T20 World Cup Tickets: వారికి ప్రపంచకప్ మ్యాచ్‍ల టికెట్లు ఉచితం.. ప్రారంభ ధర కూడా తక్కువే..
T20 Women’s World Cup Tickets: మహిళల టీ20 ప్రపంచకప్ టికెట్ల ధరలను ఐసీసీ ప్రకటించింది. బంగ్లాలో జరగాల్సిన ఈ టోర్నీ యూఏఈకి తరలివెళ్లింది. అక్టోబర్ 3వ తేదీన ఈ టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీ టికెట్ల ప్రారంభ ధర ఎంతంటే..
మహిళల టీ20 ప్రపంచకప్ మరికొన్ని వారాల్లో షూరూ కానుంది. ఈ టోర్నీపై చాలా క్యూరియాసిటీ ఉంది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. అక్టోబర్ 3వ తేదీన ఈ మెగా టోర్నీ షురూ కానుంది. బంగ్లాదేశ్‍లో జరగాల్సిన ఈ ప్రపంచకప్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి మారింది. కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్ టికెట్ ధరలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు (సెప్టెంబర్ 11) వెల్లడించింది.
వీరికి ఉచితం
మహిళల టీ20 ప్రపంచకప్ మ్యాచ్‍లకు 18 సంవత్సరాల లోపు వారిందరికీ టికెట్లను ఉచితంగా ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. ప్రముఖ బుర్జ్ కలీఫాపై లేజర్ షో కూడా వేసింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారు టికెట్ తీసుకోవాల్సిందే.
ప్రారంభ ధర రూ.114
మహిళల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‍లకు టికెట్ల ప్రారంభ ధర 5 దిర్హామ్స్ (సుమారు రూ.114)గా ఉంది. ఆ తర్వాత వివిధ కేటగిరీల టికెట్లు ఉన్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా టికెట్ల ధరలను ఉంచామని ఐసీసీ వెల్లడించింది.
బంగ్లా నుంచి యూఏఈకి..
ఈ ఏడాది మహిళల టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్‍లో జరగాల్సింది. అయితే, బంగ్లాలో తీవ్రమైన ఆందోళనలు, అల్లర్లు జరగుతుండటంతో వేదిక మారింది. యూఏఈకి ఈ టోర్నీ ఛేంజ్ అయింది. యూఏఈలోని షార్జా, దుబాయ్ అంతర్జాతీయ స్టేడియాల్లో ప్రపంచకప్ మ్యాచ్‍లు జరగనున్నాయి.
బుర్జ్ కలీఫాపై లేజర్ షో
దుబాయిలోని ప్రపంచంలోనే అత్యంత పొడవైన భవనం ‘బుర్జ్ కలీఫా’పై టీ20 ప్రపంచకప్ గురించి లేజర్ షో నిర్వహించింది యూఏఈ బోర్డు. ఈ టోర్నీ పాల్గొంటున్న జట్లతో పాటు వివిధ అంశాలను ఈ లేజర్ షోలో ప్రదర్శించింది. వేలాది మంది దీన్ని వీక్షించారు.
టీ20 మహిళల ప్రపంచకప్ వివరాలను ఐసీసీ సీఈవో జార్జ్ అలార్‌డైస్ వెల్లడించారు. “యూఏఈలో భిన్నత్వం ఎక్కువగా ఉంటుంది. 10 జట్లకు ఇది హోమ్ లాగే ఉంటుందని మేం అనుకుంటున్నాం. ఇక్కడి అభిమానుల మద్దతును ప్లేయర్లు ఎంజాయ్ చేయవచ్చు. అందుకే టికెట్లు కేవలం ఐదు దిర్హామ్‍లు ఉంటాయని ప్రకటిస్తున్నా. అలాగే 18 ఏళ్ల లోపు వారికి ఎంట్రీ ఉచితంగా ఉంటుంది” అని ఆయన వెల్లడించారు.
మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు సాగనుంది. మొత్తంగా 23 మ్యాచ్‍లు ఉంటాయి. ఇందులో 20 లీగ్ దశ మ్యాచ్‍లు కాగా.. రెండు సెమీఫైనల్స్, ఫైనల్ ఉంటాయి.
టీ20 ప్రపంచకప్ గ్రూప్-ఏలో ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉండగా.. గ్రూప్-బీలో బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్‍లాండ్ ఉన్నాయి. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్‍ల్యాండ్ మధ్య మ్యాచ్‍తో టోర్నీ షురూ కానుంది.
భారత షెడ్యూల్ ఇదే
టీ20 ప్రపంచకప్ లీగ్ దశలో టీమిండియా నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‍తో మ్యాచ్‍తో హర్మన్‍ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత్ పోరు మొదలుపెట్టనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‍తో టీమిండియా హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 9న శ్రీలంక, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో భారత తలపడుతుంది. గ్రూప్-ఏలో టాప్-2లో నిలిస్తే సెమీఫైనల్‍కు అర్హత సాధిస్తుంది.