Barrelakka Election Result : బాధలో బర్రెలక్క.. సోషల్ మీడియా వరకే పరిమితమైన జోష్!
Barelakka Election Result : రాజకీయాలు వేరు.. సోషల్ మీడియాలో వచ్చిన ఫేమ్ వేరు అని మరోసారి నిరూపితమైంది. నిరుద్యోగుల తరఫున కొల్లాపూర్ నియోజకవర్గంలో నామినేషన్ వేశారు బర్రెలక్క. ఆమెకు చాలా మంది మద్దతు తెలిపారు. కానీ రియాలిటీ వేరుగా ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Election) సందర్భంగా ఎక్కువగా మారుమోగిన పేరు బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష(Karne Sirisha). ప్రభుత్వం నొటిఫికేషన్స్ వేయడం లేదంటూ.. అందుకే బర్రెలు కొనుక్కున్నానని ఓ వీడియో చేశారు. ఆ తర్వాత బాగా వైరల్ అయింది. దీంతో ఆమెపై కేసు కూడా నమోదైంది. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంది. మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో ఆమెకు సన్నిహితుల నుంచి వచ్చిన సలహా.. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయమని.
అయితే ఆమె ధైర్యంగా నామినేషన్ వేసి.. జనంలోకి వెళ్లింది. గెలుపుపై ధీమా వ్యక్తం చేసింది. కొందరు ఎన్ఆర్ఐలు సైతం ఆమెకు మద్దతు ఇచ్చారు. ఆర్థిక సాయం చేశారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల నుంచి కొంతమంది వెళ్లి.. ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. కొల్లాపూర్ నుంచి బర్రెలక్క(Kollapur Barrelakka) గెలుస్తుందనేంతగా ప్రచారం జరిగింది. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. బర్రెలక్క గెలుపు అనేది మాత్రం చాలా కష్టం.
ఈసారి ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు జోరుగా ప్రచారం చేశారు. బర్రెలక్క మాత్రం అందరికంటే ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే బర్రెలక్క తమ్ముడిపై దాడి జరిగింది. దీనిని అందరూ ఖండించారు. ఆమె గెలుస్తుందనే భయంతోనే ఇలా చేస్తున్నారని తెలంగాణలో చాలా మంది మండిపడ్డారు.
ప్రచారంలోనూ ఎక్కడా తగ్గకుండా నిరుద్యోగుల తరఫున వేసిన నామినేషన్ అని చెప్పుకొచ్చారు కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క. కానీ ఫలితాలు చూసేసరికి మాత్రం వేరేలా ఉంది. ముందుగా జరిగిన పోస్టల్ బ్యాలెట్ ముందు వరుసలోనే నిలిచారు. తర్వాత ఫలితాల్లో మాత్రం చాలా వెనక ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణరావు దూసుకెళ్లారు.
నిజానికి కొల్లాపుర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రత్యర్థుల కంటే బర్రెలక్కకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది. కానీ అవి ఓట్ల రూపంలో మాత్రం రాలేదు. బయటి నియోజకవర్గాల నుంచి మాత్రమే ఎక్కువ మంది మద్దతు ఇచ్చారు. సొంత నియోజకవర్గంలో బర్రెలక్కకు సరైన మద్దతు లభించలేదు. దీంతో ఆమె అభిమానులు భాదను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి బర్రెలక్క నామినేషన్‍తో చాలామందిలో చైతన్యం వచ్చింది. కానీ ఓట్లు దగ్గరకు వచ్చేసరికి మాత్రం.. తారుమారైంది.
ఈ నియోజకవర్గంలో గతంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన వారూ ఉన్నారు. 1967లో నర్సింహారెడ్డి, 1972లో రంగదాసు, 2004లో జూపల్లి కృష్ణారావు గెలిచారు. కానీ బర్రెలక్కకు మాత్రం అదృష్టం కలిసి వచ్చినట్టుగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీలో ఉంటందో.. లేదో చూడాలిక..