PNG, CNG prices: దేశీయంగా, ప్రభుత్వ రంగ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న సహజవాయువు ధరలకు సంబంధించి నూతన విధానాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ విధానం ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (piped natural gas PNG), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (compressed natural gas CNG) ధరలు 11% వరకు తగ్గనున్నాయి. ఈ ధరల తగ్గింపు శనివారం నుంచే అమల్లోకి వస్తుంది.
సహజవాయు ధరలపై కేంద్రం ఆమోదించిన కొత్త ధరల విధానం కారణంగా వంటకు ఉపయోగించే పైప్డ్ నేచురల్ గ్యాస్ (piped natural gas PNG), వాహనాలకు ఇంధనంగా వాడే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (compressed natural gas CNG) ధరలు 11% వరకు తగ్గనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ నిర్ణయం కారణంగా కోట్లాది మంది ప్రజలు, ముఖ్యంగా పీఎన్జీ, సీఎన్జీ వాడుతున్న వినియోగదారులు లబ్ధి పొందుతారని తెలిపారు. ‘‘ఇది దేశ ప్రజలకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇస్తున్న బహుమతి’’ అన్నారు.
పుణెలో సీఎన్జీ కేజీ ధర రూ. 92 ఉంటే, ఇకపై అది రూ. 87 అవుతుందని, అలాగే పీఎన్జీ రూ. 57 నుంచి రూ. 52 కి తగ్గుతుందని, బెంగళూరులో రూ. 58.5 నుంచి రూ. 52 కి తగ్గుతుందని, ఢిల్లీలో రూ. 54 నుంచి రూ. 52కి తగ్గుతుందని కేంద్ర మంత్రి ఠాకూర్ వివరించారు. ప్రముఖ ఆర్థిక వేత్త కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలోని సిఫారసుల ప్రకారం ఈ నూతన ధరల విధానం రూపొందించామన్నారు. ఈ ధరలు ఓఎన్జీసీ (ONGC), ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఉత్పత్తి చేసిన సహజవాయువుకే వర్తిస్తాయని, రిలయన్స్ కేజీ డీ6 వంటి ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి చేసిన నేచురల్ గ్యాస్ కు వర్తించదని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.