ranbir -alia bhatt |పెళ్లిపీటలెక్కనున్న బాలీవుడ్ ప్రేమజంట...ముహూర్తం ఎప్పుడంటే..
రణభీర్‌కపూర్,అలియాభట్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఈ జంట ఒక్కటవ్వబోతున్నట్లు చెబుతున్నారు.
బాలీవుడ్ ప్రేమపక్షులు రణభీర్ కపూర్, అలియాభట్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారా అంటే ఔననే అంటున్నారు సన్నిహిత వర్గాలు. రణభీర్‌కపూర్ తో చాలా కాలంగా ప్రేమలో ఉన్నది అలియాభట్. ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ సమయంలో వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమకు దారితీసినట్లు తెలిసింది. బాలీవుడ్ సెలిబ్రిటీ పార్టీలు, వేడుకలతో పాటు డిన్నర్ డేట్ నైట్‌లలో పలుమార్లు అభిమానులకు కనిపించారు ఈ జంట. రణభీర్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని అలియాసైతం మీడియాతో వెల్లడించింది. వీరి ప్రేమాయణం గురించి రణభీర్, అలియా కుటుంబ సభ్యులకు తెలుసునని సమాచారం. రణభీర్‌కపూర్ కుటుంబసభ్యులతో అలియా సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. రణభీర్, అలియా పెళ్లి చేయాలని వారు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కరోనా కారణంగా వారి ప్లాన్స్ ఫలించలేదు.
ఏప్రిల్ నెలలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అడంబరాలకు దూరంగా కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా ఈ జంట ఏడడుగులు వేయబోతున్నట్లు చెబుతున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నట్లు తెలిసింది. పెళ్లి వేదిక కోసం రాజస్థాన్ ఉదయ్‌పూర్ లోని తాజ్ లేక్ ప్యాలెస్ ను ఎంచుకున్నట్లు సమాచారం. రణభీర్, అలియా పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరుకాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పెళ్లి ఏర్పాట్ల పనిలో ఇరు కుటుంబసభ్యులు బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇటీవలే రణభీర్ తల్లి నీతూకపూర్ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్‌లో కనిపించింది. మనీష్ సైతం రణభీర్ ఇంటికి వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. రణభీర్, అలియా పెళ్లికి సంబంధించిన డ్రెస్‌లను డిజైన్ చేసే పనిని మనీష్‌కు అప్పగించినట్లు సమాచారం. రణభీర్‌కపూర్, అలియాభట్ జంటగా నటిస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది.