Xiaomi 1st electric vehicle: త్వరలో మార్కెట్లోకి షావోమీ నుంచి తొలి ఎలక్ట్రిక్ కారు; ధర కూడా అందుబాటులోనే..
Xiaomi 1st electric vehicle: ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన షావోమీ, తమ ఉత్పత్తుల జాబితాలోకి టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్స్ తో పాటు కొత్తగా ఎలక్ట్రిక్ కార్లను కూడా చేర్చింది.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహన డెలివరీలను మార్చి చివరి నాటికి ప్రారంభించనుంది. ఈ విషయాన్ని షావోమీ (Xiaomi) మంగళవారం వెల్లడించింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన షావోమీ, తమ ఉత్పత్తుల జాబితాలోకి టాబ్లెట్స్, స్మార్ట్ వాచ్ లు, హెడ్ ఫోన్స్ తో పాటు కొత్తగా ఎలక్ట్రిక్ కార్లను కూడా చేర్చింది
మార్చి 28వ తేదీన షావోమీ ‘ఎస్ యూ 7’
చైనాలోని బీజింగ్ కు చెందిన షావోమీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి తన ప్రవేశాన్ని 2021 లో ప్రకటించింది. నాటి నుంచి మార్కెట్లోకి వినియోగదారులకు అత్యంత అనుకూలమైన ఎలక్ట్రిక్ కారు ను అందుబాటు ధరలో అందించాలని ప్రయత్నిస్తోంది. షావోమీ (Xiaomi) నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ‘ఎస్ యూ 7 (SU7)’ను మార్చి 28న అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ చైనీస్ సోషల్ మీడియా సైట్ వీబోలో మంగళవారం వెల్లడించారు. ఈ ఎలక్ట్రిక్ కారు ‘ఎస్ యూ 7’ను గత సంవత్సరం డిసెంబర్ లో తొలిసారిగా మీడియాకు చూపించారు. ఈ ప్రకటనతో మంగళవారం మధ్యాహ్నానికల్లా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో షావోమీ కంపెనీ షేర్లు దాదాపు 10 శాతం పెరిగాయి.
బ్యాటరీ ప్యాక్ వివరాలు..
ఈ షావోమీ (Xiaomi) ఎలక్ట్రిక్ కారు లోని బ్యాటరీలు 800 కిలోమీటర్ల (500 మైళ్ళు) డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంటాయి. చైనా అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బివైడి, దేశీయ బ్యాటరీ దిగ్గజం సీఏటీఎల్ ఈ కార్లకు బ్యాటరీ ప్యాక్ లను సరఫరా చేస్తున్నాయి. ‘‘15 నుండి 20 సంవత్సరాల కృషితో ప్రపంచంలోని టాప్ 5 ఆటోమోటివ్ తయారీదారులలో ఒకరిగా ఎదగడమే లక్ష్యం’’ అని లీ డిసెంబర్ లో చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మార్కెట్ అయిన చైనాలోని అనేక అగ్రశ్రేణి టెక్ సంస్థలు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెట్టాయి.