Bellampalli Commissioner Suspension : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్యపై వేటుపడింది. ఎన్నికల నిబంధనలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినందుకు మున్సిపల్ కమిషనర్‌ను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 8న బెల్లంపల్లిలో జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఏర్పాట్లు చేశారు. దీనిపై అందిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు స్పందించారు. ఆయనపై జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చర్యలు తీసుకున్నారు. వెంటనే మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యను బెల్లంపల్లి నుంచి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ కమిషనర్ గా రెవెన్యూ అధికారి భుజంగంకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాబాద్ శివార్లలో చెంగిచర్లలో నగదుతో పట్టుబడిన పోలీస్ అధికారిపై ఎన్నికల సంఘం వేటువేసింది. మంగళవారం మధ్యాహ్నం వరంగల్ నుంచి కారులో నగదు తరలిస్తున్న సీఐ అంజిత్ రావును కాంగ్రెస్ శ్రేణులు చెంగిచర్ల క్రాస్ రోడ్డులో అడ్డగించాయి. పక్కా సమాచారంతో వాహనాన్ని అడ్డగించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందులో భారీగా నగదు గుర్తించారు. ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి నగదు తీసుకు వస్తున్నారని గుర్తించారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాచారం అందడంతో సీఐ అంజిత్ రావు వాహనాన్ని చెంగిచర్ల క్రాస్ రోడ్డులో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
తన వ్యక్తిగత అవసరాల కోసం నగదు తీసుకువెళుతున్నానని చెప్పినా, వాహనాన్ని తనిఖీ చేయడంతో పోలీస్ ఐడీ కార్డు దొరకడంతో అతనిపై దాడి చేశారు. మంత్రి మల్లారెడ్డి కోసం నగదు తరలిస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ఈ క్రమంలో సీఐపై దాడి చేశారు. కారులో నగదు పట్టుబడిన విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న బలగాలు కారుతో పాటు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై ఎన్నికల కమిషన్‌కు నివేదికను ఇవ్వడంతో అతనిపై చర్యలు తీసుకున్నాయి. ఎన్నికల విధుల్లో ఉండాల్సిన సీఐ అంజిత్ రావు హైదరాబాద్ ఎందుకు వచ్చారనే దానిపై విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా నగదు తరలించడానికి సీఐ కారులో వచ్చారని గుర్తించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల తనిఖీల నుంచి తప్పించుకున్నారని భావిస్తున్నారు. వరంగల్ నుంచి పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులను దాటేందుకు సీఐ సహకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రాథమిక నివేదిక ఆదారంగా సీఐపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.