Lok sabha elections : కేరళలో బిగ్​ ఫైట్​.. ఎవరిది విజయం? మోదీ మ్యాజిక్​ ఈసారైనా పనిచేస్తుందా?-2024 lok sabha elections udp vs ldp fight in kerala who will win ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections : కేరళలో బిగ్​ ఫైట్​.. ఎవరిది విజయం? మోదీ మ్యాజిక్​ ఈసారైనా పనిచేస్తుందా?

Lok sabha elections : కేరళలో బిగ్​ ఫైట్​.. ఎవరిది విజయం? మోదీ మ్యాజిక్​ ఈసారైనా పనిచేస్తుందా?

Sharath Chitturi HT Telugu
Feb 25, 2024 11:00 AM IST

Lok sabha elections Kerala : 2024 లోక్​సభ ఎన్నికల నేపథయ్యంలో కేరళలో హడావుడి ఊపందుకుంది. ఎల్​డీఎఫ్​- యూడీఎఫ్​లు.. ఒక పార్టీపై ఇంకో పార్టీ.. పైచేయి సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వీటి మధ్య బీజేపీ కూడా ఈసారి ఖాతా తెరవాలని ప్రయత్నిస్తోంది.

కేరళలో బిగ్​ ఫైట్​.. ఎవరిది విజయం?
కేరళలో బిగ్​ ఫైట్​.. ఎవరిది విజయం?

2024 lok sabha elections in Kerala : 2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ హడావుడి కనిపిస్తోంది. 400 సీట్లు గెలవాలను బీజేపీ టార్గెట్​గా పెట్టుకుంది. విపక్షాలు.. ఇండియా కూటమిగా ఏర్పడి, మోదీని గద్దెదించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందరి చూపు దక్షిణాది రాష్ట్రాలపై పడింది. మరీ ముఖ్యంగా.. కేరళలో లోక్​సభ ఎన్నికల హడావుడి ఇప్పటికే తారస్థాయిలో ఉంది. లోక్​సభ ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలని అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? కేరళలో 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో బీజేపీ ప్రభావం ఎంత? ఇక్కడ చూద్దాము..

కేరళలో 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలు ఇలా..

లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వాటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 543 సీట్లల్లో 20 సీట్లు కేరళ రాష్ట్రానికి చెందినవి. గత లోక్​సభ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ హవా కొనసాగింది. 20 సీట్లల్లో.. 19 చోట్ల విజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా.. కేరళలో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేదు. అధికార ఎల్​డీఎఫ్​ (లెఫ్ట్​ డెమొక్రటిక్​ ఫ్రెంట్​).. ఒక్కటంటే ఒక్క సీటులోనే విజయం సాధించింది.

కేరళ రాజకీయాల్లో మొత్తం మూడు కూటములు ఉంటాయి. ఒకటి యూడీఎఫ్​. ఇందులో కాంగ్రెస్​, ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​, కేరళ కాంగ్రెస్​ (ఎం), రివొల్యూషనరీ సోషలిస్ట్​ పార్టీలు ఉంటాయి. ఎల్​డీఎఫ్​లో సీపీఐ(ఎం), సీపీఐ పార్టీలు ఉంటాయి. ఇక ఎన్​డీఏలో బీజేపీతో పాటు భారత్​ ధర్మ జన సేన, కేరళ కాంగ్రెస్​ (టీ) ఉన్నాయి.

lok sabha elections latest news : నాటి కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. కేరళ వయనాడ్​ నుంచి పోటీ చేయడం హాట్​ టాపిక్​గా మారింది. వాస్తవానికి ఆయన సొంత నియోజవర్గం.. ఉత్తర్​ప్రదేశ్​లోని అమేఠీ. ప్రతిసారి ఆ ఒక్క సీటు నుంచే పోటీ చేసేవారు. కానీ గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. అమెఠీలో ఓడిపోయారు. కేంద్రమంత్రి, బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్​ గాంధీకి ఘోర భంగపాటు ఎదురైంది. కానీ.. వయనాడ్​ ప్రజలు మాత్రం రాహుల్​ గాంధీకి స్వాగతం పలికారు. భారీ మెజారిటీతో ఆయన్ని గెలిపించారు. మోదీ ఇంటిపేరు కేసులో.. రాహుల్​ గాంధీ తన సభ్యత్వాన్ని కోల్పోయినా, ఆయన వెన్నంటే నిలిచారు. ఈసారి కూడా.. రాహుల్​ గాంధీ కేరళ వయనాడ్​ నుంచే పోటీ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

2021 అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఉంటుందా?

