Devara Storm: దేవర మేనియాతో ఊగిపోతున్న ప్రపంచం.. 11.6 లక్షల టికెట్ల అమ్మకం.. రూ.100 కోట్ల ఓపెనింగ్స్ ఖాయమేనా?
Devara Storm: దేవర మేనియాతో ప్రపంచం మొత్తం ఊగిపోతోంది. ఆరేళ్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సోలో రిలీజ్ కానుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఇప్పటికే 11.6 లక్షల టికెట్లు అమ్ముడవడంతో తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ ఖాయంగా కనిపిస్తోంది.
Devara Storm: దేవర సునామీ మరికొన్ని గంటల్లోనే మొదలు కానుంది. అర్ధరాత్రి దాటితే చాలు జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడటానికి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రపంచమంతా దేవర మేనియాతో ఊగిపోతోంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే 11.6 లక్షల టికెట్లు అమ్ముడవగా.. తొలి రోజు రూ.100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.
దేవర సునామీ ఇలా..
జూనియర్ ఎన్టీఆర్ చివరిసారి సోలో హీరోగా నటించిన మూవీ ఎప్పుడో ఆరేళ్ల కిందట అంటే 2018లో వచ్చింది. త్రివిక్రమ్ తో కలిసి అతడు నటించిన అరవింద సమేత వీర రాఘవ మూవీ ఆ ఏడాది రిలీజైంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ వచ్చినా.. అది మల్టీస్టారర్. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత దేవర రూపంలో మరో తారక్ మూవీ రాబోతోంది. దీంతో ఈ సినిమా కోసం జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం (సెప్టెంబర్ 27) దేవర ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా.. గురువారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 11.6 లక్షల టికెట్లు అమ్ముడైనట్లు ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ Sacnilk వెల్లడించింది. ఆ లెక్కన ఇండియాలో తొలి రోజే రూ.28.97 కోట్ల ఓపెనింగ్స్ ఖాయం. ఇవి కాకుండా కొన్ని బ్లాక్ చేసి ఉంచిన సీట్లకు సంబంధించి టికెట్లు కూడా అమ్ముడైతే తొలి రోజే ఇండియా వ్యాప్తంగా రూ.44 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మిగిలిన భాషల్లోనూ దేవర హవా
దేవర మూవీ తెలుగులో పలు రికార్డులను తిరగరాయడం ఖాయం. అందులో అనుమానం లేదు. అయితే ఈ తారక్ మూవీ హిందీ, తమిళంలాంటి భాషల్లోనూ టికెట్ల అమ్మకాలు జోరుగానే ఉన్నాయి. ఆ లెక్కన చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా దేవర మూవీ తొలి రోజే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ దాటడం ఖాయంగా కనిపిస్తోంది.
2018లో రిలీజైన అరవింద సమేత తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో అదో రికార్డు. ఇప్పుడు దేవర ఆ నంబర్స్ ను రెట్టింపు చేసేలా కనిపిస్తోంది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెస్లా కార్ల షో
దేవర మూవీ రిలీజ్ ను ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అమెరికాలోని డల్లాస్ నగరంలో ఉన్న అతని అభిమానులు మాత్రం వినూత్నంగా టెస్లా కార్ల లైట్ షోతో అలరించారు. టెస్లా కార్లను ఎన్టీఆర్ అనే ఇంగ్లిష్ అక్షరాల వరుసలో నిలబెట్టి.. దేవర మూవీలోని టైటిల్ సాంగ్ బీట్ కు అనుగుణంగా వాటి లైట్లను ఆర్పుతూ, వెలిగిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
డ్రోన్ కెమెరాలతో ఈ వీడియోను చిత్రీకరించడం హైలైట్ గా నిలుస్తోంది. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఇలా వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు.
దేవర ప్రీరిలీజ్ బిజినెస్
దేవర మూవీకి ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తెలంగాణలో మాత్రం ఇది మరో లెవల్లో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ ఇక్కడ సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే కనీసం రూ.53 కోట్లు అయినా వసూలు చేయాలని తాజాగా ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది. ఈ మూవీ హైదరాబాద్ లో రికార్డు స్థాయి థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
పైగా ప్రభుత్వం కూడా టికెట్ల ధరలను పెంచుకోవడానికి, అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. దీంతో మేకర్స్ ఈ టార్గెట్ అందుకుంటామన్న నమ్మకంతో ఉన్నారు. నైజాం ఏరియాలో కనీసం రూ.45 కోట్లు వస్తేగానీ బ్రేక్ ఈవెన్ చేరుకునే అవకాశం లేదని ఓ ట్రేడ్ ఎక్స్‌పర్ట్ చెప్పినట్లు సదరు రిపోర్టు తెలిపింది.