US Fed Rate Hike: మరోసారి వడ్డీ రేటును పెంచిన అమెరికా ఫెడ్: స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎలా?-us fed raises interest rates by 25 basis points despite banking crisis ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Us Fed Rate Hike: మరోసారి వడ్డీ రేటును పెంచిన అమెరికా ఫెడ్: స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎలా?

US Fed Rate Hike: మరోసారి వడ్డీ రేటును పెంచిన అమెరికా ఫెడ్: స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎలా?

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 23, 2023 07:29 AM IST

US Fed Interest Rate Hike: వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు పెంచింది యూఎస్ ఫెడ్. ద్రవ్యోల్బణం దిగివచ్చేందుకు భవిష్యత్తులోనే పెంపు ఉంటుందనేలా కామెంట్ చేసింది.

US Fed Rate Hike: కీలక వడ్డీ రేటును పెంచిన అమెరికా ఫెడ్
US Fed Rate Hike: కీలక వడ్డీ రేటును పెంచిన అమెరికా ఫెడ్ (bloomberg)

US Fed Rate Hike: అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) వడ్డీ రేటును మరోసారి పెంచింది. రెండు రోజుల సమావేశం అనంతరం ఫెడ్ కమిటీ నిర్ణయాలను ప్రకటించింది. వడ్డీ రేటును మరో 25 బేసిస్ పాయింట్లు అంటే 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ వడ్డీ రేటు 4.75 శాతం నుంచి 5 శాతం రేంజ్‍కు చేరింది. ఫెడ్ వడ్డీ రేటును అధికం చేయడం వరుసగా ఇది తొమ్మిదోసారి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB), సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలి బ్యాంకింగ్ రంగం సంక్షోభం (US Banking Crisis)లో ఉన్నా వడ్డీ రేటు పెంపునకే యూఎస్ ఫెడ్ మొగ్గుచూపింది. అలాగే భవిష్యత్తులోనూ వడ్డీ రేటు పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. దీంతో షార్ట్ టర్మ్‌లో ఇది స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఫెడ్ ప్రకటన తర్వాత అమెరికన్ మార్కెట్లు బుధవారం సెషన్‍ను నష్టాలతో ముగించాయి. యూఎస్ ఫెడ్ అంచనా మేరకే వడ్డీ రేటును పెంచినా.. ఈ ఏడాది తగ్గింపు ఉండదనే సంకేతాలు స్టాక్ మార్కెట్లను కాస్త నిరాశ పరిచాయి. కీలక విషయాలివే.

మరింత పెంచుతాం!

US Fed Interest Rate Hike: ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు వడ్డీ రేటును మరింత పెంచుతామని యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ (Jerome Powell) మరోసారి చెప్పారు. అమెరికాలో బ్యాంకింగ్ రంగం పటిష్టంగానే ఉందని అన్నారు. అమెరికాలో జాబ్స్ డేటా బలంగా ఉండడం, ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటమే వడ్డీ రేటు పెంపునకు కారణమనేలా పావెల్ చెప్పారు.

ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తెచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని యూఎస్ ఫెడ్ కమిటీ నిర్ణయించింది. రానున్న కాలంలోనూ వడ్డీ రేటు పెంపు ఉంటుందనే సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది చివరి వరకు కూడా వడ్డీ రేటు పెరుగుతుందనే అంచనాలు ఏర్పడ్డాయి.

స్టాక్ మార్కెట్లపై ప్రభావం ఎలా..

US Fed Interest Rate Hike: బ్యాంకింగ్ సంక్షోభం ఉన్నా వడ్డీ రేటును అధికం చేయడం, భవిష్యత్తులోనూ పెంపు ఉంటుందనే సంకేతాలు యూఎస్ ఫెడ్ ఇవ్వటంతో స్టాక్ మార్కెట్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని పావెల్ మరోసారి స్పష్టంగా చెప్పారు. దీంతో వృద్ధిపై కూడా అంచనాలు తగ్గిపోయాయి.

యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం అమెరికాతో పాటు ఇండియా సహా అన్ని దేశాల మార్కెట్లపై పడుతుంది. యూఎస్ ఫెడ్ వడ్డీ రేటు పెంచితే భారత మార్కెట్లపై కూడా ప్రభావం ఉంటుంది. విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. అమెరికా బాండ్లపై కూడా వడ్డీ అధికమవుతుంది. దీంతో కొందరు విదేశీ మదుపరులు స్టాక్ మార్కెట్‍లోని నిధులను ఉపసంహరించుకొని.. బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఫెడ్ 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచటంతో భారత మార్కెట్లపై మరీ అంత ప్రభావం ఉండకపోవచ్చని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

Whats_app_banner