SSMB28 Title: అమరావతి రాజకీయంపై కన్నేసిన మహేష్-త్రివిక్రమ్..! అసలు రాజధానితో లింకేంటి?
SSMB28 Title: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి అమరావతికి అటు ఇటు అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం.
SSMB28 Title: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ చిత్రీకరణ జరుపుకుంటోంది. సినిమా ప్రారంభమైన ఏడాది దాటినా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. సినిమా మొదలైనప్పటి నుంచి పలు ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ముందుగా మహేష్ తల్లి మరణించడం, ఆ తర్వాత తండ్రి కృష్ణ కన్నుమూయడంతో ఆలస్యమవుతూ వస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఈ సినిమా షూటింగ్ ఊపందుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన నైట్ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతోంది. మూవీలో కీలకమైన ఈ సీక్వెన్స్ కోసం హైదరాబాద్ శివారుల్లో వికారాబాద్ దగ్గరలోని శంకర్‌పల్లి అనే గ్రామంలో ఏర్పాటు చేసిన స్పెషల్ హౌస సెట్‌లో షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఈ మూవీ టైటిల్ విషయంలో అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అమ్మ చెప్పింది, అమ్మ కథ ఇలా రకరకాల పేర్లు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు అమరావతికి అటు ఇటు అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గత మూడున్నరేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఏపీ రాజకీయాల్లో కీలకమైన అమరావతి పేరు మీదుగా సినిమా టైటిల్‍ను పెట్టాలనుకోవడం ఆసక్తిని రేపుతోంది.
2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అమరావతిని రాజధానికి ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత 2019లో ప్రస్తుత సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని పైకి లేవనెత్తి అమరావతి శాసన రాజధానిగా మాత్రమే ఉంటుందని ప్రకటించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. మరి ఇలాంటి వివాదాస్పద వ్యవహారం ఉన్న ఈ ప్రాంతానికి చెందిన పేరును సినిమా టైటిల్‌ను ఎందుకు పెడుతున్నారనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేస్తోంది. ఈ సినిమాకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటిగ్ బాధ్యతలు చూస్తున్నారు. మహేశ్ బాబుకు ఇది 28వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.