IND vs ENG 5th Test: వందో టెస్ట్‌లో అశ్విన్ అరుదైన ఘనత - 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ రికార్డ్ ఒక్కడిదే!
IND vs ENG 5th Test: టీమిండియా స్పిన్నర్ అశ్విన్ తన వందో టెస్ట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ ఘనతను సాధించిన ఫస్ట్ ప్లేయర్‌గా నిలిచాడు.
IND vs ENG 5th Test: ఐదో టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమి బాటలో పయనిస్తోంది. 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ అశ్విన్ దెబ్బకు ఫస్ట్ సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ స్పిన్ దెబ్బకు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు క్యూ కట్టారు. వందో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసిన అశ్విన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు.
రెండో ఓవర్ లోనే
రెండో ఇన్నింగ్స్ ఆరంభమైన కొద్ది సేపటికే డకెట్‌ను బోల్డ్ చేసి ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు అశ్విన్. తొలి ఓవర్‌లోనే వికెట్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకోవడానికి తంటాలు పడిన మరో ఓపెనర్ క్రాలీ పదహారు బాల్స్ ఎదుర్కొని పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. ఓలీపోప్ కూడా 16 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. అతడి వికెట్ కూడా అశ్విన్‌కే దక్కింది.
బెయిర్ స్టో దూకుడు...
అశ్విన్‌తో పాటు వందో టెస్ట్ ఆడుతోన్న ఇంగ్లండ్ కీపర్ బెయిర్ స్టో వచ్చి రావడంతోనే టీమిండియా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మూడు సిక్సర్లు కొట్టి దూకుడు మీద కనిపించాడు. రూట్‌తో కలిసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను బెయిర్ స్టో చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ బెయిర్ స్టో జోరు కుల్దీప్ కళ్లెం వేశాడు. అతడిని ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.
31 బాల్స్‌లో మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు బెయిర్ స్టో. అక్కడి నుంచి ఇంగ్లండ్ వికెట్ల పతనం మొదలైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు వికెట్ కీపర్ ఫోక్స్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది. ఇంకా 140 పరుగుల వెనుకంజలో ఉంది. రూట్ (36 రన్స్)తో పాటు హర్ట్‌లీ క్రీజులో ఉన్నారు. అశ్విన్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.
అశ్విన్ రికార్డు...
వందో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు. అంతే కాకుండా అరంగేట్రం చేసిన తొలి టెస్ట్‌తో పాటు వందో టెస్ట్‌లో ఐదు వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్‌గా అశ్విన్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు సాధించిన ఏకైక ప్లేయర్ అశ్విన్ కావడం గమనార్హం. టెస్ట్ కెరీర్‌లో ఐదు వికెట్లు తీసుకోవడం ఇది 36వ సారి. టెస్టుల్లో అత్యధిక సార్లు ఐదు వికెట్లు తీసుకున్న తొలి ఇండియన్ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. కుంబ్లే రికార్డును తిరగరాశాడు. కుంబ్లే తన టెస్ట్ కెరీర్‌లో 35 సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు.
రోహిత్, శభ్‌మన్ గిల్ జోరు...
అంతకుముందు టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌటైంది. 473 పరుగులతో మూడో రోజు మొదలుపెట్టిన టీమిండియా చివరి రెండు వికెట్లను నాలుగు పరుగులు తేడాతో కోల్పోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా...ఇంగ్లండ్‌పై 259 పరుగులు ఆధిక్యం సొంతం చేసుకున్నది. ఫస్ట్ ఇన్నింగ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీలు చేశారు.
సర్ఫరాజ్ ఖాన్, దేవ్‌దత్ పడిక్కల్‌తో పాటు యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌తో ఇంగ్లండ్ సీనియర్ పేసర్ అండర్సన్ ఏడు వందల వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
టాపిక్