KTR On Ramoji Issue: రామోజీకి క్యాన్సర్‌ 88 ఏళ్ల వయసు కాబట్టే.. కేసీఆర్ దానికి ఒప్పుకోలేదన్న కేటీఆర్-ktr said that kcr did not accept it because ramoji was 88 years old and cancer patient ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr On Ramoji Issue: రామోజీకి క్యాన్సర్‌ 88 ఏళ్ల వయసు కాబట్టే.. కేసీఆర్ దానికి ఒప్పుకోలేదన్న కేటీఆర్

KTR On Ramoji Issue: రామోజీకి క్యాన్సర్‌ 88 ఏళ్ల వయసు కాబట్టే.. కేసీఆర్ దానికి ఒప్పుకోలేదన్న కేటీఆర్

Sarath chandra.B HT Telugu
Nov 14, 2023 04:10 PM IST

KTR On Ramoji Issue: ఏపీలోని వైసీపీ ప్రభుత్వంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావుల మధ్య నడుస్తున్న వివాదాల విషయంలో తెలంగాణ కేసీఆర్ వైఖరి స్పష్టంగా ఉందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

మంత్రి కేటీఆర్ చిట్ చాట్
మంత్రి కేటీఆర్ చిట్ చాట్

KTR On Ramoji Issue: కింద పడ్డ వాళ్లను దెబ్బతీయడం మానవత్వం కాదనే ఉద్దేశంతోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకురాలేదని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ ఎడిటర్ రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

yearly horoscope entry point

కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌ ఇవ్వడం వల్ల ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందనే వాదనను కేటీఆర్ తోసి పుచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్స్‌ దృష్టిలో కేసీఆర్‌ సహకరించడం వల్లే ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిందనే వాదనను కేటీఆర్ నిరాకరించారు. ఏపీ ప్రజలు జగన్‌కు అధికారాన్ని ఇవ్వాలని భావించడం వల్లే అక్కడ 151 సీట్ల మెజార్టీ వచ్చిందన్నారు.

అలాంటి భావన సెటిలర్లలో ఉంటే ఉండొచ్చన్నారు. 2018లో తెలంగాణలో టిఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావించినా అది సరికాదనే ఉద్దేశంతోనే కేసీఆర్‌ ఒంటరిపోరుకు వెళ్లినట్టు చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్‌తో టీడీపీ కలిసి వెళ్లిందన్నారు. తమను ఓడించడానికి తీవ్రంగా ప్రయత్నించారని చెప్పారు. చంద్రబాబుతో తమకు వ్యక్తిగత తగదాలు లేవన్నారు.

ఏ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టారో అదే పార్టీతో చంద్రబాబు 2018లో పొత్తు పెట్టుకున్నారన్నారు. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రయత్నించడంతోనే… అప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ చెప్పారని, అప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేశారనే భావన ప్రజల్లో ఉంటే ఉండొచ్చని కేటీఆర్‌ చెప్పారు. 2018లో చంద్రబాబు తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఓడించే ప్రయత్నం చేయకపోతే చంద్రబాబుతో తమకు ఎలాంటి పంచాయితీ ఉండేది కాదన్నారు.

ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా చంద్రబాబుతో తాము బాగానే ఉన్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. “చంద్రబాబు మీద ఏపీలో కేసు పెట్టిన తర్వాత ఓటుకు నోటు కేసు బయటకు తీయాలని తమకు ఒకాయన సలహా ఇచ్చారు..’ అని చెప్పారు. అలా అడిగింది ఏపీ సిఎం కాదని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఆ సమయంలో కేసీఆర్ ఒక విషయం స్పష్టం చేశారని.. కింద పడ్డపుడు తన్నడం మంచి పద్దతి కాదన్నారని, అలాంటి పనులు చేయొద్దని, కక్ష సాధింపులకు పాల్పడొద్దని స్పష్టంగా చెప్పారన్నారు. ఆ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఆ విషయంలో కోర్టులో నడిచినంత కాలం నడుస్తుందని, అలాంటివి ఏమి చేయొద్దని హుందాగా వ్యవహరించారని చెప్పారు. 2018 ఎన్నికల విషయంలో మాత్రమే చంద్రబాబుతో తమకు పంచాయితీ వచ్చిందని కేటీఆర్ చెప్పారు.

రామోజీరావును అరెస్ట్ చేసి తీసుకెళ్లడానికి సహకరించాలని కోరారనే ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు “ఆ సమయంలో కేసీఆర్…. రామోజీ రావుకు 88 ఏళ్ల వయసు, క్యాన్సర్ ఇబ్బంది ఉంది.. ఆయన మీద ఇదంతా ఏమిటి, కరెక్ట్ కాదు.. ఏమున్నా చట్టబద్దంగా చేసుకోవాలని చెప్పారు. ఇదే విషయాన్ని రామోజీరావు కుమారుడికి కూడా చెప్పారు” అని కేటీఆర్ వివరించారు.

ఇలాంటి విషయాల్లో కొన్ని విషయాలు లైన్స్ దాటడం ఎవరికి మంచిది కాదని, చంద్రబాబుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని అడిగే సంస్కారం తనకు, తాను పడితే ఎలా ఉన్నారని అడిగే సంస్కారం బాబుకు ఉందని కేటీఆర్ చెప్పారు. గిఫ్ట్‌ ఇవ్వడం వల్లే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి వచ్చిందన్నారు.

హైదరాబాద్‌లో అత్యధిక పెట్టుబడులు పెట్టి, లాభపడిన వాళ్లు ఆంధ్రా వాళ్లేనని, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ వేరే రాష్ట్రాలకు వెళ్లాలని వెదుకుతున్నప్పుడు ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని తాను కోరినట్టు కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల అందరి ఆస్తులు పెరిగాయి, లాభాలు పెరిగాయి, అభివృద్ధి జరిగిందని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో కులం పేరుతో కుంపట్లు పెట్టలేదన్నారు. మతంపేరుతో, ప్రాంతం పేరుతో పంచాయితీలు పెట్టలేదన్నారు. తెలంగాణలో కుల భావన లేదని స్పష్టం చేశారు.

Whats_app_banner