Telangana Elections 2023 : ముథోల్ లో 'కారు'కు రిపేర్..! ఈసారి ఏ జెండా ఎగరబోతుంది..?
Mudhole Assembly constituency : అసెంబ్లీ ఎన్నికల వేళ ముథోల్ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అభ్యర్థిపై వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కాషాయజెండాను ఎగరవేయాలని బీజేపీ శ్రేణులు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు విజయంపై కాంగ్రెస్ కూడా ధీమాను వ్యక్తం చేస్తోంది.
Mudhole Assembly constituency: ఉమ్మడి ఆదిలాబాద్ లోని ముధోల్ నియోజకవర్గం లో కారుకు రిపేర్ ఏర్పడినట్లు కనిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విట్టల్ రెడ్డికి అడుగడుగున వ్యతిరేకత నెలకొంది. నియోజవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో సొంత పార్టీలోనే దిగువ స్థాయి నాయకులు తిరుగుబాటు వ్యక్తం చేస్తున్నారు. బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పలువురు ఎంపిటిసిలు మాజీ ఎంపీపీలు సెట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎముదోలు నియోజవర్గంలో సాగునీటి కోసం తవ్విన కాలువలు పూర్తి చేయలేదని, కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా చేపట్టిన పనులు పెండింగ్లో ఉన్నాయని, బాసర ఐఐటీలో వివాదాల పుట్ట ఉన్నప్పటికీ అంటి ముట్టనట్లు వ్యవహరిస్తారని ప్రజల అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు. మొదటి జాబితాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే కు టికెట్ దక్కడంతో బి ఫామ్ ఇవ్వొద్దని కొంతమంది ప్రజలు, నాయకులు వ్యతిరేక పోరాటం చేశారు. అధిష్టానం కు అనేక పిర్యాదులు చేశారు.
ఇది ఇలా ఉంటే మరోవైపు తానే కాబోయే ఎమ్మెల్యేనని హ్యాట్రిక్ విజయం సాధించడం తద్యమని ప్రచారం కొనసాగిస్తున్నారు విటల్ రెడ్డి. ఎన్నో ఏళ్లుగా కిందిస్థాయి నాయకులు సపోర్ట్ చేస్తున్నప్పటికీ ఈ దఫా వారంతా ప్రచారం లో కీలకంగా పాల్గొనడం లేదని సమాచారం అందుతుంది.
పుంజుకుంటున్న బిజెపి
ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ లో బిజెపి తప్పకుండా విజయం పొందడం ఖాయం అనే నియోజకవర్గంలో పేరున్న ముధోల్ లో ఈ సారీ విక్టరీ కొట్టడం ఖాయమని చెబుతున్నారు పలువురు. మొదటినుంచి హిందూ ఓటు బ్యాంకు అత్యధికంగా గల ఈ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్ర చేపట్టడంతో మరింత బలం చేకూరింది. బైంసా పట్టణంలో ఎంఐఎం ఓట్లు అత్యధిక ఉండడంతో వారి వ్యతిరేక హిందూ ఓట్లు తమను గెలిపిస్తాయని అంచనాలో ఉన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా మాజీ డిసిసి అధ్యక్షులు రామారావు పవార్ల్ , మోహన్ రావు పాటిల్ బిజెపిలో చేరారు. ఆయన కాంగ్రెస్ నుంచి బిజెపి జంప్ కావడంతో కాంగ్రెస్లో పెద్దదిక్కు కోల్పోయింది. ఈ నియోజకవర్గంలో మున్నూరు కాపు ఓట్లు అత్యధికంగా ఉన్నాయి. ఒక దశలో బండి సంజయ్ ఇక్కడ నుంచి పోటీ చేస్తాడని సమాచారం ఉండేది, చివరికి కాంగ్రెస్ నుండి వచ్చిన రామారావు పవర్ కు బీజేపీ సీటు దక్కింది. ఇక్కడ బిజెపి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగిన రమాదేవి టికెట్ దక్క పోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో బిజెపి పార్టీని గెలిపించేందుకు రాష్ట్ర, కేంద్ర నాయకులు విశేషంగా కృషి చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితులను ఈసారి బిజెపికే ప్రజలు పట్టం కడతారని స్థానిక నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న నారాయణరావు పటేల్ సైతం ఈసారి కాంగ్రెస్కు పట్టం కడతారని ఆశిస్తూ తనవంతు ప్రచారం కొనసాగిస్తున్నారు.
మొత్తంగా ఎవరికి వారుగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా…. మరోసారి కారు దూసుకెళ్తుందా…? లేక కాషాయజెండా రెపరెపలాలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. అనూహ్యంగా హస్తం పార్టీ హవా కనిపిస్తుందా అనేది చూడాలి…!