TS Congress Govt : ఖమ్మంలో అమాత్యులు వీరేనా..?
Telangana Congress Govt : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో…కాబోయే మంత్రులు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Telangana Congress Govt : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రజల్లో మీమాంసకు తెరపడింది. గురువారం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక మంత్రివర్గం కూర్పు ఎలా ఉండబోతుందో అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎవరు మంత్రులు కాబోతున్నారు.? అన్న అంశంపై రాజకీయ విశ్లేషణ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఏ ఒక్కరికీ మంత్రి హోదాను అందుకోగలిగిన సామర్థ్యం లేకపోవడం గమనార్హం. కాగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు పార్టీలో చేరి తమదైన శైలిలో సత్తా చాటిన ఆ ఇద్దరు అనుభవజ్ఞులే ఇప్పుడు మంత్రి పదవులను స్వీకరించబోతున్నారన్న చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీలో సీఎం కేసీఆర్ ను ఎదిరించి పార్టీ వీడిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని అనతి కాలంలోనే కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగారు. అంతేకాదు.. ఈ ఎన్నికల్లో పాలేరు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన తుమ్మల.. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మంత్రి వర్గాల్లో పని చేసిన అపార అనుభవాన్ని గడించారు. ఈయన ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ సంపాదించి ఖమ్మం నియోజకవర్గంలో విజయం సాధించారు.
ఈ ఇద్దరే మంత్రులు..?
"ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసే ఏ ఒక్క అభ్యర్థిని అసెంబ్లీ గేటు తాకనివ్వను." అని సవాల్ చేసిన పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. పదికి 10 కాకపోయినా 9 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో కేసీఆర్ పై ఆయన చేసిన ఛాలెంజ్ లో నెగ్గినట్లే చెప్పాలి. ఈ విజయాన్ని సాధించే క్రమంలో పొంగులేటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి తీవ్రంగానే శ్రమించారు. కాగా తాజాగా రాష్ట్ర క్యాబినెట్లో పొంగులేటికి సముచిత స్థానం దక్కుతుందన్న ఆశాభావం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. అలాగే సీనియర్ నేతగా రాజకీయ చాణక్యుడిగా పేరున్న తుమ్మల నాగేశ్వరరావుకు సైతం రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఐదేళ్లపాటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పని చేసిన పువ్వాడ విజయ్ కుమార్ పై తుమ్మల ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో తుమ్మలకు సమచిత స్థానం దక్కుతుందని భావిస్తున్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, హిందుస్థాన్ టైమ్స్, ఖమ్మం.