AP Govt Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్-ap govt employee transfers stalled ceo vivek yadav orders on mlc elections process ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్

AP Govt Employees Transfers : ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్

HT Telugu Desk HT Telugu

AP Govt Employees Transfers : ఉపాధ్యాయ, పట్టుభద్రుల ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 29 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 వరకు ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. అక్టోబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీలో ఉద్యోగుల బదిలీలపై సీఈవో నిషేధం, అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 నో ట్రాన్స్ ఫర్స్

రాష్ట్రంలో ఉద్యోగుల బ‌దిలీల‌పై నిషేధం పడింది. 2024 అక్టోబ‌ర్ 29 నుంచి 2025 జ‌న‌వ‌రి 6 వరకు ఉద్యోగులను బ‌దిలీ చేయొద్దని రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా క‌లెక్టర్ నుంచి గ్రామ వీఆర్ఏ వ‌ర‌కు బ‌దిలీలపై నిషేధం విధించారు. జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అడిషన‌ల్‌ మునిసిపల్ కమీషనర్లు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్ఓలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ & వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులు, బూత్ లెవల్ అధికారులుగా నియమితులైన ఇతర అధికారులు బ‌దిలీల‌పై నిషేధం విధించారు.

ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్రక్రియ‌లో భాగ‌స్వాములైన డిస్ట్రిక్ ఎల‌క్షన్ ఆఫీస‌ర్లు, డిప్యూటీ డిస్ట్రిక్ ఎల‌క్షన్ ఆఫీస‌ర్లు, ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ అధికారులు, అసిస్టెంట్ ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ అధికారులు, సూప‌ర్ వైజ‌ర్లు, బూత్‌స్థాయి అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న ఉద్యోగుల బ‌దిలీల‌పై నిషేధం విధించారు. ఆయా పోస్టుల్లో ఉన్నవారిని 2024 అక్టోబ‌ర్ 29 నుంచి 2025 జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు త‌మ ముంద‌స్తు అనుమ‌తి లేకుండా బ‌దిలీ చేయ‌డానికి వీల్లేద‌ని స్పష్టం చేశారు. ఆయా బాధ్యత‌లు నిర్వహించాల్సిన అధికారులు, ఉద్యోగుల పోస్టులు ఎక్కడైనా ఖాళీగా ఉంటే, వాటిని వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని ఆదేశించింది. అక్టోబ‌ర్ 10 నాటికి ప్రక్రియ పూర్తి చేయాల‌ని నిర్దేశించారు.

"కేంద్ర ఎన్నికల సంఘం ఫోటో ఎలక్టోరల్ రోల్స్ ప్రత్యేక స‌మ‌గ్ర సవరణ కోసం షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్రక్రియ 2025 జ‌న‌వ‌రి 1 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితాల ముసాయిదా 2024 అక్టోబ‌ర్ 29న ప్రచురణ జ‌రుగుతుంది. దానికి సంబంధించిన‌ తుది జాబితా 2025 జ‌న‌వ‌రి 6న ప్రచుర‌ణ చేస్తారు" అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి అక్టోబ‌ర్ 29 నుంచి జ‌న‌వ‌రి 6 వ‌ర‌కు అధికారులు, ఉద్యోగులు ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌పై ప‌ని చేయాల్సి ఉంటుంది. ఆ అధికారులు, ఉద్యోగులు ఈ కాలంలో ఎన్నిక‌ల సంఘం నియంత్రణ‌, ప‌ర్యవేక్షణ‌లో ఉండాల్సి ఉంటుంది. క‌నుక ఆయా అధికారుల‌ను బ‌దిలీ చేయొద్దని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది.

