BRS Party : బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలివే-why brs party defeat in telangana assembly election results heres reasons ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs Party : బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలివే

BRS Party : బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాలివే

Anand Sai HT Telugu
Dec 03, 2023 02:05 PM IST

Telangana Assembly Election Result: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు చూపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. గులాబీ పార్టీ ఓడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు(Telangana Assembly Election Result) ఆసక్తిని రేపుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. అధికార బీఆర్ఎస్ పార్టీని ప్రజలు స్పష్టంగా తిరస్కరించారు. చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులకంటే కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో ఉంది. నిరుద్యోగుల్లో వ్యతిరేకత, రైతులు, ఉద్యోగులు.., ఇలా చాలా వర్గాల నుంచి మద్దతు పొందడలో గులాబీ పార్టీ విఫలమైంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది.

నిరుద్యోగుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా నష్టపోయింది. వారిని మెప్పించడంలో కేసీఆర్ విఫలమయ్యారు. ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. సరిగా నెరవేర్చలేకపోయింది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు సైతం జనంలోకి బాగా తీసుకెళ్లాయి. నోటిఫికేషన్ల విషయంలోనూ గందరగోళం నెలకొనడం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, గ్రూప్స్ వాయిదా, సరిగ్గా ఎన్నికలకు ముందు నిరుద్యోగిని ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం.. నిరుద్యోగుల్లో కోపానికి కారణమైంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్స్ కేటాయింపుల్లోనూ స్ట్రాటజీ ప్లే చేయడంలో విఫలమైంది. గతంలో పీకే లాంటి రాజకీయ వ్యూహకర్తతో భేటీ సమయంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. దాదాపు 40కిపైగా అభ్యర్థులను మార్చాల్సి ఉండేది. కానీ కేసీఆర్ మెుండి ధైర్యంతో ముందుకు వెళ్లారు. సిట్టింగులపై ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది. కింది స్థాయి నేతల అరాచకాలు కూడా పార్టీకి గట్టి దెబ్బ తగిలేలా చేసిందనె చెప్పొచ్చు.

హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తీసుకొచ్చిన దళిత బంధు విషయంలోనూ ప్రభుత్వం వ్యతిరేకత ఎదుర్కోవలసి వచ్చింది. ఎందుకంటే ఈ పథకంలో నేతలు ఎక్కువగా తలదూర్చారు. కావాల్సిన వాళ్లకే ఇప్పించుకున్నారు. దీంతో మిగిలిన వారిలో ఆగ్రహానికి కారణమైంది.

కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు విషయంలోనూ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. దేశం మెుత్తం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి గొప్పగా చెప్పుకుంటుందని బీఆర్ఎస్ సర్కారు చెప్పుకొచ్చింది. తెలంగాణలో నీటి కరవు ఉండకూడదని పేర్కొంది. కానీ ఇందులో అవినీతి ఎక్కువగా జరిగిందని ప్రతిపక్షాలు జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యయాయి. అంతేకాదు ఎన్నికల ముందు ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం కూడా గులాబీ పార్టీకి మైనస్ అయింది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటంటే.. డబుల్ బెడ్రూం ఇళ్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పథకం గురించి గొప్పగా చెప్పింది. కానీ హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే.. కొన్ని చోట్ల ఈ పథకం అమలైంది. క్షేత్రస్థాయిలోకి వెళితే.. పెద్దగా కనిపించలేదు. కొన్ని చోట్ల ఇచ్చినా.. జనాలు మాత్రం వాటితో సంతృప్తి చెందలేదు. ఇది కూడా ఆగ్రహానికి కారణమైంది.

ధరణి పోర్టల్‍ ద్వారా ఏదో చేయాలనుకుంది ప్రభుత్వం. కానీ దీని కారణంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ధరణి పోర్టల్ తో చాలామంది రైతులు నష్టపోయారు. భూస్వాములకే ఇది ఎక్కువగా ఉపయోగపడిందని విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇందులో చాలా లొసుగులు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. ఈ విషయం జనాల్లోకి బాగా వెళ్లింది.

ఇసుక మాఫియాపై కూడా జనాల్లో వ్యతిరేకత ఉంది. సిరిసిల్లలో జరిగిన ఘటన అప్పట్లో సంచలనమైంది. ఆ తర్వాత కూడా ఇసుక దందా యథేచ్ఛగా సాగింది. కొన్ని ఊర్లలో ఈ ఇసుక దందా కారణంగా రోడ్లు అధ్వానంగా మారాయి. ప్రభుత్వాన్ని తిట్టడం మెుదలుపెట్టారు జనాలు.

దళిత బంధు తరహాలో బీసీ బంధు ప్రవేశపెడతామన్న విషయం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇది మాటల వరకే పరిమితమయ్యే సరికి జనాలు కూడా బీఆర్ఎస్ పార్టీని లైట్ తీసుకున్నారు.

అమరవీరుల కుటుంబాల్లోనూ గులాబీ పార్టీపై చాలా వ్యతిరేకత వచ్చింది. కొంతమందిని మాత్రమే దగ్గరకు తీసుకోవడం, చాలామందికిని పట్టించుకోకపోవడం బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయిందనే చెప్పవచ్చు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు జనాల్లోకి సరిగా తీసుకెళ్లాయి.

తెలంగాణ అంటే కుటుంబ పాలన అనే విధంగా జనాల్లోకి వెళ్లింది. కేసీఆర్, కేటీఆర్, హరిష్ రావు, కవిత, సంతోష్.. తప్ప వేరేవారు కనిపించకపోవడం కూడా బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బ. ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేకపోవడం కూడా ప్రజ ఆగ్రహానికి కారణమైంది.

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా కలిసి రాలేదు. తెలంగాణ ఆత్మగౌరవం అంటూ టీఆర్ఎస్ పార్టీ ఏర్పడింది. కానీ దేశ రాజకీయాలంటూ కేసీఆర్ బీఆర్ఎస్‍గా మార్చడంతో గ్రాఫ్ పడిపోయింది.

బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని కూడా జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చడం, ఎన్నికల ప్రచారంలో బీజేపీ బీఆర్ఎస్ మీద పెద్దగా మాటల దాడి చేయకపోవడంతో ప్రజలు.. బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేనని అనుకున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సరిగా జనాల్లోకి తీసుకెళ్లింది. ఇలా చాలా కారణాలతో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవలసి వచ్చింది.

Whats_app_banner