూ.. "మా సినిమాను ఆదరించినందుకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలు ఇక్కడ విడుదల చేసిన బన్నీ వాసు గారు 2018లో కేరళ వరద సహాయంగా 63 లక్షల ఫండ్ ఇచ్చారు. యాదృచ్ఛికంగా ఆ వరదల నేపథ్యంలో తెరకెక్కిన మూవీని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. బన్నీ వాసు గారు సెల్ఫ్ లెస్ పర్సన్. మమ్మల్ని, ప్రేక్షకులు బాగా ఆదరించారు. మీరు ట్రీట్ చేసే విధానం చాలా హ్యాపీగా అనిపించింది." అని అన్నారు.
తెలుగులో విడుదల చేసిన ప్రముఖ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. "ఈ మూవీకి తెలుగులో పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా.. కంటెంట్ మనిషి హృదయాన్ని కదిలిస్తుందని నమ్మి విడుదల చేశాను. ఈ మూవీకి చాలా మంచి రివ్యూలు వచ్చాయి. 2018లో మా గీతా గోవిందం అక్కడ విడుదల చేయగా వచ్చిన డబ్బుతో కేరళ ఫండ్స్‌గా ఇచ్చాను. బహుశా అందుకేనేమో నాకు ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో చూపించే అవకాశం దక్కింది" అని బన్నీ వాసు అన్నారు.
కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ పతాకాలపై వేణు కున్నపల్లి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ మూవీకి దర్శకత్వం వహించారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో కుంచాకో బోబన్, అసఫ్ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.150 కోట్లతో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మే 26న తెలుగులో ఈ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
టాపిక్