Xiaomi’s electric car: ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలోకి షావోమీ కంపెనీ; త్వరలో మొడెనా పేరుతో ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్
Xiaomi’s electric car: చైనా కంపెనీ షావోమీ (Xiaomi) అనగానే వివిధ బ్రాండ్స్ తో వివిధ మోడల్స్ స్మార్ట్ ఫోన్స్ ను ఉత్పత్తి చేసే సంస్థగానే గుర్తొస్తుంది. కానీ, చైనాలో ఆ కంపెనీ బహుముఖ వ్యాపార, వాణిజ్యాలను నిర్వహిస్తుంటుంది.
Xiaomi’s electric car: చైనా కంపెనీ షావోమీ (Xiaomi) ఇక ఎలక్ట్రిక్ కార్లను కూడా ఉత్పత్తి చేయనుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఈ సంవత్సరం చివర్లో మార్కెట్లోకి రానుంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి ఈ సంస్థకు చైనా ప్రభుత్వం నుంచి ఇటీవలనే అనుమతి వచ్చింది.
పేరు మొడెనా
తాము ఉత్పత్తి చేస్తున్న తొలి ఎలక్ట్రిక్ కార్ పేరును మొడెనా (Xiaomi Modena) గా షావోమీ నిర్ణయించింది. కోడ్ నేమ్ ఎంఎస్ 11 (MS11) అని పెట్టింది. ప్రయోగాత్మక ఉత్పత్తి బీజింగ్ లోని తమ ప్లాంట్ నుంచి గత నెలలో ప్రారంభించింది. మొదట వారానికి 50 Xiaomi Modena కార్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.
రెండేళ్ల క్రితమే..
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలోకి ప్రవేశిస్తున్నట్లు షావోమీ రెండేళ్ల క్రితమే ప్రకటించింది. అంతకుముందు నుంచే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. షావోమీ రూపొందించిన ఎలక్ట్రిక్ కార్ మోడల్ ఫొటోలు ఈ జనవరిలో సోషల్ మీడియాలో సందడి చేశాయి. మార్కెట్లోకి వచ్చిన తరువాత ఈ షావోమీ మొడెనా ఎలక్ట్రిక్ కారు టెస్లా మోడల్ 3, బీవైడీ సీల్ తదితర ఎలక్ట్రిక్ కారు మోడల్స్ తో పోటీ పడనుంది. చైనాలో ఈ ఎలక్ట్రిక్ కారు ధర 2,00,000 యువాన్స్ గా ఉండనుంది. అంటే, సుమారుగా 27,400 డాలర్లు. కారు డిజైన్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ఈ కారు డిజైన్ లో పెద్దవైన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, సింపుల్ ఫ్రంట్ బంపర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పానొరమిక్ గ్లాస్ రూఫ్ మొదలైనవి ఉన్నాయి.
బ్యాటరీ..
ఈ షావోమీ మొడెనా ఎలక్ట్రిక్ కారు లో 800 ఓల్ట్ ల ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్ తో 101 కిలోవాట్ టెర్నరీ బ్యాటరీ ని అమర్చనున్నట్లు సమాచారం. ఒకసారి ఫుల్ గా చార్జ్ చేస్తే గరిష్టంగా ఇది 800 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి కోసం షావోమీ సంస్థ 3 బిలియన్ల యువాన్ లను పెట్టుబడి పెట్టింది.