Telugu Web Series: ఐఐటీ కష్టాలపై కలర్ ఫోటో డైరెక్టర్ తెలుగు వెబ్‌సిరీస్ - టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Telugu Web Series: ఐఐటీ చదువుల కోసం విద్యార్థులు పడే కష్టాలపై తెలుగులో ఓ వెబ్‌సిరీస్ రాబోతోంది. ఎయిర్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్‌రాజ్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్నాడు. ఈటీవీ విన్ ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
Telugu Web Series: కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్‌రాజ్ ఐఐటీ చదువులపై తెలుగులో ఓ కామెడీ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌కు ఎయిర్(ఏఐఆర్....ఆల్ ఇండియా ర్యాంకర్స్) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సిరీస్ ఫస్ట్‌లుక్‌ను బేబీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ రిలీజ్ చేశాడు.
ఎయిర్ వెబ్‌సిరీస్‌లో హర్ష్ రోషన్, భాను ప్రతాప, జయ తీర్థ తో పాటు హర్ష చెముడు, సింధు రెడ్డి కీలక పాత్రల్లో నటించబోతున్నారు. ఎయిర్ వెబ్‌సిరీస్‌కు కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్‌రాజ్ ప్రజెంటర్‌గా మాత్రమే వ్యవహరిస్తోన్నాడు. ఈ సిరీస్‌కు జోసెఫ్‌క్లింటన్ కథను అందిస్తూ దర్శకత్వం వహించారు.
ఓఎమ్ఆర్ షీట్‌పై...
ఎయిర్ వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ఓఎమ్ఆర్ ఆన్సర్ షీట్ చిరిగిపోయినట్లుగా చూపించి వాటి మధ్యలో ముగ్గురు ప్రధాన పాత్రధారులను పరిచయం చేయడం ఆకట్టుకుంటోంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై మ్యాథమెటిక్స్ ఫార్ములా ఉండటం ఆసక్తిని పంచుతోంది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఈటీవీ విన్ తమ ఓటీటీ ఖాతాలో షేర్ చేసింది.
ఐఐటీ ప్రపంచానికి స్వాగతం...
ఈ పోస్టర్‌తో పాటు ఉన్న క్యాప్షన్ ఆసక్తిని పంచుతోంది. చుక్కలు ఉన్న చదువు...చుక్కలు చూపించే చదువు..ఐఐటీ ప్రపంచానికి స్వాగతం అంటూ ఎయిర్ వెబ్‌సిరీస్ గురించి ఈటీవీ విన్ ట్వీట్ చేసింది. ఐఐటీ చదువుల కోసం స్టూడెంట్స్ పడే కష్టాలను , ఈ ర్యాంకుల కోసం పడే పోటీలో వారు ఎదుర్కొనే సంఘర్షణను ఫన్నీగా ఎయిర్ వెబ్‌సిరీస్‌లో చూపించబోతున్నట్లు సమాచారం. కామెడీతో పాటు అంతర్లీనంగా ఓ సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నట్లు సమాచారం.
త్వరలో స్ట్రీమింగ్....
హర్ష్ రోషన్, భాను ప్రతాప, జయ తీర్థ పాత్రల చుట్టే ఈ సిరీస్ ప్రధానంగా సాగుతుందని తెలిసింది. ఎయిర్ వెబ్‌సిరీస్ షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. ఈ సిరీస్ రిలీజ్ డేట్‌పై కొద్ది రోజుల్లోనే క్లారిటీ రానున్నట్లు చెబుతోన్నారు.
కలర్ ఫొటోతో ఎంట్రీ...
కలర్ ఫొటో సినిమాతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రాజ్. సుహాస్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నది. సొసైటీలో కుల, మతాలు పరంగానే కాకుండా శరీర రంగు (వర్ణ వివక్ష) విషయంలో ఉండే వివక్షను సెన్సిటివ్‌గా ఈ సినిమాలో చూపించాడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, కృష్ణ అండ్ హీజ్ లీలా, ముఖచిత్రంతో పాటు మరికొన్ని సినిమాలకు రైటర్‌గా సందీప్‌రాజ్ పనిచేశాడు.