Amaran Ticket Bookings: అమరన్ మూవీకి అంచనాలకు మించి టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్.. తొలిరోజు ఎంత రావొచ్చంటే..!
Amaran Tickets Bookings: అమరన్ సినిమా టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అంచనాలకు మించి అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. తెలుగులోనూ మంచి జోష్ కనిపిస్తోంది. ఈ చిత్రం తొలి రోజు ఎంత కలెక్షన్లు దక్కించుకొనే అవకాశం ఉందో అంచనాలు వెలువడ్డాయి.
తమిళ స్టార్ శివ కార్తికేయన్, స్టార్ హీరోయిన్ సాయిపల్లవి ప్రధాన పాత్రలు పోషించిన అమరన్ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రేపు (అక్టోబర్ 31) థియేటర్లలో రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా ఈ బయోగ్రాఫికల్ యాక్షన్ వార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అమర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అమరన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
అంచనాలకు మించి..
అమరన్ చిత్రం రేపు తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. ఈ సినిమాకు టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నేడు జోరుగా సాగుతున్నాయి. అంచనాలకు మించి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఓ దశలో బుక్‍మైషో ప్లాట్‍ఫామ్‍లో గంటకు 20వేల టికెట్లు కూడా బుక్ అయ్యాయి. ఆస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‍ల్లో జోష్ కనిపిస్తోంది. తమిళంలో ఈ చిత్రం బుకింగ్‍ల్లో అదరగొడుతోంది.
తెలుగులోనూ..
సాయిపల్లవి ఉండటంతో అమరన్ చిత్రానికి తెలుగులోనూ మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. తెలుగులో ఆమెకు చాలా ఫ్యాన్‍బేస్ ఉంది. లేడీ పవర్ స్టార్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. సాయిపల్లవి వెండితెరపై కనిపించి దాదాపు రెండేళ్లవుతుంది. 2022లో వచ్చిన గార్గి తర్వాత సాయిపల్లవి గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో చివరగా అదే ఏడాది విరాటపర్వం చిత్రం చేశారు. మొత్తంగా రెండేళ్ల తర్వాత సాయిపల్లవి మూవీ వస్తోంది. అమర జవాన్ జీవితంపై మూవీ కావడం, ట్రైలర్ ఆకట్టుకోవడంతో తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లు దక్కే అవకాశం ఉంది.
తొలి రోజు కలెక్షన్ల అంచాలు
అమరన్ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం తొలి రోజు ఎంత కలెక్షన్లు వస్తాయో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్ డే సుమారు రూ.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంటుందని లెక్కలు వెలువడుతున్నాయి. అదే జరిగితే శివ కార్తికేయన్‍కు ఇదే బెస్ట్ ఓపెనింగ్ రికార్డు అవుతుంది. ఈ మూవీ రూ.100కోట్ల వసూళ్ల మార్క్ దాటే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్లడం ఖాయంగా అనిపిస్తోంది.
అమరన్ చిత్రంపై ట్రైలర్ తర్వాత మంచి హైప్ ఏర్పడింది. అమర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీని డైరెక్టర్ రాజ్‍కుమార్ పెరియసామి తెరకెక్కించారు. వరదరాజన్‍గా శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య పాత్రను సాయిపల్లవి పోషించారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల కోసం 2014 ఏప్రిల్‍లో కశ్మీర్‌లో చేసిన గాలింపు చర్యల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో వరదరాజన్ అమరుడయ్యారు. ఆ తర్వాత ఆయనకు అశోక చక్ర పురస్కారాన్ని కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది.
అమరన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా బ్యానర్లపై లోకనాయకుడు కమల్ హాసన్, మహేంద్రన్, వివేక్ కృష్ణణి ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్, సాయిపల్లవితో పాటు భువన్ అరోరా, రాహుల్ బోస్, శ్రీకుమార్, లల్లూ, శ్యామ్ మోహన్ కీలకపాత్రలు పోషించారు.