Bigg Boss 8 Telugu: ఫుడ్ కోసం కొట్టుకోవడం బాధగా ఉంది: ఎమోషనల్ అయిన సీత.. యష్మిపై మణికంఠ ఫైర్: వీడియో
Bigg Boss 8 Telugu Day 10 Promo 2: బిగ్‍బాస్ హౌస్‍లో కంటెస్టెంట్లు ఆహారం కోసం పోటీలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. రేషన్ కోసం టాస్కులు గెలువాలని బిగ్‍బాస్ రూల్ పెట్టడంతో ఇది జరుగుతోంది. అయితే, ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందని సీత అన్నారు. ఈ క్రమంలో యష్మి, మణికంఠ మధ్య కూడా ఫైట్ జరిగింది.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో బిగ్‍బాస్ ట్విస్ట్ ఇచ్చారు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ వెనక్కి తీసుకున్నారు. కంటెస్టెంట్లు టాస్కులు ఆడి రేషన్ గెలుచుకోవాలని రూల్ పెట్టారు. రేషన్ కోసం క్లాన్‍ల మధ్య నేటి (సెప్టెంబర్ 11) ఎపిసోడ్‍లో ఫైట్ ఉండనుంది. అయితే, ఫుడ్ కోసం కొట్లాడుకోవడం పట్ల సీత ఆవేదన వ్యక్తం చేశారు. మణికంఠ, యష్మి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రోమోలో ఏముందంటే..
ఫుడ్ కోసం టాస్కులు
రేషన్ కోసం కంటెస్టెంట్లకు టాస్కులు ఇచ్చారు బిగ్‍బాస్. నిమ్మకాయలు, మేజ్‍తో పెట్టిన టాస్క్ నేటి తొలి ప్రోమోలో ఉంది. రెండో ప్రోమోలోనూ కొన్ని టాస్కులు ఉన్నాయి. సరుకులు గెలుచుకునేదెవరో.. ఖాళీ చేతులతో వెనుదిరిగేది ఎవరో తెలుసుకోవడానికి రెండో, ఆఖరి అవకాశమంటూ బిగ్‍బాస్ చెప్పటంతో ఈ రెండో ప్రోమో మొదలైంది.
ఈ టాస్కుల్లో కిర్రాక్ సీత, మణికంఠ పోటీ పడ్డారు. ముందుగా శనగపప్పును గుర్తించి తీసుకెళ్లాలని బిగ్‍బాస్ చెప్పగా.. సీత ముందుగా తీసుకున్నారు. మణికంఠ వెనుకబడ్డారు. ఆ తర్వాత టమాటా బాస్కెట్‍లో యాపిల్‍ను గుర్తించి తీసుకెళ్లే టాస్క్ వచ్చింది. మణికంఠ యాపిల్‍ను తీసుకెళ్లారు.
యష్మిపై మణి ఆగ్రహం
250 గ్రాముల మరమరాలను తీసుకొని రావాలని బిగ్‍బాస్ చెప్పారు. మణికంఠ, సీత వేగంగా కవర్లో మరమరాలను తీసుకొచ్చారు. అయితే, మణికంఠ 290 గ్రాములు తీసుకురాగా.. సీత తీసుకొచ్చినది 375 గ్రాములు అయింది. దీంతో ఇద్దరూ సరిగా తీసుకురాలేదని సంచాలక్ యష్మి చెప్పారు. అయితే, ఏదీ 250 గ్రాములకు దగ్గరగా ఉందో దాన్ని తీసుకొని గెలిచినట్టు చెప్పాలని యష్మితో మణికంఠ వాదించారు.
సంచాలక్ నిర్ణయం ఫైనల్ అంటూ యష్మి అన్నారు. “250 గ్రాములు కరెక్టుగా ఏ మనుషులు తీసుకురాలేరు. మనం రోబోలం కాదు. ఏదీ దగ్గరగా ఉంటే అది తీసుకోవాలని చెప్పారు” అని మణి ఫైర్ అయ్యారు. దీంతో నా ఇష్టం అంటూ యష్మి మాట్లాడారు. దీన్ని తాను ఒప్పుకోనని బిగ్‍బాస్‍తో మణికంఠ చెప్పారు.
మణికంఠను ఓదార్చేందుకు అభయ్ నవీన్ ప్రయత్నించారు. ఫైట్ ఇచ్చావని అన్నారు. అయితే తాను గెలిచానని, అది ఓడిపోవడం కాదని మణి చెప్పారు.
చాలా బాధగా ఉంది
ఫుడ్ కోసం కొట్టుకోవడం చాలా బాధగా ఉందని సీత అన్నారు. “నాదో రిక్వెస్ట్. ఫుడ్ గురించి కొట్టుకోవడం చాలా బాధగా ఉంది. వాళ్లకు కూడా ఇవ్వండి బిగ్‍బాగ్” అని సీత అన్నారు. సోనియా కూడా ఎందుకో బాధపడినట్టు ప్రోమోలో ఉంది. సోనియాను అభయ్, నిఖిల్, పృథ్వి ఓదార్చారు. అయితే, ఈ టాస్కులు ముగిసిన తర్వాత యష్మి, నైనిక క్లాన్‍లను సరుకులు వచ్చినట్టు లీక్‍ల ద్వారా తెలిసింది. నిఖిల్, మణికంఠకు రాగిపిండి మినహా రేషన్ రాలేదట.
లెమన్ పిజ్జా అంటూ రేషన్ కోసం బిగ్‍బాస్ పెట్టిన టాస్క్ నేటి ఎపిసోడ్ తొలి ప్రోమోలో ఉంది. సూపర్ మార్కెట్ పెట్టగా ముందుగా చీఫ్‍లు షాపింగ్ చేశారు. అయితే, టాస్కుల్లో గెలిస్తేనే అవి దక్కుతాయంటూ బిగ్‍బాస్ చెప్పారు. మేజ్ నుంచి మూడు నిమ్మకాలను బయటికి తీసి ఎక్కువ రౌండ్లను గెలుస్తారో ఆ క్లాన్ గెలిచి రేషన్ పొందుతుందని బిగ్‍బాస్ చెప్పారు. మరి ఏం జరుగుతుందో నేటి ఎపిసోడ్‍లో తెలియనుంది.
టాపిక్