Mohammed Shami: లోయలో పడిన వ్యక్తిని కాపాడిన మహ్మద్ షమీ.. వీడియో వైరల్
Mohammed Shami Saves Man Life: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ తన మంచి మనసు చాటుకున్నాడు. తాను వెళ్లే మార్గమధ్యలో కారు ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు మహ్మద్ షమీ. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Mohammed Shami Rescue Man Life: భారత క్రికెట్ టీమ్‌లో ఆటగాడిగా తనకంటూ మంచి స్థానం సంపాదించుకున్నాడు మహ్మద్ షమీ. బౌలింగ్‌లో స్టార్ పేసర్‌గా పాపులారిటీ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే, తాజాగా మహ్మద్ షమీ మంచి మనసు చాటుకున్నాడు. ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి స్టార్ ప్లేయర్ మాత్రమే కాదు మానవత్వం ఉన్న మంచి మనిషి అనిపించుకున్నాడడు మహ్మద్ షమీ.
టీమిండియా ప్లేయర్ మహ్మద్ షమీ శనివారం (నవంబర్ 25) అర్ధరాత్రి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో తన ముందు వెళ్తున్న ఓ కారు కొండపై నుంచి కిందకు లోయలోకి దూసుకెళ్లింది. అప్పుడు వెంటనే తన కారును ఆపిన మహ్మద్ షమీ కొంతమంది సాయంతో లోయలో పడిపోయిన కారులో ఉన్న వ్యక్తిని సకాలంలో బయటకు తీశాడు. దీంతో అతని ప్రాణాలు నిలబెట్టాడు షమీ.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ తన ఇన్ స్టా గ్రామ్‌లో షేర్ చేశాడు. "అతను చాలా అదృష్టవంతుడు. దేవుడు అతినికి రెండో జన్మను ఇచ్చాడు. నైనిటాల్ సమీపంలో కొండ రహదారిపై నా ముందు వెళ్తున్న కారు లోయలో పడిపోయింది. మేము అతన్ని సురక్షితంగా బయటకు తీశాం. ఒకరిని కాపాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" అని షమీ తన పోస్టులో రాసుకొచ్చాడు.
మహ్మద్ షమీ పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్స్, క్రికెట్ ఫ్యాన్స్ అంతా శభాష్ షమీ, మంచి మనసు అంటూ ప్రశంసలు కురిపిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో మహ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. కేవలం 7 మ్యాచుల్లో 24 వికెట్స్ తీసి టోర్నమెంట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.