Yanamala Krishnudu : మారుతున్న 'తుని' రాజకీయం..! టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా
AP Elections 2024: కాకినాడ జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు… పార్టీకి రాజీనామా ప్రకటించారు. వైసీపీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
AP Elections 2024: ఏపీ ఎన్నికల వేళ (Andhrapradesh Elections)రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. పలువురు నేతలు…. పార్టీలు మారిపోతున్నారు. దీంతో చాలాచోట్ల సమీకరణాలు మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే…. కాకినాడ జిల్లాలోని తుని నియోజకవర్గానికి చెందిన యనమల కృష్ణుడు(Yanamala Krishnudu)… టీడీపీకి షాక్ ఇచ్చారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. తునిలో వైసీపీ గెలుపునకు కృషి చేస్తానని…. శనివారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు.
సీటు ఆశించి భంగపడి…
యనమల కృష్ణుడు(Yanamala Krishnudu)… మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి సోదరుడు అవుతాడు. తుని నియోజకవర్గ(Tuni Assembly constituency) బాధ్యతలు వీరిద్దరే చూసేవారు. కానీ గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు నడుస్తున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి పలమార్లు పోటీ చేసి ఓడిపోయిన కృష్ణుడు… ఈ ఎన్నికల్లో కూడా టికెట్ ను ఆశించారు కృష్ణుడు. కానీ పార్టీ అధినాయకత్వం…. యనమల రామకృష్ణుడు(Yanamala Rama Krishnudu) కుమార్తె దివ్యకు అవకాశం ఇచ్చింది. దీంతో కృష్ణుడు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉన్నారు. ఇటీవలే వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. దీంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్న ఆయన…. రేపు వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు.
పార్టీకి రాజీనామా ప్రకటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన కృష్ణుడు…. తనను పార్టీకి దూరంగా పెట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేశారని అన్నారు. తెలుగుదేశంతో ఉన్న 40 ఏళ్ల రాజకీయ బంధానికి దూరం కావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. పార్టీని వీడటం బాధగా ఉన్నప్పటికీ తప్పటం లేదన్నారు. 42 ఏళ్లు పార్టీ కోసం పని చేశానని… ఏనాడు పదవులు ఆశించలేదన్నారు. జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరుతానని పేర్కొన్నారు. తునిలో వైసీపీ గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
తుని నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మంత్రి దాడిశెట్టి రాజా పోటీ చేస్తున్నారు. కృష్ణుడి చేరికకు రాజా నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరినట్లు అయింది. 2014, 2019 ఎన్నికల్లో దాడిశెట్టి రాజా… వైసీపీ నుంచి గెలిచారు. ఈసారి కూడా ఆయనే బరిలో ఉండగా… కూటమి అభ్యర్థిగా యనమల దివ్య పోటీ చేస్తున్నారు. కీలమైన ఎన్నికల వేళ… యనమల సొంత సోదరుడు పార్టీ మారటం హాట్ టాపిక్ గా మారింది.