Tarun on Marriage: పెళ్లి పుకార్లపై స్పందించిన తరుణ్.. సోషల్ మీడియాలో పోస్ట్
Tarun on Marriage: తన వివాహంపై వస్తున్న రూమర్ల గురించి హీరో తరుణ్ స్పందించాడు. ఇన్‍స్టాగ్రామ్ పోస్టుతో క్లారిటీ ఇచ్చాడు.
Tarun on Marriage: హీరో తరుణ్ పెళ్లి గురించి కొంతకాలంగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే అతడు ఓ ఇంటివాడు కానున్నాడనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మెగా ఇంటికి అల్లుడిగా వెళ్లబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో తరుణ్ పెళ్లి పుకార్లు కొంతకాలంగా హాట్ టాపిక్ అవుతోంది. ఈ తరుణంలో వీటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తరుణ్ స్పందించాడు. తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాల గురించి సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు.
తన పెళ్లి గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని తరుణ్ వెల్లడించాడు. ఈ మేరకు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. “నా వివాహం కాబోతోందని కొన్ని కథనాలు, వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవన్నీ ఎలాంటి ఆధారం లేని రూమర్లేనని మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాను. అలాంటి మంచి వార్త ఏదైనా ఉంటే నేను స్వయంగా మీతో షేర్ చేసుకుంటాను. దయచేసి రూమర్లను నమ్మవద్దు. వ్యాప్తి చేయవద్దు. నన్ను అర్థం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు” అని తరుణ్ పోస్ట్ చేశాడు. తన పెళ్లి విషయంలో వస్తున్న రూమర్లలో నిజం లేదని తరుణ్ స్పష్టం చేశాడు.
బాలనటుడిగా ఎన్నో చిత్రాల్లో చేసిన తరుణ్.. 2000 సంవత్సరంలో ‘నువ్వే కావాలి’ సినిమాతో హీరోగా మారాడు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తర్వాత నువ్వే నువ్వే లాంటి కొన్ని చిత్రాలు బాగా ఆడాయి. అయితే, ఆ తర్వాత తరుణ్ నటించిన చిత్రాలు వరుసగా విఫలమయ్యాయి. దీంతో సినిమాలు తగ్గాయి. తరుణ్ చివరగా 2018లో ‘ఇది నా లవ్ స్టోరీ’ అనే చిత్రం చేశాడు. అదీ విఫలమైంది. ప్రస్తుతం తరుణ్ వయసు 42 సంవత్సరాలు. ఇక సినిమాలు మానేసిన అతడు పెళ్లి చేసుకోనున్నాడనే పుకార్లు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి.
అయితే, తరుణ్ పెళ్లి గురించి అతడి తల్లి రోజా రమణి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలతో పుకార్లు మొదలయ్యాయని తెలుస్తోంది. అయితే, తన పెళ్లి పుకార్లు నిజం కాదని తరుణ్ స్పష్టం చేశాడు.