Blood and Chocolate Movie Review: బ్లడ్ అండ్ చాక్లెట్ రివ్యూ - అర్జున్ దాస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Blood and Chocolate Movie Review: అర్జున్‌దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన బ్లడ్ అండ్ చాక్లెట్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. వసంతబాలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందంటే...
Blood and Chocolate Movie Review: ఖైదీ, మాస్టర్ సినిమాలతో కోలీవుడ్‌లో ఫేమస్ అయ్యాడు అర్జున్ దాస్(Arjun Das). బుట్టబొమ్మ(ButtaBomma) సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు హీరోగా నటించిన తెలుగు సినిమా బ్లడ్ అండ్ చాక్లెట్ ఇటీవల థియేటర్లలో రిలీజైంది.
తమిళ చిత్రం అనితీకి అనువాదంగా రూపొందిన ఈ సినిమాకు వసంతబాలన్(Vasantha Balan) దర్వకత్వం వహించాడు. దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించింది. తమిళంలో ఈ సినిమాకు అగ్ర దర్శకుడు శంకర్(Shankar) ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
సైకలాజికల్ క్రైమ్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉంది? అర్జున్ దాస్ తన నటనతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అన్నది చూద్దాం...
ఫుడ్ డెలివరీ బాయ్ కథ...
తిరుమల అలియాస్ తిరు (అర్జున్ దాస్) ఫుడ్ డెలివరీబాయ్‌గా పనిచేస్తుంటాడు. క్రానిక్ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతుంటాడు. ఇతరుల్ని చంపాలనే ఆలోచనలు అతడిని ఇబ్బందిపెడుతుంటాయి. చాక్లెట్‌ను చూస్తే తిరు మృగంగా మారిపోతాడు.
తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతోన్న తిరు జీవితం సుబ్బు (దుషారా విజయన్) పరిచయంతో కొత్త మలుపు తిరుగుతుంది. సుబ్బు ధనవంతురాలైన వృద్దురాలికి కేర్ టేకర్‌గా పనిచేస్తుంటుంది. అనుక్షణం సుబ్బును అనుమానిస్తూ చిత్రహింసలకు గురిచేస్తుందా వృద్ధురాలు. కానీ కుటుంబపరిస్థితుల కారణంగా సుబ్బు ఆ కష్టాలను భరిస్తూ పనిచేస్తుంటుంది. ఫుడ్ డెలివరీ సమయంలో సుబ్బుతో తిరుకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిపోతుంది.
ఓ రోజు వీరి ప్రేమ గురించి సుబ్బు యజమానురాలికి తెలుస్తుంది. తిరుతో ఆమె గొడవపడతాడు. అదే రోజు అనూహ్యంగా ఆ వృద్ధురాలు చనిపోతుంది. ఆమెను తిరు, సుబ్బు కలిసి చంపారని అనుమానించిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఆ కేసు నుంచి సుబ్బు, తిరు ఎలా బయటపడ్డారు? ఆ వృద్ధురాలి కొడుకు, కూతురు కలిసి సుబ్బు, తిరులపై ఎందుకు తప్పుడు కేసులు పెట్టారు. వారి నుంచి సుబ్బును కాపాడటానికి తిరు నిజంగానే కిల్లర్‌గా మారాడా? చివరకు అతడి జీవితం ఎలా ముగిసింది? అన్నదే బ్లడ్ అండ్ చాక్లెట్ కథ.
అట్టడుగు వర్గాల జీవితం…
సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల్ని, వారి సమస్యల్ని, ఎమోషన్స్ ను వసంతబాలన్ సినిమాలు కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరిస్తుంటాయి. కెరీర్ ఆరంభం నుంచి ఇదే పంథాను అనుసరిస్తూ సినిమాలు చేస్తున్నాడాయన. బ్లడ్ అండ్ చాక్లెట్ ఆ కోవలోనే సాగుతుంది.
