Khammam Results: ఖమ్మంలో పార్టీ ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేల ఓటమి
Khammam Results: ఫిరాయింపు రాజకీయాలకు ఓటర్లు గట్టి బుద్ది చెప్పారు. ఖమ్మంలో ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన ఆరుగురు ఎమ్మెల్యేలను ఓడించారు.
Khammam Results: 2018 ఎన్నికల్లో ఒక పార్టీలో గెలిచి ఆ తర్వాత అధికార వ్యామోహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికల్లో పరాజితులయ్యారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరపున గెలిచి ఆ తర్వాత రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు తాజాగా జరిగిన 2023 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు.
2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి తొలిసారి పోటీ చేసిన కందాల ఉపేందర్ రెడ్డి.. అక్కడ సీనియర్ నేత, అపార అనుభవం కలిగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు. అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు వనమా వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కూడా టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టాక తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన రేగా కాంతారావు సైతం 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయించి టీఆర్ఎస్ లో చేరారు. అలాగే ఇల్లందు నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీకి నిలిచిన బానోత్ హరిప్రియ 2018 ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. కాగా ఈమె సైతం గెలుపొందిన తర్వాత కొద్ది రోజులకే టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈ నలుగురితో పాటు తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేటలో గెలిచిన మెచ్చ నాగేశ్వరరావు కూడా వారు గెలుపొందిన కొద్ది రోజులకే టీడిపి పార్టీకి స్వస్తి పలికి అధికార వ్యామోహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రతిజ్ఞ చేసి మరీ పార్టీ ఫిరాయింపు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాలను గెలుచుకోగా తెలుగుదేశం అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందారు.
టీఆర్ఎస్ పార్టీ ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించగా వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి నిలిచిన లావుడ్యా రాములు నాయక్ గెలుపొందారు.
అయితే కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావులు గెలిచిన తర్వాత విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు.
తమకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టిందని, ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసినా తాము కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్ళమని ఆ నలుగురు శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేశారు. కాగా ఇలా ప్రతినబూనిన కొద్ది రోజులకే ఆ నలుగురు ఒక్కొక్కరుగా సొంతగూటిని విడిపోయి అధికార వ్యామోహంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
నాడు గెలిచిన మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, భద్రాచలం శాసనసభ్యుడు పొడెం వీరయ్య మాత్రమే ఇప్పటికీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. కాగా తాజా ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా టికెట్ సాధించి పోటీలో నిలిచిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఘోరంగా పరాజితులయ్యారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి టీఆర్ఎస్ లో చేరిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వరరావు కూడా ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోర పరాభవాన్ని చవిచూడటం చర్చకు దారితీసింది.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.