Zomato large order fleet: ఒకే సారి పెద్ద ఆర్డర్ల డెలివరీ కోసం 'లార్జ్ ఆర్డర్ ఫ్లీట్'ను ప్రవేశపెట్టిన జొమాటో..
Zomato large order fleet: వినియోగదారుల కోసం మరో సౌలభ్యాన్ని ఫుడ్ డెలివరీ యాప్ ‘జొమాటో’ అందుబాటులోకి తీసుకువచ్చింది. చిన్న చిన్న ఫంక్షన్స్ కు అవసరమయ్యేలా, ఒకేసారి 50 మందికి ఫుడ్ డెలివరీ చేయడానికి వీలుగా 'లార్జ్ ఆర్డర్ ఫ్లీట్' ను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించారు.
Zomato large order fleet: పార్టీలు, సమావేశాలు, ఈవెంట్ల కోసం పెద్ద ఆర్డర్లను మెరుగ్గా నిర్వహించడమే లక్ష్యంగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) "లార్జ్ ఆర్డర్ ఫ్లీట్" ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం "ఆల్ ఎలక్ట్రిక్ ఫ్లీట్" ను కూడా రూపొందించారు. ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ తో కనీసం 50 మందికి ఫుడ్ సప్లై చేయవచ్చు. "ఈ రోజు, భారతదేశపు మొదటి లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ఇది మీ అన్ని పెద్ద (గ్రూప్ / పార్టీ / ఈవెంట్) ఆర్డర్లను సులభంగా డెలివరీ చేస్తుంది " అని ఆయన ఎక్స్ (గతంలో ట్విట్టర్) లో రాశారు, డెలివరీల కోసం రూపొందించిన ఈవీ (electric vehicle) ఫోటోను కూడా పంచుకున్నారు.
50 మంది అతిథుల కోసం..
చిన్న చిన్న పార్టీలు, సమావేశాలు, ఈవెంట్లలో ఫుడ్ డెలివరీ చేయడం లక్ష్యంగా ఈ లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను ప్రారంభించారు. కనీసం 50 మందికి ఈ ఫ్లీట్ ద్వారా ఒకేసారి భోజనం సప్లై చేయవచ్చు. ఇంతకుముందు, జొమాటో (Zomato) బహుళ డెలివరీ ఏజెంట్ల ద్వారా పెద్ద ఆర్డర్లకు ఫుడ్ ను సప్లై చేసేంది. అలా కాకుండా, ఒకేసారి, ఒకే డెలివరీలో ఆర్డర్ చేసిన మొత్తం ఫుడ్ ను అందించడం కోసం లార్జ్ ఆర్డర్ ఫ్లీట్ ను స్టార్ట్ చేశారు. అయితే, ఈ కొత్త ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. డెలివరీ కోసం ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల్లో ఫుడ్ ఫ్రెష్ గా ఉండడం కోసం ఉష్ణోగ్రత నియంత్రణతో కూలింగ్ కంపార్ట్మెంట్ లు, హాట్ బాక్స్ లు వంటి మరిన్ని ఫీచర్లను జోడించే పనిలో జొమాటో ఉందని జొమాటో సీఈఓ దీపిందర్ (Zomato CEO Deepinder Goyal) తెలిపారు.
ప్యూర్ వెజ్ ఫ్లీట్
శాకాహార రెస్టారెంట్ల నుంచి మాత్రమే ఆర్డర్లు డెలివరీ చేయడానికి 'ప్యూర్ వెజ్ ఫ్లీట్'ను దీపిందర్ గోయల్ గత నెలలో ప్రవేశపెట్టారు. కానీ, ఇందుకోసం ప్రత్యేక గ్రీన్ యూనీఫామ్, గ్రీన్ బాక్స్ లను ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో, 24 గంటల్లోనే ప్రత్యేక గ్రీన్ యూనిఫామ్ లేదా గ్రీన్ బాక్సుల ప్రణాళికలను జొమాటో వెనక్కి తీసుకుంది.