Opinion: ఉద్యమ గడ్డపై ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టులు-communist parties in telangana face existential crisis amid political shifts ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Opinion: ఉద్యమ గడ్డపై ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టులు

Opinion: ఉద్యమ గడ్డపై ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్టులు

HT Telugu Desk HT Telugu
Jun 03, 2024 03:51 PM IST

‘పోరుగడ్డ తెలంగాణలో మొదటి నుండి సాంస్కృతిక పరంగా, ప్రజా ఉద్యమాల పరంగా చరిత్ర గల వామపక్ష పార్టీలకు మాత్రం 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో చోటు లేకుండా పోయింది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ రీసెర్చర్ ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.

ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్ట్ పార్టీలు
ఉనికి కోల్పోతున్న కమ్యూనిస్ట్ పార్టీలు (AP)

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో రానుండడంతో రాజకీయ పార్టీలు టెన్షన్‌తో లెక్కలేసుకుంటున్నాయి. ఆయా పార్టీలు తమకున్న ప్రజాబలాన్ని ఎన్నికల్లో నిరూపించుకుంటేనే వాటికి మనుగడ ఉంటుంది. ఎన్నికల ఫలితాలే పార్టీల భవిష్యత్తుకు గీటురాయిగా నిలుస్తాయి. ఇటీవల తెలంగాణలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పట్టు నిలుపుకోవాలని, రాష్ట్రాన్ని పదేళ్లు పాలించి ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పునర్వైభవం పొందాలని, గత అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తామని కలలుగని భంగపాటుకు గురైన బీజేపీ ఆధిక సీట్లు సాధించాలనే పట్టుదలతో విజయమే లక్ష్యంగా పోటీపడ్డాయి.

అయితే ఇందుకు భిన్నంగా పోరుగడ్డ తెలంగాణలో మొదటి నుండి సాంస్కృతిక పరంగా, ప్రజా ఉద్యమాల పరంగా చరిత్ర గల వామపక్ష పార్టీలకు మాత్రం 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో చోటు లేకుండా పోయింది.

తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించిన ఏదేనీ అంశం తెరమీదకు రాగానే గుర్తుకొచ్చే వామపక్షాలు రాష్ట్రంలో ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం రెండు సార్లు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో బరిలోకి దిగిన సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా పోటీ చేయలేదు. ఇందుకు ప్రధాన కారణం వారి స్వయంకృపారాధమే.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి నుండి ప్రజాదరణ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు పలుమార్లు ఎన్నికల్లో వారి సొంత బలాన్ని నిరూపించుకోవడం కంటే చట్ట సభల్లో చోటు దొరికితే చాలు అన్నట్టు వ్యవహరించడంతో ఎప్పుడూ ఇతర పార్టీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు చివరికి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో పోటీలోనే లేవు.

అదే టర్నింగ్ పాయింట్

తెలంగాణ రాష్ట్ర సాధన మలి ఉద్యమంతో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలకు రాష్ట్రంలో కష్టాలు మొదలయ్యాయి. సీపీఐ(ఎం) సైద్ధాంతికంగా భాషా ప్రయుక్త రాష్ట్ర వాదనకు కట్టుబడగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకుంది. తెలంగాణ ఉద్యమంతో సీపీఐ(ఎం) క్యాడర్‌ చిన్నాభిన్నం కావడంతో ఆ పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలింది.

ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినా సీపీఐ కూడా ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోయింది. 2014లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ(ఎం) వైఎస్‌ఆర్‌సీపీతో, సీపీఐ కాంగ్రెస్‌తో జత కట్టి చెరో అసెంబ్లీ సానాల్లో గెలిచాయి.

సమైక్య రాష్ట్రానికి మద్దతిచ్చి తెలంగాణలో పట్టు కోల్పోయిన సీపీఐ(ఎం) తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి బలపడాలనే లక్ష్యంతో బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) పేరిట కూటమిని ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. వివిధ ప్రజా సంఘాలు సీపీఐ(ఎం) నేతృత్వంలోని బీఎల్‌ఎఫ్‌తో జతకట్టినా మిత్రులైన సీపీఐ దూరంగానే ఉండి కాంగ్రెస్‌, టీడీపీలతో కూడిన మహాకూటమిలో చేరింది.

భిన్న వైఖరితో ఈ రెండు పార్టీలు వేర్వేరు దారిలో ప్రయాణించినా ఇరు పార్టీలు ఒక్క చోట కూడా గెలవలేదు. సైద్ధాంతికంగా విభేదాలున్నా సర్దుకుపోతూ ఇతర పార్టీలతో జత కట్టినా సానుకూల ఫలితాలు రాకపోవడంతో రెండు పార్టీలు కలిసికట్టుగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో బలమైన స్థానాల్లో పోటీ చేసినా రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా భంగపాటుకు గురైన వామపక్షాలు సైద్ధాంతికంగా వైరుధ్యమున్న బీజేపీ రాష్ట్రంలో బలపడుతుండడంతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవడంతో పాటు అనంతరం జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బలపడడం, హుజురాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ రాష్ట్రంలో ఎదుగుతుందని భావించిన కమ్యూనిస్టు పార్టీలు బీజేపీని నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. బీజేపీకి అడ్డుకట్ట వేయాలని ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకున్న వామపక్షాలు చివరికి తమ ఉనికి కోల్పోయే స్థితిని కొని తెచ్చుకున్నాయని చెప్పవచ్చు.