ఓ ఫుడ్ డెలివరీ బాయ్, పనిమనిషికి మధ్య సాగే ప్రేమకథను ప్రధానంగా చేసుకుంటూ ధనిక పేద మధ్య వివక్ష, సామాజిక అంతరాలు, శ్రమదోపిడీని ఈ సినిమాలో మనసుల్ని కదిలించేలా చూపించారు. ఫుడ్‌డెలివరీబాయ్‌లతో పాటు పనిమనుషులకు వృత్తిపరంగా ఎదురయ్యే అవమానాల్ని, ఇబ్బందులను ఆలోచనాత్మకంగా బ్లడ్ అండ్ చాక్లెట్‌లో చూపించారు వసంతబాలన్.
సైకో కిల్లర్‌గా...
హీరోను ఓ సైకో కిల్లర్‌గా పరిచయం చేస్తూ దర్శకుడు వసంతబాలన్ సినిమాను మొదలుపెట్టిన విధానమే సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఆ తర్వాత అతడు ఓ మానసిక సమస్యతో బాధపడుతోన్నట్లుగా చూపించడం, ఆ సమస్య నుంచి సుబ్బు ప్రేమ ద్వారా బయటపడే సన్నివేశాలతో ఆహ్లాదంగా సినిమా సాగుతుంది.
సెకండాఫ్‌లో సుబ్బు , తిరు మర్డర్ కేసులో చిక్కుకోవడం, ఆ కేసు కారణంగా వారి జీవితాలు ఎలా చిక్కుల్లో పడ్డాయనే సీన్స్‌తో డ్రామా, ఎమోషన్స్ పండిస్తూ కథను ముందుకు నడిపించారు. తిరు మానసిక సమస్యతో బాధపడటానికి గల కారణాల్ని చూపిస్తూ తండ్రీకొడుకుల సెంటిమెంట్‌తో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. సుబ్బును సేవ్ చేయడానికి తిరు తీసుకునే నిర్ణయంతో ఇంటెన్స్ క్లైమాక్స్ ద్వారా సినిమాను ఎండ్ చేశారు వసంతబాలన్.
కన్వీన్సింగ్‌గా లేవు...
టిపికల్ స్టోరీని ఎంచుకొని వసంతబాలన్ బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాను తెరకెక్కించారు. తిరు, సుబ్బు మధ్య ప్రేమ పుట్టే సన్నివేశాలు కన్వీన్సింగ్‌గా లేవు. వారు సమస్యల్లో చిక్కుకోవడం, తిరు రివేంజ్‌లోని భావోద్వేగాల్ని ఇంకాస్త లోతుగా చూపిస్తే బాగుండేది. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండాఫ్ చాలా స్లో ఫేజ్ లో సాగుతుంది. జైలు సీన్స్ మొత్తం సాగదీశారు.
నట విశ్వరూపం...
తిరుగా అర్జున్ దాస్ నట విశ్వరూపం చూపించాడు. మానసిక సమస్యతో బాధపడే యువకుడి పాత్రలో అతడి నటన, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అర్జున్ దాస్ వన్ మెన్ షోగా ఈ సినిమా నిలుస్తుంది.
సుబ్బుగా దుషారా సహజ నటనతో ఆకట్టుకుంది. నెగెటివ్ క్యారెక్టర్స్‌లో అర్జున్ చిదంబరం, వనితా విజయ్‌కుమార్ కనిపించారు. హీరో తండ్రిగా కాళీవెంకట్ యాక్టింగ్ బాగుంది. జీవి ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ సినిమాకు ప్లస్సయింది. లవ్‌స్టోరీలోని ఫీల్, తిరు క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటీని మ్యూజిక్ చాలా వరకు ఎలివేట్ చేసింది.
అర్జున్ దాస్ యాక్టింగ్ కోసం...
బ్లడ్ అండ్ చాక్లెట్ డిఫరెంట్ లవ్ స్టోరీగా ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. అర్జున్ దాస్ యాక్టింగ్, జీవి ప్రకాష్‌కుమార్ మ్యూజిక్ కోసం ఓ సారి ఈ సినిమా చూడొచ్చు. .