Tech Mahindra Q3 Results: టెక్ మహీంద్రా క్యూ3 నికర లాభం 60 శాతం డౌన్-tech mahindra q3 net profit falls 60 percent to 510 crores ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tech Mahindra Q3 Results: టెక్ మహీంద్రా క్యూ3 నికర లాభం 60 శాతం డౌన్

Tech Mahindra Q3 Results: టెక్ మహీంద్రా క్యూ3 నికర లాభం 60 శాతం డౌన్

HT Telugu Desk HT Telugu
Jan 24, 2024 05:08 PM IST

Tech Mahindra Q3 Results: కార్యకలాపాల ద్వారా టెక్ మహీంద్రా ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4 శాతం తగ్గి రూ. 13,734.6 కోట్ల నుంచి రూ. 13,101 కోట్లకు పరిమితమైంది.

60 శాతం తగ్గిన టెక్ మహీంద్రా నికర లాభం
60 శాతం తగ్గిన టెక్ మహీంద్రా నికర లాభం (Reuters)

ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా నికర లాభం 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 60 శాతం క్షీణించి రూ. 510.4 కోట్లకు పరిమితమైంది.

మహీంద్రా గ్రూప్ కంపెనీ అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,296.6 కోట్లు, అంతక్రితం త్రైమాసికంలో రూ. 493.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.

2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.13,734.6 కోట్ల నుంచి 4 శాతం తగ్గి రూ.13,101.3 కోట్లకు పరిమితమైంది.

టెక్ మహీంద్రా నిర్వహణ లాభంలో కూడా గణనీయమైన క్షీణత ఉంది. మార్జిన్ గత సంవత్సరం 12 శాతం నుండి 5.4 శాతానికి తగ్గింది.

ఫలితాల ప్రకటనకు ముందు బాంబే స్టాక్ ఎక్సేంజ్‌లో టెక్ మహీంద్రా కంపెనీ షేరు 3.09 శాతం లాభంతో రూ.1,407.75 వద్ద ముగిసింది.

2023 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా వడ్డీ, పన్నులు, తరుగుదల, అమోర్టైజేషన్ (ఇబిటా) రాబడులు ఏడాది ప్రాతిపదికన 46.5 శాతం క్షీణించి రూ.1,146 కోట్లకు పరిమితమయ్యాయి. సీక్వెన్షియల్ గా చూస్తే ఇబిటా 6.9 శాతం పెరిగింది.

డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి టెక్ మహీంద్రా ఉద్యోగుల సంఖ్య 1,46,250గా ఉండగా, త్రైమాసిక ప్రాతిపదికన 4,354 మంది ఉద్యోగులు తగ్గారు. 2023 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఈపీఎస్ రూ.14.64 నుంచి రూ. 5.76కు తగ్గింది.

‘తయారీ, హెల్త్ కేర్ విభాగాల్లో వృద్ధి ఉన్నప్పటికీ కమ్యూనికేషన్స్, బీఎఫ్ ఎస్‌ఐ, హైటెక్ వంటి రంగాల్లో వ్యయాలు మందగించడంతో ఈ త్రైమాసికం మిశ్రమ ఫలితాలను ఇచ్చింది. మేము అంతర్గతంగా కొత్త నిర్మాణం కింద పునర్నిర్మాణం మరియు మా సంస్థ పునాదులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నాము" అని టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మోహిత్ జోషి అన్నారు.

"ఈ సంవత్సరం మా పోర్ట్ఫోలియోను సమీక్షించడానికి మాకు అవకాశం ఇచ్చింది. ఈ చర్యలు మా మార్గాన్ని సరిదిద్దడానికి మరియు దీర్ఘకాలికంగా విలువను అందించడానికి మాకు సహాయపడతాయని మేము విశ్వసిస్తున్నాము. ఈ ఏడాది పటిష్టమైన నగదు మార్పిడిల ద్వారా మేము ప్రోత్సాహం పొందాం. ఇతర కార్యాచరణ రంగాలలో కూడా ఈ కఠినతను కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము" అని టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రోహిత్ ఆనంద్ అన్నారు.

Whats_app_banner