Telangana Loksabha Results 2024 : పార్లమెంట్ ఫలితాల్లో పత్తాలేని బీఆర్ఎస్...! పార్టీ ఖాతాలోకి ఊహించని రికార్డు..!
Telangana Loksabha Election Results 2024 : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పూర్తిగా డీలాపడిపోయింది. కనీసం ఒక్కసీటు కూడా గెలుచుకోలేని పరిస్థితికి చేరింది.
Telangana Loksabha Election Results 2024 : తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొంది. 17 సీట్లలో సగం సీట్లలో బీజేపీ, మరికొన్ని సీట్లలో కాంగ్రెస్ పాగా వేసే అవకాశం ఉంది.. ఒక్క స్థానంలో ఎంఐఎం గెలిచే ఛాన్స్ ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులైపోయింది.
మారిన సమీకరణాలు - ఖాతా తెరవటం కష్టమే..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో ఇక్కడ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీఆర్ఎస్ 39 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష స్థానంలో ఉంది. అయితే తాజాగా జరిగిన పార్లమెంట్ స్థానాల్లో చాలాచోట్ల మూడో స్థానానికి పరిమితమైన పరిస్థితులు కనిపించాయి.
మెదక్, నాగర్ కర్నూలు నియోజకవర్గాల్లో మొదట్లో స్వల్ప లీడ్ వచ్చినప్పటికీ…. పూర్తిగా పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ మినహా మిగతా చోట్ల కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ సాగింది. ఇందులోనూ కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగగా… మరికొన్నిచోట్ల కాషాయజెండా ఎగరటం ఖాయంగా మారింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్ లో ఉండిపోయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్… రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా ఉంది. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ ఉండగా… బీజేపీ 3 స్థానంలో నిలిచింది. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతైపోయింది. కనీసం ఒక్కసీటు కూడా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఆశలు పెట్టుకున్న స్థానాల్లోనూ బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పొటీ నెలకొంది. ఫలితంగా…. గులాబీ పార్టీ పూర్తిగా చతికిలపడిపోయింది. ఈ ఫలితాల తర్వాత…. పార్టీ పరిస్థితి మరింత పడిపోయే అవకాశం ఉందన్న విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి.
టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి 2019 వరకు జరిగిన ప్రతి పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరుస్తూ వచ్చింది. పలుమార్లు అత్యధిక స్థానాలనూ కైవసం చేసుకుంది. అయితే పార్టీ ఏర్పాటు నుంచి ఒక్క సీటు కూడా గెలవకపోవటం ఇదే తొలిసారి అని గులాబీ నేతలు చెబుతున్నారు. ఇది ఓ రకంగా ఆ పార్టీలో ఖాతాలో అత్యంత చెత్త రికార్డు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.