Gajwel Election Fight : నేను పోటీ చేస్తానని తెలియగానే కామారెడ్డి పారిపోయిండు - కేసీఆర్ పై ఈటల ఫైర్
Telangana Assembly Elections 2023: గజ్వేల్ నుంచి తనను గెలిపించాలని కోరారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. గురువారం పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన… నేను గజ్వేల్ కు వస్తున్నానని అనే తెలవగానే కేసీఆర్ కామారెడ్డికి పారిపోయాడని విమర్శించారు.
Gajwel Assembly constituency:గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. గురువారం గజ్వేల్ మండలం, బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల... కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీసేలా సేవ చేస్తానని చెప్పారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి తనను గెలిపించాలని కోరారు.
"కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీసేలా సేవ చేస్తాను. నన్ను గెలిపించండి. ధర్మం గెలిపించే బాధ్యత మీ చేతుల్లో ఉంది. దొంగకు సద్దులు కట్టకండి. సర్వే నంబర్ 154,156,133,153 లో ఉన్న 1100 ఎకరాల భూములు గుంజుకుంటమని కెసిఆర్ నోటీసులు ఇచ్చారు. కెసిఆర్ కి ఓటు వేసిన ఖర్మానికి మా భూములు పోతున్నాయని ఏడుస్తున్నారు. 20 ఎకరాల కలెక్టర్ భవనం కోసం 350 ఎకరాలు తీసుకున్నారు. మిగిలిన భూమి రియల్ ఎస్టేట్ ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. నోటిఫై అయిన భూములు పోకుండా కాపాడే బాధ్యత నాది. భూములు పోకుండా ఉండాలంటే కెసిఆర్ కి ఓటు వేయవద్దు. 5వేల రూపాయలు ఇచ్చి డిప్పు, స్ప్లింకర్, తార్పాల్ పట్టాలు, క్రాప్ ఇన్సూరెన్స్ అన్ని బంద్ పెట్టారు. కేసీఆర్ నువ్వు బలవంతంగా ఓటు వేయించుకొలేవు. డబల్ బెడ్ రూమ్, రేషన్ కార్డ్, నౌకర్లు, నిరుద్యోగ భృతి ఏది ఇవ్వలేదు.. మరి ఏమి ఇచ్చారు అని కెసిఆర్ కి ఓటు వేయాలి" అని ఈటల ప్రశ్నించారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు లేకుండా ఏ పని జరగడంలేదు. గ్రామంలో కట్టే స్మశానం,వేసే సిమెంట్ రోడ్లు, కట్టే మోరీలు, పెట్టే లైట్లు చెట్లు ఇవన్నీ కేంద్రం ఇచ్చే డబ్బులు తప్ప కేసీఆర్ రూపాయి ఇవ్వడం లేదు. పేదల ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు కిలోల కి మరో 5 కిలోలు కలిపి మోదీ ఇస్తున్నారు. కానీ కేంద్రం ఐదు కిలోలు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రం 5 కిలోలు ఇవ్వడం బంద్ పెట్టింది. ఇప్పుడు కేవలం 5 కేజీలు మాత్రమే వస్తున్నాయి. బిజెపి అధికారంలోకి వస్తే 10 కేజీల బియ్యాన్ని అందిస్తాము. మీ బిడ్డను ఆపదలో అండగా ఉంటాను" అని ఈటల రాజేందర్ చెప్పారు.
తాను గజ్వేల్ కు వస్తున్నానని అనే తెలవగానే కెసిఆర్ కామారెడ్డి పారిపోయిండన్నారు ఈటల. "కొత్త పార్టీ కాదు, అనామక పార్టీ కాదు, దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ. కెసిఆర్ వెకిలి మాటలు మాట్లాడుతున్నాడు. ఉన్న 5 కేజీలు బంద్ పెట్టింది కెసిఆర్..5 కేజీల బియ్యం ఇస్తున్నది మోదీ. రేపు కొత్త రేషన్ కార్డ్ ఇచ్చేది కూడా బీజేపీనే. పంటనష్టపోతే నష్టపరిహారం కూడా ఇవ్వని వాడు కెసిఆర్. బీజేపీ వస్తె వరికి 3100 మద్దతు ధర ఇస్తాం. రైతుకు భూమిని దూరం చేసిన కెసిఆర్ కి పాపం తగులుతుంది. మన నోరు కొట్టి, మన కడుపు కొట్టి సంపాదించిన డబ్బుతో మందు సీసాలు పంపించి కేసీఆర్ తాగిపిస్తున్నారు. నా మీటింగ్ కి రాకుండా దావతులు పెడుతున్నారు. మన అవసరానికి దొరకని కేసీఆర్ ఆయన అవసరానికి మళ్లీ వస్తున్నారు. ఇచ్చిన ప్రతి రూపాయి తీసుకోండి. ప్రమాణం చేయమంటే చేయండి.. లోపల రాజేంద్రకి ఓటు వేస్తానని ప్రమాణం చేసుకోండి.. బయటికి వారు చెప్పిన ప్రమాణం చేయండి. మోసపోతే గోసపడతాం. భూములు కాపాడబడాలన్న..పిల్లలకు నౌకరులు రావాలన్న..మన కష్టాలు పోవాలన్న..కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి" అని ఈటల రాజేందర్ కోరారు.