WhatsApp new feature: ఒకే ఫోన్ లో, ఒకే నంబర్ తో రెండు వాట్సాప్ ప్రొఫైల్స్.. త్వరలో..
WhatsApp new feature: ఎప్పటికప్పుడు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్ పై ప్రయోగాలు చేస్తోంది. త్వరలో, ఒకే ఫోన్ లో, ఒకే నంబర్ తో రెండు వాట్సాప్ ప్రొఫైల్స్ ను నిర్వహించే సౌకర్యాన్ని అందించనుంది.
WhatsApp new feature: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ లేటెస్ట్ గా మరో మోస్ట్ యూజ్ ఫుల్ ఫీచర్ పై కసరత్తు చేస్తోంది. ఒకే ఫోన్ లో, ఒకే నంబర్ తో రెండు వాట్సాప్ ప్రొఫైల్స్ ను మేనేజ్ చేసే ఫీచర్ ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే, ఒకే నంబర్ తో అటు వ్యక్తిగత ప్రొఫైల్ ను, ఇటు ప్రొఫెషనల్ ప్రొఫైల్ ను మెయింటైన్ చేయవచ్చు.
వరుస అప్ డేట్స్..
ఇటీవల వాట్సాప్ (WhatsApp) పలు ఉపయోగకర అప్ డేట్స్ ను తీసుకువచ్చింది. అందులో ఒకటి హెచ్ డీ క్వాలిటీలో ఫొటోలు, వీడియోలను వాట్సాప్ లో షేర్ చేసుకునే అవకాశం కల్పించడం. అలాగే, వాట్సాప్ అకౌంట్ ను ఒకటికి మించిన డివైజెస్ లో లింక్ చేసుకునే సదుపాయాన్ని కూడా ఇటీవల కల్పించింది. మరోవైపు, వాట్సాప్ యాప్ లోకి ఈజీగా లాగిన్ కావడానికి వీలుగా 2 ఫాక్టర్ ఆథెంటికేషన్ స్థానంలో పాస్ కీ (passkey) విధానాన్ని ప్రారంభించింది. ఇవన్నీ యూజర్ మరింత సులువుగా వాట్సాప్ ను వినియోగించుకునేలా ఉన్నాయి.
Alternate profiles: ప్రత్యామ్నాయ ప్రొఫైల్ అంటే..?
తాజాగా, ఒకే డివైజ్ పై, ఒకే నంబర్ తో రెండు ప్రొఫైల్స్ ను నిర్వహించే ఫీచర్ ను త్వరలో తీసుకురానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. ఈ ఆల్టర్నేటివ్ ప్రొఫైల్ వల్ల యూజర్ ఒకే డివైజ్ పై, ఒకే నంబర్ తో వ్యక్తిగత, వృత్తిగత కమ్యూనికేషన్ ను వేరువేరుగా కొనసాగించవచ్చు. ఈ ఆల్టర్నేటివ్ ప్రొఫైల్స్ కు యూజర్ రెండు వేర్వేరు ప్రొఫైల్ ఫొటోలు పెట్టుకోవచ్చు. రెండు ప్రొఫైల్స్ కు రెండు వేర్వేరు పేర్లు కూడా పెట్టుకోవచ్చు. ప్రైమరీ ప్రొఫైల్ ను చూడలేని వారు మాత్రమే ఆల్టర్నేట్ ప్రొఫైల్ ను చూసేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. అంటే, మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేనివారు మీ ప్రైమరీ ప్రొఫైల్ ఫొటోను చూడలేరు కానీ.. మీ ఆల్టర్నేట్ ప్రొఫైల్ ఫొటోను చూడగలరు. ఆ ప్రొఫైల్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయగలరు.
ప్రయోగ దశలో..
ప్రస్తుతం ఈ ఫీచర్ ను వాట్సాప్ ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోందని వాట్సాప్ అంతర్గత వివరాలను వెల్లడించే ‘‘వాబీటాఇన్ఫో (WABetaInfo)’’ వెల్లడించింది. ప్రయోగదశ పూర్తయిన తరువాత, క్రమంగా వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తుందని తెలిపింది. అయితే, వాట్సాప్ రెగ్యులర్ చాలా ఫీచర్స్ ను పరీక్షిస్తుంటుందని, అలా అని, ఆ ఫీచర్స్ అన్నింటినీ యూజర్ కు అందుబాటులోకి తీసుకువస్తుందని భావించలేమని స్పష్టం చేసింది.
టాపిక్