Reliance Jio: జియో ఏఐ - క్లౌడ్ వెల్ కమ్ ఆఫర్; జియో యూజర్లకు ఫ్రీ గా 100 జీబీ స్టోరేజీ
Reliance Jio: 100 జీబీ ఉచిత స్టోరేజ్ తో జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ ఏజీఎం లో మాట్లాడుతూ ముకేశ్ అంబానీ జియో టీవీ ప్లస్ పై పలు ఇతర ఆఫర్లను కూడా ప్రకటించారు.
Reliance Jio: రిలయన్స్ ఏజీఎంలో 'జియో ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్'ను ముకేశ్ అంబానీ (mukesh ambani) ప్రకటించారు. ఈ కొత్త ఆఫర్ గురించి ఆయన మాట్లాడుతూ, "జియో వినియోగదారులు వారి ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర అన్ని డిజిటల్ కంటెంట్ మరియు డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి 100 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజీని పొందుతారు. ఈ ఏడాది దీపావళి నుంచి జియో (jio) ఏఐ-క్లౌడ్ వెల్కమ్ ఆఫర్ ను ప్రారంభించాలని యోచిస్తున్నాం. క్లౌడ్ డేటా స్టోరేజ్, డేటా ఆధారిత ఏఐ సేవలు ప్రతిచోటా అందరికీ అందుబాటులో ఉంటాయి’’ అని వెల్లడించారు.
కృత్రిమ మేధ (ఏఐ) శక్తి
‘‘ప్రతి ఒక్కరికీ, ప్రతిచోటా అందుబాటులో ఉంచడంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) నిజమైన శక్తి ఉంది. జియో యొక్క AI ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీవన్ విజన్ తో, AIని ప్రజాస్వామ్యీకరించడానికి మేము కట్టుబడి ఉన్నాము, భారతదేశంలోని ప్రతి ఒక్కరికీ అత్యంత సరసమైన ధరలకు శక్తివంతమైన AI మోడళ్లు, సేవలను అందిస్తాము. దీన్ని సాధించడానికి, మేము నిజమైన జాతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలకు పునాది వేస్తున్నాము. జామ్ నగర్ లో గిగావాట్ స్కేల్ ఏఐ-రెడీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నాం. ఇది పూర్తిగా రిలయన్స్ గ్రీన్ ఎనర్జీతో పనిచేస్తుంది’’ అని ముకేశ్ అంబానీ వివరించారు.
కొత్త జియో టీవీ + ఆఫర్లు
జియో టీవీ + లో ప్రారంభించనున్న కొత్త ఆఫర్ల గురించి, ముకేశ్ అంబానీ కుమారుడు, రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాశ్ అంబానీ వివరించారు. ‘‘జియో టీవీ + మీ వినోదాన్ని - లైవ్ టీవీ, ఆన్-డిమాండ్ షోలు, మరిన్ని యాప్ లను ఉపయోగించడానికి సులభమైన ప్లాట్ ఫామ్ తో వస్తోంది. జియోటివి + తో, మీరు 860 కి పైగా లైవ్ టివి ఛానెళ్లను వీక్షించవచ్చు. అద్భుతమైన హైడెఫినిషన్ లో అన్ని ప్రముఖ ఛానెల్స్, అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్ స్టార్ వంటి ఓటీటీల నుండి ఉత్తమ కంటెంట్ మొదలైనవన్నీ ఒకే చోట లభిస్తాయి. సూపర్ ఫాస్ట్ ఛానల్ స్విచ్చింగ్ అనుభవం కోసం జియో టీవీ+ ను ఆప్టిమైజ్ చేశాం’’ అని ఆకాశ్ అంబానీ వెల్లడించారు.
జియో ఫోన్ కాల్ ఏఐ
ఆకాష్ అంబానీ కొత్త జియో ఫోన్ కాల్ ఏఐని కూడా ప్రవేశపెట్టారు. దీనిపై మాట్లాడుతూ, మీరు ఫోన్ కాల్ చేసినంత సులువుగా ఏఐ ని ఉపయోగించేలా ఈ జియో ఫోన్ కాల్ సర్వీస్ చూస్తుందని తెలిపారు. ‘‘మేము అభివృద్ధి చేస్తున్న కొత్త సర్వీస్ ఏఐని ఉపయోగించడం ఫోన్ కాల్ చేసినంత సులభం చేస్తుంది. మేము ఈ సేవను జియో ఫోన్ కాల్ ఏఐ అని పిలుస్తాము, ఇది ప్రతి ఫోన్ కాల్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. జియో ఫోన్ కాల్ ఏఐ (Jio Phonecall AI) ఏదైనా కాల్ ను రికార్డ్ చేసి జియో క్లౌడ్ లో నిల్వ చేయగలదు. అంతేకాదు, ఆ కాల్ వివరాలను ఆటోమేటిక్ గా ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ గా వాయిస్ నుండి టెక్స్ట్ గా మారుతుంది. అంతేకాదు, ఆ కాల్ వివరాలను మరొక భాషలోకి కూడా అనువదించగలదు. ముఖ్యమైన వాయిస్ సంభాషణలను భద్రపర్చుకోవడానికి వీలు కల్పిస్తుంది’’ అని ఆకాశ్ అంబానీ వివరించారు.