Zomato New Feature : జొమాటో కొత్త ఫీచర్.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌పై డిస్కౌంట్.. సలహా ఇచ్చిన వ్యక్తికి జాబ్ ఆఫర్-zomato launched new food rescue feature to reduce food wastage cancelled order at discounted rate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Zomato New Feature : జొమాటో కొత్త ఫీచర్.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌పై డిస్కౌంట్.. సలహా ఇచ్చిన వ్యక్తికి జాబ్ ఆఫర్

Zomato New Feature : జొమాటో కొత్త ఫీచర్.. క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌పై డిస్కౌంట్.. సలహా ఇచ్చిన వ్యక్తికి జాబ్ ఆఫర్

Anand Sai HT Telugu

Zomato New Feature : ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడ్ రెస్క్యూ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వినియోగదారులు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది.

జొమాటో ఫుడ్ రెస్క్యూ ఫీచర్

ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్‌తో వచ్చింది. ఈ ఫీచర్ ప్రకారం వినియోగదారులు క్యాన్సిల్ చేసిన ఆర్డర్లను డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. జొమాటో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఈ విషయాన్ని వెల్లడించారు. 'ఇప్పుడు రద్దు చేసిన ఆర్డర్లు సమీప వినియోగదారులకు వస్తాయి. వారు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. నిమిషాల్లో వాటిని అందుకోవచ్చు.' అని చెప్పారు. అయితే మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సేవను మెరుగుపరచాలని సూచించిన వినియోగదారుడికి గోయల్ ఉద్యోగం కూడా ఇచ్చారు.

నో-రిఫండ్ విధానం ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల నెలకు 4,00,000 కంటే ఎక్కువ ఆర్డర్లను వినియోగదారులు క్యాన్సిల్ చేస్తున్నారని గోయల్ చెప్పారు. క్యాన్సిల్ చేసిన ఆర్డర్లు డెలివరీ పార్టనర్‌కు 3 కిలోమీటర్ల పరిధిలో నివసించే కస్టమర్లకు కనిపిస్తాయి. క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కొన్ని నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐస్ క్రీం, షేక్స్, స్మూతీలు, మరికొన్ని ఫుడ్ రెస్క్యూ లిస్టులో ఉండవని కూడా గోయల్ తెలిపారు.

జొమాటో ఎలాంటి ఆదాయాన్ని నిలుపుకోదని గోయల్ తన పోస్టులో పేర్కొన్నారు. కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తాన్ని ఒరిజినల్ కస్టమర్ (వారు ఆన్ లైన్ లో పేమెంట్ చేసినట్లయితే), రెస్టారెంట్ భాగస్వామితో పంచుకుంటారని తెలిపారు.

'రెస్టారెంట్ భాగస్వాములు రద్దు చేసిన ఆర్డర్‌కు పరిహారం పొందడం కొనసాగుతుంది, అలాగే ఆర్డర్ క్లెయిమ్ చేస్తే కొత్త కస్టమర్ చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని పొందుతారు.' అని గోయల్ చెప్పారు.

చాలా రెస్టారెంట్లు ఈ ఫీచర్‌ను తీసుకుంటున్నాయి. తమ కంట్రోల్ ప్యానెల్ నుండి నేరుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని సులభంగా ఆఫ్ చేయవచ్చు. డెలివరీ భాగస్వాములకు కొత్త కస్టమర్ లొకేషన్ వద్ద ప్రారంభ పికప్ నుండి ఫైనల్ డ్రాప్ ఆఫ్ వరకు మొత్తం ప్రయాణానికి పూర్తిగా పరిహారం కూడా ఇస్తారు. మీరు అందుకునే క్యాన్సిల్ చేసిన ఆర్డర్ ఫుడ్ రెస్క్యూ హోమ్ పేజీలో కనిపిస్తుంది. హోమ్ పేజీని రిఫ్రెష్ చేయాలి.

ఈ ఫీచర్ను మెరుగుపరచాలని ఒక యూజర్ సూచించగా, గోయల్ అతనితో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారు. భాను అనే యూజర్ ఈ ఫీచర్ ను మెరుగుపరచడానికి కొన్ని సూచనలు చేశాడు. యూజర్ ఇలా రాశాడు –

'క్యాష్ ఆన్ డెలివరీకి అప్లై చేయకూడదు. డెలివరీ పాయింట్ నుండి 500 మీటర్లకు డెలివరీ చేరితే, క్యాన్సిల్ అనుమతించకూడదు. ఒకేసారి ఇద్దరు వినియోగదారులు భోజనం పంచుకోవడం, ఆర్డర్ పెట్టడం, క్యాన్సిల్ చేసుకోవడంపై డిస్కౌంట్ పొందే అవకాశం. నెలకు రెండు కంటే తక్కువ క్యాన్సిలేషన్లకు అనుమతి ఇవ్వాలి.' అని యూజర్ భాను సలహా ఇచ్చారు.

దీనిపై గోయల్ స్పందిస్తూ.. 'ఇందులో కొన్ని ఇప్పటికే ఉన్నాయి. మంచి ఆలోచన. మీరు ఎవరు? ఏం చేస్తారు? నేను మీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మనం కలిసి పనిచేద్దాం.' అని చెప్పారు.