కేరళలో అనాదిగా ఓ ఆనవాయతీ వస్తూ ఉండేది. అక్కడ.. యూడీఎఫ్​​- ఎల్​డీఎఫ్​ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నారు. అక్కడి ప్రజలు.. ఒకే పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారాన్ని కట్టబెట్టలేదు. కానీ 2021లో ఈ ఆనవాయతీకి బ్రేక్​ పడింది. అధికారపక్షంగా నాటి ఎన్నికల్లో పోటీ చేసిన ఎల్​డీఎఫ్​.. అంచనాలకు మించిన ఘన విజయం సాధించింది. మొత్తం 140 అసెంబ్లీ సీట్లల్లో 99 చోట్ల గెలిచింది. ఈసారి కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనుకున్న కాంగ్రెస్​కు ఘోర పరాభవం ఎదురైంది. కేవలం 41 సీట్లతో సరిపెట్టుకుంది. అక్కడ బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది.

మరి కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్​సభ ఎన్నికలపై ఏమాత్రం ఉంటుందో వేచి చూడాలి.

లోక్​సభ ఎన్నికల కోసం పార్టీల కసరత్తు..

Kerala UDF : 2024 లోక్​సభ ఎన్నికల కోసం కేరళలో పార్టీల కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఎల్​డీఎఫ్​ కూటమిలో సీట్ల సద్దుబాటు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో.. సీపీఎం​ 15 చోట్ల పోటీ చేస్తుందని సమాచారం. సీపీఐకి 4 సీట్లు దక్కుతాయని, కేరళ కాంగ్రెస్​ (ఎం) ఒక చోట పోటీ చేస్తుందని తెలుస్తోంది.

అయితే.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనైనా గెలవాలని, 2019 లోక్​సభ ఎన్నికల ఫలితాలు రిపీట్​ అవ్వకూడదని ఎల్​డీఎఫ్​ బృందం బలంగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం.. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ, మాజీ ఆర్థికమంత్రి థామస్​ ఐసక్​, ప్రస్తుత కేబినెట్​ మంత్రి కే రాధాకృష్ణన్​, ప్రముఖ నటుడు ముకేశ్​లను బరిలో దింపాలని చూస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Keral LDF : యూడీఎఫ్​ పరిస్థితి మాత్రం కాస్త ఇబ్బందికరంగానే ఉన్నట్టు తెలుస్తోంది! యూడీఎఫ్​లో భాగమైన ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్​.. సీట్ల సద్దుబాటు వ్యవహారంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మూడో లోక్​సభ సీటు కావాలని ఆ పార్టీ అడుగుతున్నట్టు.. అందుకు కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​ సభ్యులు అంగీకరించడం లేదని తెలుస్తోంది. ఐయూఎంఎల్​కు ఇప్పటికే ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ మూడో సీటు అడుగుతోంది. రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్​ చెబుతున్నా.. మూడో లోక్​సభ సీటు కచ్చితంగా కావాలని పార్టీ పట్టుబడుతోందట.

ఐయూఎంఎల్​ అసంతృప్తిని ఎల్​డీఎఫ్​ క్యాష్​ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది! "కాంగ్రెస్​ నుంచి అడ్డుకుంటూ.. యూడీఎఫ్​లో ఉండటం దేనికి?" అంటూ కామెంట్లు చేశారు సీపీఎం సీనియర్​ నేత పీ రాజీవ్​.

మరోవైపు.. ఉత్తర కేళలోని ఆరు జిల్లాలు.. అన్ని కూటములకు కీలకంగా మారాయి. ఇక్కడ మొత్తం 9 లోక్​సభ సీట్లు ఉంటాయి. వీటిల్లో రెండు నియోజకవర్గాలు.. అత్యంత కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. అవి.. వయనాడ్​, మలప్పురం. గతంలో ఈ 9 సీట్లల్లో కాంగ్రెస్​కు చెందిన యూడీఎఫ్​ విజయం సాధించింది. కానీ ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవాలని ఎల్​డీఎఫ్​ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది.

UDF vs LDF in Kerala : బీజేపీకి ఉత్తరాదిన మంచి పట్టు ఉంది. కానీ దక్షిణాదిలో మాత్రం కమలదళానికి ఎప్పటికప్పుడు నిరుత్సాహం ఎదురవుతూనే ఉంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని (కర్ణాటక) కూడా కోల్పోయింది. మరి కేరళ లోక్​సభ ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపిస్తుందో వేచి చూడాలి. ఈసారైనా ఖాతా తెరవాలని ఆ పార్టీ బలంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని మోదీ ఎన్ని పర్యటనలు చేపట్టినా, మోదీ మేనియా ఇక్కడ పనిచేస్తున్నట్టు కనిపించడం లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరి కేరళలో యూడీఎఫ్​- ఎల్​డీఎఫ్​ మధ్య ఈసారి రసవత్తర పోరు కనిపిస్తుందా? లేక గత ఎన్నికల్లో జరిగినట్టే.. యూడీఎఫ్​ క్లీన్​ స్వీప్​ చేస్తుందా? కేరళపై మోదీ మ్యాజిక్​ ఈసారైనా పనిచేస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం 2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే!

సంబంధిత కథనం