ఒక‌వేళ ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ అధికారి (ఈఆర్ఓ), డిస్ట్రిక్ ఎల‌క్షన్ ఆఫీస‌ర్ (డీఈఓ)లు మొద‌లైన ఏ అధికారినైనా బ‌దిలీ చేయ‌డం త‌ప్పనిస‌రి అయితే, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్రధాన అధికారిని రాష్ట్ర ప్ర‌భుత్వం సంప్ర‌దించాల్సి ఉంటుంద‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ పేర్కొంది. అసిస్టెంట్ ఎల‌క్టోర‌ల్ రిజిస్ట్రేష‌న్ అధికారి (ఏఈఆర్ఓ), బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ) సహా దిగువ స్థాయి అధికారుల బదిలీని చీఫ్ ఎల‌క్షన్ ఆఫీస‌ర్ (సీఈఓ) తన స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఈ కేటగిరీల ఖాళీ పోస్టుల భర్తీకి కూడా ఇది వర్తిస్తుంద‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రత్యామ్నాయ అధికారిని పోస్ట్ చేసేటప్పుడు డీఈఓ కూడా నిరంతరం సంప్రదించాల‌ని, అవసరమైన చోట సీఈఓ కమిషన్‌ను సంప్రదించాల‌ని పేర్కొన్నారు. ఏ అధికారిపైన క‌మిష‌న్ ఎటువంటి క్రమ‌శిక్షణా చ‌ర్యల‌ను సిఫారసు చేయ‌కూడ‌ద‌ని, ఎటువంటి జ‌రిమానాలు విధించ‌కూడద‌ని పేర్కొంది. ఎవ‌రిపైనైనా క్రిమిన‌ల్ కేసులు పెండింగ్‌లో ఉన్నా, అస‌మ‌ర్థత వంటి కేసులుపై ఉన్నవారు కూడా ఓటరు జాబితా స‌ర‌వ‌ణ‌కు సంబంధించిన ప‌ని చేయ‌డానికి ఇబ్బంది ఉండ‌దు. అయితే అనుమానం ఉన్నట్లయితే, సీఈఓ తనకు అవసరమైన చోట కమిషన్‌తో సంప్రదించి నిర్ణయం తీసుకోవ‌చ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీని ప్రకారం, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రోల్స్ తయారీకి సంబంధించిన అధికారులందరినీ అంటే అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు (జిల్లా కలెక్టర్లు), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్లు, డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలోని అడిషన‌ల్‌ మునిసిపల్ కమీషనర్లు) అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ తహశీల్దార్లు), సూపర్‌వైజర్లు (వీఆర్ఓలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ & వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులు), బూత్ లెవల్ అధికారులుగా నియమితులైన ఇతర అధికారులను ఎన్నిక‌ల సంఘం ముంద‌స్తు అనుమ‌తి లేకుండా 2024 అక్టోబ‌ర్ 29 నుండి 2025 జ‌న‌వ‌రి 1 వ‌ర‌కు బ‌దిలీలు చేయ‌డానికి వీలులేద‌ని స్పష్టం చేసింది.

పైన పేర్కొన్న అధికారులు, ఉద్యోగులు ఉన్నారో వారి పోస్టుల‌ను ఖాళీగా ఉండ‌కూడదని, ఒకవేళ ఉంటే అక్టోబ‌ర్ 19 నాటికి భ‌ర్తీ చేయాల‌ని ఎన్నిక‌ల సంఘం స్పష్టం చేసింది. ఓట‌రు జాబితా ముసాయిదా ప్రచురణకు ముందే అన్ని కీలక ఎన్నికల అధికారుల ఖాళీలు భర్తీ చేప‌ట్టాల‌ని, అక్టోబ‌ర్ 10 నాటికి భ‌ర్తీ చేయాల‌ని ఖాళీల‌ను నివేదించాల‌ని సూచించింది. కలెక్టర్లు / జిల్లా ఎన్నికల అధికారులు సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లతో సంప్రదించి అవసరమైన చర్యలను తీసుకుంటార‌ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జ‌గ‌దీశ్వరరావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

సంబంధిత కథనం