Pakistan Coach: ఇండియా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కోచ్ షాకింగ్ కామెంట్స్-pakistan coach thanks india for wonderful gift cricket news in telugu ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pakistan Coach: ఇండియా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Pakistan Coach: ఇండియా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది.. థ్యాంక్యూ: పాకిస్థాన్ కోచ్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu
Sep 12, 2023 01:58 PM IST

Pakistan Coach: ఇండియా మాకు మంచి గిఫ్ట్ ఇచ్చింది.. థ్యాంక్యూ అంటూ పాకిస్థాన్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ తమకో గుణపాఠంలాంటిదని అన్నాడు.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో హెడ్ కోచ్ బ్రాడ్‌బర్న్
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో హెడ్ కోచ్ బ్రాడ్‌బర్న్ (AFP)

Pakistan Coach: ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో ఇండియా చేతుల్లో దారుణంగా ఓడిపోయింది పాకిస్థాన్. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇండియాపై పాకిస్థాన్ కు ఇదే అత్యంత ఘోరమైన పరాజయం. ఏకంగా 228 రన్స్ తేడాతో టీమిండియా గెలిచింది. అయితే ఇలాంటి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు ఇండియన్ టీమ్ కు థ్యాంక్స్ అంటూ పాకిస్థాన్ హెడ్ కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ మ్యాచ్ తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇండియా చేతుల్లో ఓటమి పాకిస్థాన్ కు ఓ గుణపాఠంలా పనికొస్తుందని బ్రాడ్‌బర్న్ అన్నాడు. "గత రెండు రోజుల్లో మాకు అందిన గిఫ్ట్ కు కృతజ్ఞులుగా ఉంటాం. తరచూ ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్స్ లో ఆడే అవకాశం మాకు దక్కదు. గత మూడు నెలలుగా మేము ఓడిపోలేదు. అందువల్ల ఇది మాకు సమయానికి దక్కిన గుణపాఠంలా భావిస్తున్నాం. ప్రతి రోజూ మెరుగయ్యే దిశగా మమ్మల్ని మేము మలచుకుంటాం. నిజానికి గత రెండు రోజులుగా జరిగినది మాకు ఓ గిఫ్ట్ లాంటిది" అని పాకిస్థాన్ హెడ్ కోచ్ గ్రాండ్ బ్రాడ్‌బర్న్ అన్నాడు.

నిజానికి గత కొన్ని నెలలు వన్డేల్లో పాకిస్థాన్ టాప్ ఫామ్ లో ఉంది. ఈ ఫార్మాట్లో నంబర్ వన్ ర్యాంక్ కూడా అందుకుంది. ఆసియా కప్ లోనూ నేపాల్, బంగ్లాదేశ్ లను చిత్తు చేసింది. ఇండియాతో రద్దయిన లీగ్ మ్యాచ్ లోనూ ఆ టీమ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. కానీ ఈ సూపర్ 4 మ్యాచ్ లో మాత్రం ఇండియన్ ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్ ముందు నిలవలేకపోయింది.

మ్యాచ్ లో ఓటమిపై బ్రాడ్‌బర్న్ స్పందిస్తూ.. "మ్యాచ్ లో అన్ని రంగాల్లోనూ మేము ఓడిపోయాం. ఎలాంటి సాకులూ లేవు. గత రెండు రోజులుగా మేము సరిగా ఆడలేదు. ఇండియా ఎదురుదాడి చేయడం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. మా బౌలింగ్ దాడి ఎంత బలంగా ఉందో అందరికీ తెలుసు. అయితే మంచి జట్లు దానిపై ఎదురు దాడి చేస్తాయి. మా బ్యాటింగ్ గత నెల రోజులుగా అంతంతమాత్రంగానే ఉంది. అయితే వాళ్లపై మాకు నమ్మకం ఉంది. మా సెలక్షన్ లో మేము నిలకడగా ఉన్నాం. వాళ్లు గాడిలో పడతారన్న నమ్మకం ఉంది" అని చెప్పాడు.

Whats_app_banner