Ind vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం!-india vs australia 1st test team india final xi kl rahul to open nitish reddy to debut perth test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ind Vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం!

Ind vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం!

Hari Prasad S HT Telugu
Nov 20, 2024 11:18 AM IST

Ind vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో శుక్రవారం (నవంబర్ 22) నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టులో టీమిండియా తుది జట్టు దాదాపు ఖరారైంది. ఓపెనర్ రోహిత్ శర్మ, మూడో స్థానంలో వచ్చే శుభ్‌మన్ గిల్ లేకపోవడంతో వాళ్ల స్థానాల్లో రాహుల్, దేవదత్ పడిక్కల్ రానున్నారు.

ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం!
ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఇదే.. తెలుగు క్రికెటర్ అరంగేట్రం! (AFP)

Ind vs Aus 1st Test: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు తుది జట్టులో కచ్చితంగా ఉండే కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇప్పుడు లేకపోవడంతో వాళ్ల స్థానాల్లో రాహుల్, పడిక్కల్ రానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి శుక్రవారం (నవంబర్ 22) ప్రారంభం కాబోయే తొలి టెస్టులో ఆడే తుది జట్టు దాదాపు ఖరారైంది.

ఓపెనర్లుగా రాహుల్, యశస్వి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మధ్యే మరోసారి తండ్రి కావడంతో అతడు ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్టుకు దూరం కానున్నాడు. దీంతో ఓపెనర్ స్థానం ఖాళీ అయింది. అతని స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ప్రాక్టీస్ సమయంలో అతడు కూడా గాయపడినా.. వెంటనే కోలుకున్నాడు.

పెర్త్ టెస్టులో యశస్వి జైస్వాల్ తో కలిసి రాహుల్ ఓపెనింగ్ చేయబోతున్నాడు. ఇక మూడో స్థానంలో ఆడాల్సిన శుభ్‌మన్ గిల్ కూడా గాయపడటంతో అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ తుది జట్టులోకి రాబోతున్నట్లు సమాచారం.

మిడిలార్డర్‌లో వీళ్లే..

నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ ఎలాగూ ఉన్నారు. ఆరో స్థానంలో ఎవరు అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ స్థానం కోసం సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ మధ్య పోటీ నెలకొంది. ఇండియా ఎ టీమ్ తరఫున రాణించిన జురెల్ కు అవకాశం రావచ్చని భావిస్తున్నారు.

సర్ఫరాజ్ ఖాన్ నిలకడ లేమి ప్రధాన సమస్యగా మారింది. న్యూజిలాండ్ తో తొలి టెస్టులో రాణించిన అతడు.. తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. దీంతో సర్ఫరాజ్ స్థానంలో జురెల్ వచ్చే ఛాన్స్ ఉంది.

నితీష్ రెడ్డి అరంగేట్రం

ఆల్ రౌండర్ల జాబితాలో తుది జట్టులో మన తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డికి చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అతనికిదే తొలి టెస్టు కానుంది. ఇప్పటికే టీ20 క్రికెట్ లో సత్తా చాటిన నితీష్ ఇప్పుడు సాంప్రదాయ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక జట్టులో ఏకైక స్పిన్నర్ గా సీనియర్ అశ్వినే ఉండనున్నట్లు సమాచారం. అతడు కూడా ఆల్ రౌండరే.

పేస్ బౌలింగ్ భారాన్ని తొలి టెస్టులో కెప్టెన్ గా ఉండనున్న బుమ్రాతోపాటు సిరాజ్, ఆకాశ్ దీప్ మోయనున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా లైన్లో ఉన్నా.. సీనియర్ బౌలింగ్ అటాక్ తో బరిలోకి దిగాలని టీమ్ భావిస్తోంది.

టీమిండియా తుది జట్టు ఇదేనా

కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, ధృవ్ జురెల్, నితీష్ రెడ్డి, అశ్విన్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్

Whats_app_banner