Lok Sabha elections: మూడో దశలో 61 శాతానికి పైగా పోలింగ్; అసోంలో అత్యధికం-over 61 percent polling recorded in third phase assam sees highest voter turnout ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections: మూడో దశలో 61 శాతానికి పైగా పోలింగ్; అసోంలో అత్యధికం

Lok Sabha elections: మూడో దశలో 61 శాతానికి పైగా పోలింగ్; అసోంలో అత్యధికం

HT Telugu Desk HT Telugu
May 07, 2024 08:50 PM IST

Lok Sabha elections 2024: భారత్ లో లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ విడతలో 61% పోలింగ్ నమోదైనట్లు సమాచారం. మూడో దశ పోలింగ్ లో అసోంలో అత్యధికంగా 75.30 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 73.93 శాతం, ఛత్తీస్ గఢ్ లో 66.99 శాతం పోలింగ్ నమోదైంది.

ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్
ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్ (AFP)

ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 లోక్ సభ స్థానాలకు మంగళవారం మూడో దశ లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికావడం, ఇతరులు పోటీ నుంచి వైదొలగడంతో సూరత్ లో బీజేపీ ఏకగ్రీవంగా విజయం సాధించింది. ఇప్పటివరకు, ఈ మూడు విడతల్లో 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 283 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది.

61.5% పోలింగ్

ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. మూడో విడతలో 61.5% పోలింగ్ నమోదైంది. పూర్తి వివరాలు అందిన తరువాత ఈ శాతం పెరిగే అవకాశం ఉంది. బీజేపీ పాలిత అస్సాంలో అత్యధికంగా 75.30% ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అస్సాంలో మేఘావృతమైన ఆకాశం, చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం ఉన్నప్పటికీ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. పోలింగ్ ముగియడానికి అధికారిక సమయం సాయంత్రం 6 గంటలు కాగా, ఆ సమయానికి క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు కూడా ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.

అస్సాం లీడింగ్

అసోంలోని నాలుగు లోక్ సభ నియోజకవర్గాల్లో ధుబ్రీలో అత్యధికంగా 79.7 శాతం, బార్ పేటలో 76.73 శాతం, కోక్రాఝార్ లో 74.24 శాతం, గౌహతిలో 68.93 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 73.9 శాతం పోలింగ్ నమోదు కాగా, ముస్లిం మెజారిటీ జిల్లాల్లోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఛత్తీస్ గఢ్ లోని 11 లోక్ సభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగ్గా 66.99 శాతం పోలింగ్ నమోదైంది. రాయ్ పూర్, దుర్గ్, బిలాస్ పూర్, కోర్బా, జంజ్గిర్-చంపా, సుర్గుజా, రాయ్ గఢ్ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది.

మధ్యప్రదేశ్ లో..

మూడో దశ పోలింగ్ జరిగిన మధ్యప్రదేశ్ లోని తొమ్మిది నియోజకవర్గాల్లో 63.19 శాతం పోలింగ్ నమోదైంది. రాజ్ గఢ్ లో అత్యధికంగా 73.63 శాతం, విదిషాలో 70.48 శాతం, గుణలో 69.72 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్ లో మొదటి, రెండో దశల్లో వరుసగా 58.59 శాతం, 67.75 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలు నాలుగు దశల్లో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల చివరి దశ అయిన నాలుగో దశ మే 13న జరగనుంది.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలోని 48 లోక్ సభ స్థానాలకు గాను 11 నియోజకవర్గాల్లో మూడో దశలో ఎన్నికలు జరిగాయి. ఈ రోజు జరిగిన పోలింగ్ లో మహారాష్ట్రలో 54.98 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిలో కొల్హాపూర్ లో అత్యధికంగా 63.71 శాతం, హత్కనంగలెలో 62.18 శాతం, లాతూర్ లో 55.38 శాతం, సతారాలో 54.11 శాతం, రత్నగిరి-సింధుదుర్గ్ లో 53.75 శాతం, ఉస్మానాబాద్ లో 52.78 శాతం, సాంగ్లీలో 52.56 శాతం, రాయ్ గఢ్ లో 52.56 శాతం పోలింగ్ నమోదైంది.

గుజరాత్ లో..

గుజరాత్ లో మూడో విడతలో పోలింగ్ జరిగిన 25 నియోజకవర్గాల్లో 56.83 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. గిరిజన రిజర్వ్డ్ వల్సాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 68.66 శాతం, అత్యల్పంగా అమ్రేలిలో 46.11 శాతం పోలింగ్ నమోదైంది.

బిహార్ లో…

ప్రస్తుతం అధికార ఎన్డీయే ఆధీనంలో ఉన్న బిహార్ లోని అరారియా, ఝంఝర్పూర్, సుపౌల్, మాధేపురా, ఖగారియా లోక్ సభ స్థానాల్లో 56 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల సమయానికి సుపౌల్ లో అత్యధికంగా 58.91 శాతం, అరారియాలో 58.57 శాతం, మాధేపురాలో 54.92 శాతం, ఖగారియాలో 54.35 శాతం, ఝంఝర్ పూర్ లో 53.29 శాతం పోలింగ్ నమోదైంది.

ఉత్తర ప్రదేశ్ లో..

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో 51.53 శాతం, అయోన్లాలో 54.73 శాతం, బుదౌన్ లో 52.77 శాతం, బరేలీలో 54.21 శాతం, ఎటాలో 57.07 శాతం, ఫతేపూర్ సిక్రీలో 54.93 శాతం, ఫిరోజాబాద్ లో 56.27 శాతం, హత్రాస్ లో 53.54 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి రెండు దశల్లో, మొత్తంగా వరుసగా 66.14 శాతం, 66.71 శాతం పోలింగ్ నమోదు కాగా, ఐదేళ్ల క్రితం ఇదే దశలతో పోలిస్తే స్వల్పంగా తగ్గిందని, వేసవి తాపం, ఓటర్లను ఉత్తేజపరిచేందుకు ఒక్క బలమైన అంశం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

WhatsApp channel