అవకాశం కోల్పోయిన కమ్యూనిస్టులు

తెలంగాణలో 2022 చివరిలో జరిగిన మునుగోడు ఉప ఎన్నిక ద్వారా వచ్చిన ఒక సదావకాశాన్ని వామపక్షాలు జారవిడుచుకున్నాయి. మునుగోడులో ఐదు సార్లు గెలిచిన చరిత్ర సీపీఐ పార్టీకి ఉంది. ఇక్కడ కమ్యూనిస్టులకు కనిష్టంగా పాతిక వేల ఓటు బ్యాంకు ఉంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో తమకున్న బలాన్ని నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోయాయి.

మునుగోడు ఉప ఎన్నిక ముందు వరకు బీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను తూర్పారబట్టిన వామపక్షాలు మద్దతు కోరిన కాంగ్రెస్‌ను కాదని కేసీఆర్‌ పంచన చేరాయి. బీజేపీని ఓడించే పార్టీకే మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించుకున్నాయి. సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని చెబుతూ వివిధ సందర్భాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను బూర్జువా పార్టీలుగా విమర్శించిన వామపక్షాలు వాటిలో ఎవరికో ఒకరికి మద్దతివ్వాలనుకోవడం అవకాశవాద రాజకీయమే.

ఎందుకంటే ఒకసారి వారి పక్షాన చేరడంతో అంతవరకు వారిపై చేసిన విమర్శలు ఒక్కసారిగా ఒప్పయిపోతాయా అని ఆ పార్టీ కార్యకర్తలే మదనపడిన ఘటనలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా గెలిచినా, ఓడినా ఒంటరిగా పోటీ చేద్దామని, బీఆర్‌ఎస్‌కు మద్దతివ్వద్దని స్థానిక నేతలు, కార్యకర్తలు వాపోయినా అగ్రనేతలు పెడచెవిన పెట్టారు. 

అప్పుడు వారి మాటే వినుంటే కమ్యూనిస్టుల బలం ఇతర పార్టీలకు తెలిసి వచ్చేది. వారి బలం ఎరిగి అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారి మాటకు విలువుండేది. ప్రధానంగా బీఆర్‌ఎస్‌ కాళ్లబేరానికి వచ్చేది. ఈ సువర్ణావకాశాన్ని జారవిడ్చుకున్న కమ్యూనిస్టులు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకున్నారు.

బీజేపీపై కోపంతో అప్పటి వరకు విమర్శించిన బీఆర్‌ఎస్‌తో మునుగోడు ఉప ఎన్నికల కోసం సర్దుకుపోయినా కేసీఆర్‌ కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలకు మొండిచేయి చూపారు. చివరి నిమిషం వరకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు వామపక్ష పార్టీలతో దోబూచులాడడంతో ఏ గట్టున ఉండాలో తెలియక కమ్యూనిస్టు పార్టీలు గందరగోళానికి గురై చివరికి నష్ట పోయాయి.

పోటీ చేసే సీట్లపై అవగాహన కుదరకపోవడంతో సీపీఐ(ఎం) ఒంటరిగా 19 స్థానాల్లో పోటీ చేయగా పాలేరులో పోటీ చేసిన పార్టీ అగ్రనేత తమ్మినేని వీరభద్రంతో సహా అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకొని పోటీ చేయడంతో కొత్తగూడెంలో పార్టీ అగ్రనేత కూనంనేని సాంబశివరావు గెలిచారు.

ఎటూ తేల్చుకోలేక

2023 అసెంబ్లీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు ఎటూ తెల్చుకోలేక నష్ట పోయిన వామపక్షాలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా మళ్లీ అదే తత్తరపాటుకు గురై చివరికి చేతులేత్తేశాయి. బలమున్న స్థానాల్లో పోటీ చేస్తున్నామని మొదట్లో డాంభికంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం వెనకడుగు వేశాయి. కాంగ్రెస్‌తో చర్చించి పట్టున్న స్థానాలివ్వాలని కోరుతామని, అవగాహన కుదరకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పడంతో కమ్యూనిస్టు మూలాలున్న ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. సీపీఐ(ఎం) ఒకడుగు ముందుకేసి భువనగిరి లోక్‌సభ అభ్యర్థిని కూడా ప్రకటించింది.

ఎన్నికల సమీపించే వేళ కాంగ్రెస్‌ బీజేపీ బూచిని చూపి వామపక్షాలను మేనేజ్‌ చేయడంతో తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర పునరావృత్తమైంది. బీజేపీ బలంగా ఉన్న భువనగిరి వంటి చోట పోటీ నుండి తప్పుకున్నా, వామపక్షాలకు పట్టు ఉండి బీజేపీకి ఎలాంటి బలం లేని ఖమ్మం, నల్లగొండ నుండి పోటీకి ఎందుకు ప్రయత్నించలేదు..? అక్కడ బీఆర్‌ఎస్‌ను అడ్డుకోవాలనుకుంటే ఆరు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో వారితో పొత్తు కోసం ఎందుకు పాకులాడినట్టు..?

తమ పార్టీని బలోపేతం చేసే బదులు బీజేపీని సాకుగా చూపుతూ ఇతర పార్టీలకు మద్దతిస్తూ కాలం గడుపుతున్న వామపక్షాలు తమ ఉనికికే ప్రమాదం తెచ్చుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఒక వెలుగు వెలిగి, తెలంగాణ గడ్డపై ఎంతో చరిత్ర గల కమ్యూనిస్టు పార్టీలు పలుమార్లు తప్పటడుగులు వేస్తున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఒక చోట కూడా బరిలో లేకపోవడం వారి పతనానికి నిదర్శనం.

-ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్
ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన విశ్లేషణలు, వ్యూహాలు, అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

WhatsApp channel