South Africa Team: తిరువనంతపురం అనలేక తంటాలు పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు.. ఫన్నీ వీడియో వైరల్-south africa team failed to pronounce thiruvananthapuram ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  South Africa Team: తిరువనంతపురం అనలేక తంటాలు పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు.. ఫన్నీ వీడియో వైరల్

South Africa Team: తిరువనంతపురం అనలేక తంటాలు పడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్లు.. ఫన్నీ వీడియో వైరల్

Hari Prasad S HT Telugu
Oct 02, 2023 08:38 AM IST

South Africa Team: తిరువనంతపురం అనలేక తంటాలు పడ్డారు సౌతాఫ్రికా క్రికెటర్లు. ఈ ఫన్నీ వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ అయింది.

సౌతాఫ్రికా క్రికెటర్ల వీడియో షేర్ చేసిన శశి థరూర్
సౌతాఫ్రికా క్రికెటర్ల వీడియో షేర్ చేసిన శశి థరూర్

South Africa Team: తిరువనంతపురం.. ఒకసారి అనండి. సరిగ్గా పలికారా లేదా? ఇండియాలో పుట్టి పెరిగిన మనలో కొందరికే ఈ పేరు పలకడం కష్టమవుతుంది. అలాంటిది సౌతాఫ్రికా నుంచి వచ్చిన క్రికెటర్లు ఈ పేరు పలకడం అంటే మాటలు కాదు. ఊహించినట్లే వాళ్లు నానా తంటాలూ పడ్డారు. కొందరు ప్లేయర్స్ ఎలాగోలా పలకగా.. మరికొందరు నోటికొచ్చిన పేరేదో చెప్పేశారు.

తిరువనంతపురం అనే పేరు పలకలేక సౌతాఫ్రికా క్రికెటర్లు ఇబ్బంది పడుతున్న వీడియోను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. "సౌతాఫ్రికా టీమ్ తిరువనంతపురం వచ్చింది. కానీ వాళ్లు ఎక్కడున్నారో ఎవరికైనా చెప్పగలరా?" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో తిరువనంతపురం అనే పదాన్ని సరిగ్గా పలికాల్సిందిగా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఛాలెంజ్ విసిరారు.

చాలా మంది ప్లేయర్స్ ఈ పేరును పలకలేకపోయారు. భారత మూలాలున్న కేశవ్ మహరాజ్, మరో ప్లేయర్ కగిసో రబాడా మాత్రమే ఈ పేరును పర్ఫెక్ట్ గా పలికారు. మిగతా వాళ్లంతా చాలా ఇబ్బంది పడ్డారు. కొందరైతే నోటికొచ్చిన పేరు పలికేశారు. ఈ వీడియో చూసి ఓ యూజర్ శశి థరూర్ కు ట్వీట్ చేస్తూ.. సౌతాఫ్రికా క్రికెటర్లను వదిలేయండి.. ఇండియాలో ఉన్నవారైనా ఈ పేరును సరిగ్గా పలుకుతారా అని ప్రశ్నించారు.

దీనికి థరూర్ స్పందిస్తూ.. "వాళ్లు కూడా సరిగా పలకలేరు. నేను కేరళలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో చూశాను. పెద్ద పెద్ద స్టార్లు కూడా తిరువనంతపురం పేరును సరిగా పలకలేకపోయారు. మనం అనంతపురి అనే పేరు పెట్టాల్సింది" అని అనడం గమనార్హం.

అసలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే.. వరల్డ్ కప్ వామప్ మ్యాచ్ ఆడటానికి సౌతాఫ్రికా క్రికెట్ టీమ్ తిరువనంతపురం వచ్చింది. వరల్డ్ కప్ అక్టోబర్ 5న ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 3 వరకూ వామప్ మ్యాచ్ లు జరుగుతాయి. ఆఫ్ఘనిస్థాన్ తో సౌతాఫ్రికా ఆడాల్సిన తొలి వామప్ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఇప్పుడు ఇండియా కూడా మంగళవారం (అక్టోబర్ 3) నెదర్లాండ్స్ తో ఇక్కడే వామప్ మ్యాచ్ ఆడనుంది.