Tata Technologies IPO: నవంబర్ 22న టాటా టెక్నాలజీస్ ఐపీఓ.. గెట్ రెడీ..
Tata Technologies IPO: టాటా గ్రూప్ సంస్థల నుంచి చాలా సంవత్సరాల తరువాత ఐపీఓ వస్తోంది. టాటా టెక్నాలజీస్ ఐపీఓ నవంబర్ 22 న మార్కెట్లోకి వస్తోంది.
Tata Tech IPO news: టాటా గ్రూప్ సంస్థలు అటు వినియోగదారులు, ఇటు ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొన్న సంస్థలు. తాజాగా ఈ గ్రూప్ నుంచి మరో ఐపీఓ వస్తోంది. టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ నుంచి ఐపీఓ రాబోతోంది.
నవంబర్ 22..
టాటాటెక్నాలజీస్ IPO సబ్‌స్క్రిప్షన్ తేదీ నవంబర్ 22, బుధవారం నుంచి సబ్ స్క్రిప్షన్ కు ఓపెన్ అవుతుంది. శుక్రవారం, నవంబర్ 24న ముగుస్తుంది. ఈ ఐపీఓ లాట్ సైజ్ 30 షేర్లు. రిటైల్ ఇన్వెస్టర్లు 13 లాట్స్ వరకు సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ ఐపీఓలో రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేర్ ప్రైస్ బ్యాండ్ రూ. 475 నుంచి రూ. 500 మధ్య ఉంటుంది. నవంబర్ 30వ తేదీన షేర్స్ అలాట్ మెంట్ ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి రీఫండ్ ప్రాసెస్ ను ప్రారంభిస్తారు. డిసెంబర్ 4వ తేదీన షేర్లు అలాట్ అయిన వారి డిమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు డిపాజిట్ అవుతాయి. డిసెంబర్ 5వ తేదీన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది.
రిటైల్ ఇన్వెస్టర్లకు 35%
ఈ ఐపీఓలో 50% షేర్లను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు (Qualified Institutional Buyers - QIB), 15% షేర్లను నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (Non Institutional Investors - NII) లకు రిజర్వ్ చేశారు. 35% షేర్లను రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అట్టి పెట్టారు. సంస్థ ఉద్యోగుల కోసం 2,028,342 షేర్లను రిజర్వ్ చేశారు. అలాగే, టాటా మోటార్స్ షేర్ హోల్డర్ల కోసం 6,085,027 షేర్లను రిజర్వ్ చేశారు.
3,042.51 కోట్లు..
ఈ ఐపీఓ ద్వారా రూ. 3,042.51 కోట్లను సమీకరించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్ మేనేజర్స్ గా JM ఫైనాన్షియల్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మరియు బోఫా సెక్యూరిటీస్ ఇండియా లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయి. అలాగే, రిజిస్ట్రార్ గా లింక్ ఇన్ టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవహరిస్తోంది..
Tata Technologies IPO GMP: టాటా టెక్నాలజీస్ జీఎంపీ
ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న టాటా టెక్నాలజీస్ ఐపీఓ షేర్లు గ్రే మార్కెట్లో దూసుకుపోతున్నాయి. నవంబర్ 16న గ్రే మార్కెట్లో ఈ షేర్లు రూ. 298 ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అంటే, లిస్టింగ్ ప్రైస్ తో పోలిస్తే, దాదాపు 60% అధికం.
సూచన: ఇది నిపుణుల సూచనలు, సలహాలతో కూడిన కథనం. ఇన్వెస్టర్లు స్వీయ విచక్షణతో నిర్ణయం తీసుకోవడం సముచితం.