WhatsApp: వాట్సాప్ లో రెగ్యులర్ గా గ్రూప్ కాల్స్ చేస్తారా? ఈ ఫీచర్ చాలా యూజ్ ఫుల్
గ్రూప్ కాల్స్ లో చేరడాన్ని సులభతరం చేసే కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెడుతోంది. వాట్సాప్ యూజర్లు నేరుగా గ్రూప్ చాట్లలో కాల్ లింక్ లను క్రియేట్ చేసి సభ్యులకు షేర్ చేసుకోవచ్చు. అలాగే, త్వరలో వాట్సాప్ వినియోగదారులకు మెటా ఏఐ వాయిస్ ఫీచర్ కూడా అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ యాప్ లో గ్రూప్ కాల్స్ జాయినింగ్ ప్రక్రియను సులభతరం చేసే లక్ష్యంతో వాట్సాప్ కొత్త ఫీచర్ ను తీసుకువచ్చింది. వాట్సాప్ యాప్ లోని కాల్ ట్యాబ్ నుండి ఒకే ట్యాప్ తో వాయిస్ లేదా వీడియో కాల్స్ ప్రారంభించడానికి వినియోగదారులను ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ను గ్రూప్ చాట్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు.
వాట్సప్ కొత్త ఫీచర్ వివరాలు
వాట్సాప్ యూజర్లకు త్వరలో ఫోటోలు లేదా డాక్యుమెంట్లు వంటి ఇతర అటాచ్ మెంట్ ఆప్షన్స్ తో పాటు కాల్ లింక్ జనరేట్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానున్నట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో వెల్లడించింది. ఈ ఫీచర్ వినియోగదారుల సౌలభ్యాన్ని పెంచడానికి వాట్సాప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. కొత్త కాల్ లింక్ ఫీచర్ ద్వారా యూజర్లు గ్రూప్ సభ్యులందరికీ ఆటోమేటిక్ గా రింగ్ కాకుండానే కాల్ స్టార్ట్ చేయవచ్చు. బదులుగా, పాల్గొనేవారు.. తమ సౌలభ్యం మేరకు ఆ కాల్ లో చేరవచ్చు.
లార్జర్ గ్రూప్స్ కు ఉపయోగకరం
ఇది వాట్సాప్ (whatsapp) గ్రూప్ కాల్స్ ను మరింత సరళంగా, యూజర్ ఫ్రెండ్లీగా చేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం, గ్రూప్ కాల్ ప్రారంభమైన తరువాత, ప్రతి గ్రూపు సభ్యుడికి రింగ్ అవుతుంది. ఆ సభ్యుడు నచ్చితే జాయిన్ కావచ్చు. ఇకపై ఆ విధానం మారుతుంది. కాల్ లింక్ విధానం ద్వారా వినియోగదారులు నేరుగా గ్రూప్ సంభాషణలలో లింక్ లను జనరేట్ చేయవచ్చు. దీనితో గ్రూప్ సభ్యులు సాధారణ ట్యాప్ తో కాల్ లో చేరవచ్చు. ఈ ఫీచర్ పెద్ద, అంతర్జాతీయ సమూహాలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. ఇది వేర్వేరు టైమ్ జోన్లలో కాల్స్ ను సమన్వయం చేయడం సులభం చేస్తుంది. ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది.
మెటా ఏఐ వాయిస్ మోడ్
కాల్ లింక్ అప్ డేట్ తో పాటు, వాట్సాప్ తన చాట్ ఇంటర్ ఫేస్ లో మెటా ఏఐని ఇంటిగ్రేట్ చేసే పనిలో ఉంది. కొత్త వాయిస్ మోడ్ ఫీచర్ వినియోగదారులు రియల్ టైమ్ వాయిస్ కమాండ్ లను ఉపయోగించి మెటా ఏఐతో ఇంటరాక్ట్ కావడానికి వీలు కల్పిస్తుంది. సందేశాలను టైప్ చేయడానికి బదులుగా, వినియోగదారులు మెటా ఏఐతో నేరుగా మాట్లాడగలుగుతారు. ఇది వినియోగదారు ఎంచుకున్న వాయిస్ ను ఉపయోగించి స్పందిస్తుంది. యూజర్లు తమ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంచుకునే వివిధ వాయిస్ ఆప్షన్ లను అందించడం ద్వారా పర్సనలైజేషన్ ను పెంచడమే ఈ ఫీచర్ లక్ష్యం.