Saving Schemes : ఈ ఐదు పెట్టుబడి పథకాలపై ఓ లుక్కేయండి.. చాలా అంటే చాలా ప్రయోజనాలు
Savings Schemes : ఇటీవల కాలంలో పెట్టుబడి పెట్టే అలవాటు ఎక్కువైంది. అయితే మీరు ఎంచుకునే పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. భవిష్యత్తులో వచ్చే రిటర్న్స్ గురించి కూడా అంచనా వేయాలి.
స్థిర ఆదాయాలు ఉన్న చాలా మంది డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో ఆలోచనల్లో పడతారు. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద ఎంపిక చేసిన రూ.1,50,000 వరకు ఉన్న పెట్టుబడులపై ప్రభుత్వం ఇప్పటికీ ఆదాయపు పన్ను మినహాయింపును అందిస్తుంది. రెగ్యులర్ జీతభత్యాల కోసం ఆదాయపు పన్నును ఆదా చేయడానికి ఇది బెటర్ ఆప్షన్. పెట్టుబడుల ద్వారా మంచి రాబడిని ఆర్జించే, ఆదాయపు పన్నును ఆదా చేసే కొన్ని పొదుపు పథకాల గురించి తెలుసుకుందాం.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ద్వారా నిర్వహించేబడే చిన్న పథకం. ఈ పథకం 5 సంవత్సరాల పెట్టుబడి వ్యవధితో కనీస పెట్టుబడి పరిమితి రూ. 1,000. గరిష్ట పరిమితి లేదు. 7.7శాతం వడ్డీతో పథకంలో పెట్టుబడి పెట్టిన ప్రతి రూ. 1,000 5 సంవత్సరాల ముగింపులో రూ.1,449 అవుతుంది.
కిసాన్ వికాస్ పాత్ర
భారతీయ పోస్టల్ శాఖ నిర్వహించే ఈ చిన్న పొదుపు పథకం కొన్ని ఇతర పథకాల కంటే ఎక్కువ వడ్డీని ఇస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలలలో మెచ్యూర్ అవుతుంది. కనీస డిపాజిట్ పరిమితి రూ.1000. ఈ పథకం ప్రస్తుతం 7.4 శాతం వడ్డీని చెల్లిస్తున్నందున, ఇది 9 సంవత్సరాల 7 నెలల్లో పెట్టుబడి మొత్తంపై రెట్టింపు రాబడిని ఇస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఇది తపాలా శాఖ పరిధిలో అత్యంత ప్రజాదరణ పొందిన పథకం. గరిష్ట పెట్టుబడి పరిమితి సంవత్సరానికి రూ. 1,50,000. ఖాతాను నిర్వహించడానికి ప్రతి సంవత్సరం కనీసం రూ.500 డిపాజిట్ చేయాలి. లేదంటే పెట్టుబడి పెట్టని ప్రతి ఏడాదికి రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీని వడ్డీ రేటు 7.1 శాతం. ఖాతా 15 సంవత్సరాలలో మెచ్యూర్ అయినప్పటికీ, ఖాతాను 5 సంవత్సరాల బ్లాక్‌లలో అనేక సార్లు పొడిగించవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్
రిటైర్డ్ ఉద్యోగుల కోసం ఈ పథకం ప్రస్తుతం అత్యధిక వడ్డీని పొందుతోంది. ప్రస్తుత వడ్డీ రేటు 8.2 శాతం. ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో కనీసం రూ. 1000, గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీనిపై వడ్డీని ప్రతి త్రైమాసికంలో లెక్కించి పెట్టుబడిదారుడికి చెల్లిస్తారు. ఖాతా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది.
సుకన్య సమృద్ధి యోజన
ఈ పథకం 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కుమార్తెలు ఉన్న భారతీయ పౌరుల కోసం. సుకన్య సమృద్ధి యోజన కింద, గరిష్టంగా ఇద్దరు కుమార్తెలకు (రెండో బిడ్డ పుట్టినప్పుడు కవల కుమార్తెల విషయంలో ముగ్గురు కుమార్తెలు) ఖాతాలను తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.1,50,000 డిపాజిట్ చేయవచ్చు. అలాగే ప్రతి సంవత్సరం కనీసం రూ.250 ఖాతాలో జమ చేయాలి. వడ్డీ రేటు 8.2 శాతం. వడ్డీపై ఆదాయపు పన్ను ఉండదు. మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది.