Weddings In India : రెండు నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు!-wedding season begins in india 48 lakhs weddings expected may generate 6 lakh crore in business ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Weddings In India : రెండు నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు!

Weddings In India : రెండు నెలల్లో 48 లక్షల పెళ్లిళ్లు.. 6 లక్షల కోట్ల ఆర్థిక కార్యకలాపాలు!

Anand Sai HT Telugu
Nov 06, 2024 10:39 AM IST

Weddings In India : భారతదేశంలో పెళ్లిళ్లను ఎంత ఘనంగా చేస్తారో అందరికి తెలిసిందే. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. సుమారు 48 లక్షల వివాహాలు జరగనుండగా లక్షల కోట్ల ఆర్థిక లావాదేవీలు కానున్నాయి.

భారత్‌లో 48 లక్షల పెళ్లిళ్లు
భారత్‌లో 48 లక్షల పెళ్లిళ్లు

పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. భారతదేశంలో వివాహాలను పెద్ద పండుగలా నిర్వహిస్తారు. పెళ్లి అంటే చాలా ఖర్చు కూడా ఉంటుంది. పెళ్లి వేడుకను నిర్వహించడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతో బలం చేకూరుతుందని చెప్పవచ్చు. ఇది ఒకదానికొకటి అనుసంధానించబడి ఉంటుంది. ఒక చైన్ సిస్టమ్‌లా పని చేస్తుంది. క్యాటరింగ్ సేవలు, కూరగాయలు, ధాన్యాలు, మాంసం, పాలు, బట్టలు..ఇలా అనేక రకాల పనులు ఇందులో ముడిపడి ఉంటాయి.

వ్యాపారులకు కూడా ఆర్థికంగా తోడ్పడుతుంది. వచ్చే రెండు నెలలకు భారత్‌లో దాదాపు 48 లక్షల వివాహాలు జరగనున్నాయి. వాటి ద్వారా రూ.6 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా ఇది. భారత్‌లో పెళ్లిళ్ల సీజన్‌ సమీపిస్తున్న కొద్దీ వ్యాపారులు బిజీబిజీగా మారడం కనిపిస్తుంది. ఈ నవంబర్, డిసెంబర్‌లలో దేశవ్యాప్తంగా 48 లక్షల వివాహాలు జరుగుతాయని సీఏటీ చెబుతోంది.

అయితే ఎవరూ ఊహించనంతగా.. 6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరగడం ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఉంటుంది. ముఖ్యంగా 48 లక్షల వివాహాల్లో ఢిల్లీలోనే 4.5 లక్షల వివాహాలు జరగనున్నాయి. ఢిల్లీలో పెళ్లిళ్లు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీని ద్వారా ఢిల్లీ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు 1.5 లక్షల కోట్లు అనుసంధానం కానున్నాయి.

నవంబర్ 12, 2024న పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అవుతుంది. వస్తువులు, సేవలు రెండింటినీ కలిపి రిటైల్ రంగం పండుగ సీజన్‌లో మొత్తం రూ.5.9 లక్షల కోట్లు సాధించింది. ఇప్పుడు టర్నోవర్‌ను పెరిగే అవకాశం ఉంది.

ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే ధంతేరాస్ సందర్భంగా వివాహ సంబంధిత బంగారం కొనుగోళ్లు పెరిగాయని సెంకో గోల్డ్ ఎండీ అండ్ సీఈవో సువాన్‌కర్ సేన్ చెప్పారు. ఆయన ప్రకారం చాలా మంది కస్టమర్‌లు నవంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు బిజీ వెడ్డింగ్ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. దీంతో దుకాణాల్లో రద్దీ పెరిగి పెళ్లిళ్ల సీజన్‌ షాపింగ్‌ మొదలైంది.

వివాహ సమయంలో బట్టలు, వెండి, బంగారం, వజ్రాల కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి భారీ మొత్తంలో వస్త్రాల కొనుగోళ్లు ఉంటాయి. వివాహంలో ఆహారం కూడా ముఖ్యమైన భాగం. దీనితో ఈ రంగంలోనూ భారీగా డబ్బును ఖర్చు చేస్తారు. అంతే కాకుండా వాహన కొనుగోలు సహా పలు వస్తువుల కొనుగోళ్లు జరుగుతాయి. భారత్‌లో పెళ్లిళ్లు పెద్ద పండుగల చేస్తారు.. దీంతో లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతాయి.

Whats_app_banner