Reliance Jio, Airtel: రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ దూకుడు.. వొడాఫోన్ ఐడియాకు మరింత ఎదురుదెబ్బ
Reliance Jio, Airtel: మార్చిలో కొత్త సబ్‍స్క్రైబర్లను రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ యాడ్ చేసుకున్నాయి. వొడాఫోన్ ఐడియా మాత్రం భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోయింది. పూర్తి వివరాలు ఇవే.
Reliance Jio, Airtel: దేశంలో అతిపెద్ద టాప్-2 టెలికం సంస్థలు రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్‌టెల్(Airtel)లకు ఈ ఏడాది మార్చిలో సబ్‍స్క్రైబర్లు మరింత పెరిగారు. మార్చిలో రిలయన్స్ జియోకు మరో 30.5లక్షల మంది కొత్త మొబైల్ యూజర్లు యాడ్ అయ్యారు. మార్చి నెలకు సంబంధించిన టెలికం యూజర్ల డేటాను టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సోమవారం (మే 22) వెల్లడించింది. టెలికం సంస్థల గణాంకాలను ప్రకటించింది. ఆ వివరాలు ఇవే.
Reliance Jio, Airtel: మార్చిలో రిలయన్స్ జియో 30.5 మంది కొత్త మొబైల్ సబ్‍స్క్రైబర్లను యాడ్ చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా జియో వినియోగదారుల సంఖ్య 43 కోట్లు దాటింది. ఫిబ్రవరిలో ఇది 42.71లక్షలుగా ఉండేది. ఇక మార్చిలో ఎయిర్‌టెల్ కొత్తగా 10.37లక్షల మంది కొత్త సబ్‍స్క్రైబర్లను పొందింది. దీంతో ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 37.09కోట్లకు చేరింది. ఫిబ్రవరి ముగిసే నాటికి ఈ సంఖ్య 36.98 కోట్లుగా ఉండేది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలోనూ ఈ రెండు టెలికం సంస్థలకు యూజర్లు పెరిగారు.
వొడాఫోన్ ఐడియాకు మరిన్ని కష్టాలు
Vodafone Idea (Vi): ఓవైపు ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వొడాఫోన్ ఐడియా(Vi)కు తిప్పలు పెరుగుతున్నాయి. యూజర్లు క్రమంగా ఆ నెట్‍వర్క్ నుంచి బయటికి వస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో 12.12 లక్షల మంది యూజర్లను వొడాఫోన్ ఐడియా కోల్పోయిందని ట్రాయ్ గణాంకాలు వెల్లడించాయి. దీంతో వొడాఫోన్ ఐడియా సబ్‍స్కైబర్ల సంఖ్య 23.67 కోట్లకు పడిపోయింది. ఫిబ్రవరిలో ఇది 23.79కోట్లుగా ఉండేది.
Reliance Jio, Airtel: మరోవైపు, దేశవ్యాప్తంగా 5జీ నెట్‍వర్క్‌ను రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని వందలాది నగరాల్లో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే, 5జీ ఉన్న ప్రాంతాల్లో 5జీ నెట్‍వర్క్‌పై ఉచితంగా అన్‍లిమిడెట్ డేటా అందిస్తున్నాయి. రూ.239 అంతకన్నా ఎక్కువ ప్లాన్‍తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు ఈ సదుపాయాన్ని ప్రస్తుతం ఇస్తున్నాయి. 5జీ నెట్‍వర్క్ విస్తరణతో జియో, ఎయిర్‌టెల్.. యూజర్ల విషయంలో లబ్ధి పొందుతున్నట్టు కనిపిస్తోంది.
Vodafone Idea (Vi): మరోవైపు, వొడాఫోన్ ఐడియా మాత్రం ఇప్పటి వరకు 5జీ నెట్‍వర్క్ లాంచ్ చేయలేదు. 5జీ గురించి అధికారికంగా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఆ కంపెనీ తీవ్రంగా కూరుకుపోయింది. కొత్త రుణాలు, నిధుల సమీకరణ కోసం వొడాఫోన్ ఐడియా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో యూజర్లను కూడా భారీగా కోల్పోతుండడం వొడాఫోన్ ఐడియాకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెడుతోంది.