Barrelakka : కొల్లాపూర్ లో బర్రెలక్క ఓటమి, ఎన్నిఓట్లు వచ్చాయంటే?
Barrelakka : కొల్లాపూర్ లో ప్రధాన పార్టీ అభ్యర్థులకు ప్రచారంలో గట్టిపోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి చెందారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.
Barrelakka : తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అత్యధిక సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకుపోతుంది. అయితే కొల్లాపూర్ లో గట్టి పోటీ ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క ఓటమి పాలయ్యారు. కొల్లాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై జూపల్లి గెలుపొందారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించారు. బర్రెలు కాస్తున్న ఫ్రెండ్స్ అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అయిన శిరీష తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేశారు. నిరుద్యోగుల తరఫున పోరాడుతున్నానని చెప్పిన బర్రెలక్కకు... పెద్ద ఎత్తున మద్దతు లభించింది. తొలుత పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కన్నా బర్రెలక్కకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు తెలుస్తోంది. విజిల్ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన బర్రెలక్కకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు పోలైయ్యాయి. బర్రెలక్కకు మొత్తానికి 5658 ఓట్లు వచ్చాయి.
ఓట్లగా మారని సోషల్ మీడియా ప్రచారం
బర్రెలక్క ఎన్నికలలో విజయం సాధించకపోయినా కనీసం 15 వేలు నుంచి 20 వేల ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఈ అంచనాలు తారుమారయ్యాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన బర్రెలక్కకు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ప్రచారంలో దూసుకుపోయిన బర్రెలక్కకు కొల్లాపూర్ ప్రజలు అంతతా మద్దతు తెలపలేదు. ఈసారి బర్రెలక్క కొల్లాపూర్ నియోజకవర్గంలో గెలిస్తే చరిత్ర సృష్టిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావించారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ప్రచారం మోత మోగించినా, అది ఓటు బ్యాంకుగా మారలేదని పలువురు అంటున్నారు. అయితే నిరుద్యోగుల పక్షాన పోటీ చేసిన బర్రెలక్క... సాధారణ వ్యక్తులు కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అనే సూర్ఫిని నిరూపించారని విశ్లేషకులు అంటున్నారు.