India Canada Issue : ట్రూడో వ్యాఖ్యలపై భారత్ కౌంటర్.. ఇరకాటంలో వ్యాపార వర్గాలు.. వాణిజ్య సంబంధాలపై ప్రభావం!-tension between india and canada effects to trade relations and others complete details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  India Canada Issue : ట్రూడో వ్యాఖ్యలపై భారత్ కౌంటర్.. ఇరకాటంలో వ్యాపార వర్గాలు.. వాణిజ్య సంబంధాలపై ప్రభావం!

India Canada Issue : ట్రూడో వ్యాఖ్యలపై భారత్ కౌంటర్.. ఇరకాటంలో వ్యాపార వర్గాలు.. వాణిజ్య సంబంధాలపై ప్రభావం!

Anand Sai HT Telugu
Oct 17, 2024 12:30 PM IST

India Canada Issue : నిజ్జర్ హత్య కేసు గురించి భారత్-కెనడా మధ్య వివాదం నడుస్తోంది. తమ వద్ద ఆధారాలు లేవంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత్ కౌంటర్ ఇచ్చింది. మరోవైపు వ్యాపార వర్గాల్లో ఆందోళన మెుదలైంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీ- కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో
భారత ప్రధాని నరేంద్ర మోదీ- కెనడా ప్రధాని జస్టిన్​ ట్రూడో (AP)

భారత్‌తో కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు దేశాల మధ్య మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ అనుకూలవాది నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో కామెంట్స్ చేశాడు. అయితే తాజాగా తమ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారమే తప్ప పక్కా ఆధారాలు లేవని చెప్పారు. దీనిపై భారత్ గట్టిగా స్పందించింది. మేం ఎంతోకాలంగా చెబుతున్నదే ఇప్పుడు నిజమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ అన్నారు. భారత్-కెనడా మధ్య పరిస్థితులు దిగజారాడానికి కెనడా ప్రధాని చేసిన వ్యాఖ్యలే కారణన్నారు.

మరోవైపు భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తత వ్యాపార వర్గాలను ఇరకాటంలో పడేసింది. ఇది క్లిష్ట సమయంగా ప్రోగ్రెసివ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (పీఎఫ్టీఐ) చైర్మన్ దీపక్ మైనీ అన్నారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఈ టెన్షన్ పెరిగితే వ్యాపారం క్షీణించే అవకాశం ఉందని చెప్పారు.

ఇది ట్రేడింగ్ కంపెనీలకు నష్టం కలిగించడమే కాకుండా, సాధారణ వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతుంది. కెనడాకు చెందిన భారతీయ విద్యార్థులు, వృత్తి నిపుణులపై దీపక్ ఆందోళన వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ వంటి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై ఎలాంటి ఆధారాలు లేకుండా అనైతిక ఆరోపణలు చేస్తున్న తీరు ఏ కోణంలోనూ సమర్థనీయం కాదన్నారు. ఇది కెనడాకు మరింత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని చెప్పారు.

భారత్, కెనడాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 8 బిలియన్ డాలర్లు. ఇందులో ప్రధానంగా భారతదేశం కెనడా నుండి పప్పుధాన్యాలు, పొటాష్, చమురు, గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటుంది. భారత్‌ కెనడాకు ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఐటీ సేవలు, ఆభరణాలను ఎగుమతి చేస్తుంది. దౌత్య సంబంధాలలో పెరుగుతున్న ఇబ్బందులతో వాణిజ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది వ్యాపార భాగస్వామ్యాలు, సరఫరాలో అంతరాయాలకు దారితీస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం ఇరు దేశాల వాణిజ్య అవకాశాలను దెబ్బతీసింది. ఇది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలకు హాని కలిగిస్తుంది.

కెనడాలో చదువుకునే, పనిచేస్తున్న భారతీయులకు వీసా ప్రక్రియల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇండియా నుంచి వెళ్లిన చాలా మంది విద్యార్థులు కెనడాలో చదువుతున్నారు.

వీటితో పాటు కెనడా ఐటీ, ఇతర కీలక పరిశ్రమల్లో పనిచేసే నిపుణులు కూడా అనిశ్చితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కెనడాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రవాస భారతీయులకు ఉద్రిక్త పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రవాస భారతీయులు రెండు దేశాల మధ్య బలమైన వారధిగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారికి కూడా సవాళ్లు పెరిగే అవకాశం ఉంది.

ముందుకెళ్లి తన తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత కెనడాపై ఉందని దీపక్ అన్నారు. తద్వారా భారత్ సానుకూల దిశలో పయనించగలదని, కెనడాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తుందని చెప్పారు. కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. పరిశ్రమలు, వ్యాపారాలు బయటపడాలంటే దౌత్యపరంగా ఈ పరిస్థితిని పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం.

Whats_app_banner