Allu Arjun Remuneration: పుష్ప 2లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300 కోట్లు.. ఇందులో నిజమెంత?-allu arjun remuneration for pushpa the rule 33 percent of the profits ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Remuneration: పుష్ప 2లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300 కోట్లు.. ఇందులో నిజమెంత?

Allu Arjun Remuneration: పుష్ప 2లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300 కోట్లు.. ఇందులో నిజమెంత?

Hari Prasad S HT Telugu
Nov 28, 2023 10:55 AM IST

Allu Arjun Remuneration: పుష్ప 2 మూవీ కోసం అల్లు అర్జున్ ఏకంగా రూ.300 కోట్లకుపైగా తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో నిజమెంత? అసలు ఈ మూవీ కోసం రెమ్యునరేషనే తీసుకోని బన్నీకి లాభాల్లో ఎంత వాటా రానుంది?

అల్లు అర్జున్
అల్లు అర్జున్

Allu Arjun Remuneration: పుష్ప ది రైజ్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన తర్వాత అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఒక్కో తెలుగు హీరో మెల్లగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలు తీస్తున్న వేళ వందల కోట్లు దాటుతున్న వాళ్ల రెమ్యునరేషన్లు అభిమానులకు ఎప్పుడూ ఆసక్తికరమే.

ఇప్పుడు కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ కోసం ఏకంగా రూ.300 కోట్లకుపైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత? పుష్ప సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత సీక్వెల్ పై భారీ అంచనాలు ఉండటం, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అనుకోవడం సహజమే. కానీ మరీ రూ.300 కోట్లపైనే అంటే నమ్మశక్యం కాదు.

అసలు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ ఎంత?

పుష్ప మూవీ కోసం బన్నీ సుమారు రూ.50 కోట్ల వరకూ రెమ్యునరేషన్ రూపంలో అందుకున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమా హిట్ అవడంతో సీక్వెల్ కోసం అతడు తన పారితోషికాన్ని డబుల్ చేశాడని, పుష్ప 2 కోసం సుమారు రూ.120 కోట్లు అందుకోబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. కానీ అసలు రెమ్యునరేషనే లేదని, లాభాల్లో వాటా అతనికి దక్కబోతోందని ఈ మధ్య వార్తలు వస్తున్నాయి.

ఈ మధ్య ఓ సినిమా జర్నలిస్ట్ చేసిన ట్వీట్ తాజా పుకార్లకు తెరలేపాయి. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ అసలు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని, అయితే సినిమాకు వచ్చే ఆదాయంలో 33 శాతం అతనికి దక్కుతుందన్నది ఆ ట్వీట్ సారాంశం. పుష్ప 2కి ఇప్పుడున్న హైప్ నేపథ్యంలో రూ.1000 కోట్లకుపైనే బాక్సాఫీస్ కలెక్షన్లు ఖాయమని, ఆ లెక్కన అల్లు అర్జున్ కి రూ.300 కోట్లకుపైనే దక్కుతుందని కొందరు సోషల్ మీడియాలో లెక్కలేసేశారు.

బాక్సాఫీస్ కాకుండా డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపంలో కొన్ని వందల కోట్లు మేకర్స్ కు రానున్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే పుష్ప 2 ఆదాయం భారీగా ఉండనుందని, బన్నీకి దెబ్బకు వందల కోట్లు వస్తాయని అంచనా వేశారు. అయితే ఈ లెక్కల్లో నుంచి సినిమా తీయడానికి అయ్యే ఖర్చు, ఇతర నటీనటులకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్లు అన్నీ తీసేస్తే.. చివరగా లాభాలు రూ.500 కోట్లకు మించే పరిస్థితి ఉండదు. ఆ లెక్కన చూసుకున్నా.. 33 శాతం అంటే అల్లు అర్జున్ కు దక్కేది రూ.150 కోట్ల కంటే ఎక్కువ ఉండదని మరికొందరు లెక్కలు తీస్తున్నారు. నిజానికి ఇది కూడా భారీ మొత్తమే అని చెప్పాలి.