Tata Motors: టాటా సఫారీ, టాటా హ్యారియర్ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ బుకింగ్స్ ప్రారంభం; అక్టోబర్ లో డెలివరీ
Tata Motors: ప్రీమియం మోడల్స్ టాటా సఫారీ, టాటా హ్యారియర్ కార్ల ఫేస్ లిఫ్ట్ వర్షన్స్ ను టాటా మోటార్స్ లాంచ్ చేసింది. సరికొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్, ఏడీఏఎస్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు.
Tata Motors: 2023 మోడల్ టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ ఎస్ యూ వీ ల బుకింగ్‌లను టాటా మోటార్స్ శుక్రవారం ప్రారంభించింది. ఈ రెండు ఫ్లాగ్‌షిప్ ఎస్ యూ వీ ల డెలివరీ అక్టోబర్‌లో ప్రారంభమవుతుంది.
రూ. 25 వేలతో బుకింగ్
2023 టాటా హారియర్, టాటా సఫారీ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ను కొనుగోలు చేయాలనుకునేవారు తమ సమీపంలోని టాటా మోటార్స్ డీలర్ షిప్స్ లో రూ. 25 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ ధరలను ఇంకా ప్రకటించలేదు. వాటి ధరలను ప్రకటించిన వెంటనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటితో హారియర్ పోటీ పడుతోంది. అలాగే, టాటా సఫారి మహీంద్రా XUV700 తో పోటీ పడుతోంది. తమ లేటెస్ట్ మోడల్స్ లో చేసిన మార్పులను టాటా మోటార్స్ వెల్లడించింది.
డిజైన్ అప్‌డేట్
హారియర్, సఫారీ ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ కొత్త ఫ్రంట్ ఫేస్‌తో వస్తున్నాయి. హెడ్‌లైట్ సెటప్ ను పూర్తిగా రీ డిజైన్ చేశారు. హారియర్ లో.. 12.30 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ మరియు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుపర్చారు. ఇవి 2023 నెక్సాన్, నెక్సాన్ EVలో ఉన్నవాటి తరహాలో ఉంటాయి. డ్యాష్‌బోర్డ్ యాంబియంట్ లైటింగ్‌తో వస్తుంది. కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు టాటా మోటార్స్ లోగోను చూపించే బ్యాక్‌లిట్ ప్యానెల్, మౌంటెడ్ కంట్రోల్స్‌తో వస్తుంది. ఇందులో 10 జేబీఎల్ స్పీకర్స్ తో హార్మన్ సౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఈజీ డ్రైవింగ్, ఈజీ పార్కింగ్ కోసం 360 డిగ్రీ కెమెరా ను పొందుపర్చారు.
సేఫ్టీ..
హారియర్, సఫారీ టాప్ ఎండ్ వేరియంట్ లలో ఏడు ఎయిర్‌బ్యాగ్ ఉంటాయి. అన్ని వేరియంట్లలో సాధారణంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి, కానీ, డ్రైవర్ మోకాళ్లను రక్షించడానికి ఉద్దేశించిన ఏడవ ఎయిర్‌బ్యాగ్ మాత్రం టాప్-ఎండ్ వేరియంట్‌లలో మాత్రమే ఉంటుంది.
ఇంజన్
కొత్త హారియర్, సఫారి ఫేస్ లిఫ్ట్ మోడల్స్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో మాత్రమే లభిస్తాయి. 6-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఇంజన్ 167.6 బీహెచ్ పీ శక్తిని మరియు 350 ఎన్ఎ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్ అనే మూడు డ్రైవ్ మోడ్‌లలో లభిస్తుంది.